Sunday 25 August 2019

రామాయణము యుద్ధకాండ -ఏబదియవసర్గ

                             రామాయణము 

                              యుద్ధకాండ -ఏబదియవసర్గ      

వానరులు భయముతో పారిపోవుట చూసిన సుగ్రీవుడు వానరులంతా ఎందుకిలా పారిపోవుచున్నారని ఆలోచించెను . అప్పుడే విభీషణుడు అక్కడికి వచ్చెను . సుగ్రీవుడికి విభీషణుడిని చూసే వానరులు పారిపోవుచున్నారని అర్ధము చేసుకున్నాడు . వెంటనే జాంబవంతుడు పారిపోవుచున్న పెద్దగా పిలుస్తూ ఆపెను . అంతట విభీషణుడు రామలక్ష్మణుల కన్నులను  మంత్రపూరిత జలములతో తుడిచెను . వారి దురవస్థను చూసిన వానరులందరూ మిక్కిలి చింతించసాగిరి . 
అప్పుడు సుగ్రీవుడు" వీరు కొంచం కోలుకున్నతర్వాత వీరిని కిష్కింధకు పంపి వానరసైన్యముతో నేనే లంకపై దాడి చేసి ఆ రావణుడిని ,అతడి పరివారమును చంపి సీతామాతను తీసుకువచ్చి శ్రీరాముడికి అప్పగిస్తాను "అని పలికెను . వానరులంతా మాట్లాడుకుంటుండగా పెద్దగా పెనుగాలులు వీచెను . సముద్రములో నీరు అల్లకల్లోలమయ్యెను . అందరూ ఏమిజరుగుతోందో అర్ధము కాక ,దిక్కులు చూడసాగిరి . అప్పుడే పక్షిరాజైన గరుత్మంతుడు అక్కడికి వచ్చెను గరుత్మంతుడు రావడంతోనే సర్పాస్త్రములో వున్న సర్పములన్నీ భయముతో ఆరిపోయెను . గరుత్మంతుడు రామలక్ష్మణుల వద్దకు వచ్చి ,రామలక్ష్మణులను తన చేతితి స్పృశించెను . వెంటనే రామలక్ష్మణుల శరీరముపై వున్న గాయములన్ని మాయమైపోయి వారికి పూర్వ రూపము వచ్చెను . 
అప్పుడు రామలక్ష్మణులు లేచి కూర్చొనెను . పిమ్మట గరుత్మంతుడు రామలక్ష్మణులను కౌగిలించుకొనెను . అప్పుడు శ్రీరాముడు గరుత్మంతునితో "మహానుభావా !నీవు రావటంతో మేము నాగాస్త్రము నుండి విముక్తులమయ్యాము . పైగా మాకు పూర్వపు జవసత్వములు వచ్చినవి . మాకు మహోపకారం చేసితివి . "అని పలికెను . ఆ మాటలకు గరుత్మంతుడు "శ్రీరామా !మనము స్నేహితులు మీరు ఆపదలో వున్నారని తెలిసి పరుగు పరుగు న వచ్చితిని . రాక్షసులు మాయా స్వభావులు . వారితో జాగ్రత్తగా ఉండండి . "అని పలికెను . ఆ విధముగా పలికి గరుత్మంతుడు శ్రీ రాముని వద్ద సెలవు తీసుకుని వెళ్లిపోయెను . 

రామాయణము యుద్ధకాండ ఏబదియవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment