Sunday 18 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదినాలుగవసర్గ

                                  రామాయణము 

                                    యుద్ధకాండ -నలుబదినాలుగవసర్గ 

ఆ విధముగా వానరులకు రాక్షసులకు మధ్య ఘోర యుద్ధము జరుగుతుండగా సూర్యుడు అస్తమించెను . వానరులు ,రాక్షసులు యుద్ధము జయింపవలననే కోరికతో పట్టుదలతో యుద్ధము చేయసాగిరి . దట్టమైన చీకట్లు వ్యాపించుటచే ,ఇరుపక్షములవారు ఒకరినొకరు గుర్తింపలేక "నీవు రాక్షసుడవేనా ?"అని వానరులు ,"నీవు వానరుడవేనా "అని రాక్షసులు అడిగి తెలుసుకుని మరీ యుద్ధము చేయసాగిరి . 
రాక్షసులు క్రోధావేశముతో వానరులపై పడి వారిని భక్షించుచుండిరి . అప్పుడు వానరులు కూడా కోపోద్రిక్తులై రాక్షసులపై పడి తమ పదునైన దంతములతో వారిని చీల్చుచుండిరి . మాయావులైన రాక్షసులు ఒకొకప్పుడు కనపడుచు ,మరొకసారి కనపడక యుద్ధము చేయుచుండిరి . అక్కడ రక్తపుటేరులు ప్రవహించినవి . తీవ్రముగా గాయపడి ,గగ్గోలు పెట్టుచున్న రాక్షసుల ,వానరుల ఆర్తనాదములు ఎంతో దారుణముగా వినపడెను . ఆ సమర భూమి గుర్తుపట్టలేనంతగా మారిపోయెను . 
రాక్షసులందరూ ఒక్కుమ్మడిగా విజృంభించి వానరులపై శరవృష్టి కురిపించెను . అలా విజృంభించుచున్నవారిలో ఆరుగురిని శ్రీరాముడు తన బాణములతో చంపివేసెను . పిమ్మట శ్రీరామచంద్ర ప్రభువు అన్ని దిక్కులా తన బాణములను ప్రయోగించెను . ఆ బాణములు తగిలిన రాక్షసులందరూ అగ్నిలో పడిన మిడతలవలె మరణించిరి . 

అప్పుడు వానరులలో బలిష్ఠులు మహాకాయులైన కొండముచ్చులు రాక్షసులను అదిమి పట్టి సంహరించిరి . 
మరోయొకవైపు అందగనితో ఇంద్రజిత్తు యుద్ధమొనర్చుచువుండెను . అంగదుని చేతిలో ఇంద్రజిత్తు రధము అశ్వములు నాశనము కాగా ఏమి చేయలేక  వున్నచోటునే ఇంద్రజిత్తు మాయమయ్యెను . అది చూసిన దేవతలు మహర్షులు ,రామలక్ష్మణులు ఇంద్రజిత్తుని ప్రశంసించిరి . ఆ విధముగా అంగదుని చేతిలో పరాభవం చెందిన ఇంద్రజిత్తు కోపముతో ఎవ్వరికి కనపడకుండా మాయారూపములో ఉండి రామలక్ష్మణులపై నాగాస్త్రమును ప్రయోగించెను . ఆ నాగాస్త్ర ప్రభావము వలన రామలక్ష్మణులు మూర్చిల్లిరి . 

రామాయణము యుద్ధకాండ నలుబదినాలుగవసర్గ సమాప్తము . 

                           శశి 

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment