Sunday 18 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదిమూడవసర్గ

                                    రామాయణము 

                                    యుద్ధకాండ -నలుబదిమూడవసర్గ 

వానరసైన్యము రాక్షస సైన్యము మీదికి పరుగులు తీసెను . అప్పుడు ఆ ఇరువురి సైన్యము మధ్య ధ్వంధ్వ యుద్ధము జరిగెను . అంగదుడిని ఇంద్రజిత్తు తన గదతో కొట్టెను . అప్పుడు అంగదుడు అదే గదను లాక్కుని ,ఇంద్రజిత్తు రధమును ,రధాశ్వములను,సారధిని చిత్తు చేసెను . 
ప్రజంఘనుడు అను రాక్షసుడు విభీషణుడి సచివుడైన సంపాతి పై మూడు బాణములు ప్రయోగించెను . అప్పుడు సంపాతి అక్కడే వున్న నల్లమద్ది చెట్టు ను పీకి ,ప్రజంఘనుడిని కొట్టగా మరుక్షణమే అతడు మరణించెను . 
జంబుమాలి తన బలమును ప్రయోగించుచు ,హనుమంతుడి వక్షస్థలముపై కొట్టెను . వెంటనే హనుమ ఆకాశములో ఎగిరి తన రచేతితో జంబుమాలిని కొట్టెను వెంటనే అతడు మరణించెను . 
'ప్రతపనుడు 'అను రాక్షసుడు నలుడుని తన బాణములచే గాయపరిచేను . వెంటనే నలుడు 'ప్రతపనుడి 'కళ్లు రాలగొట్టెను . 
వానరులకు ప్రభువైన సుగ్రీవుడు తన సైన్యములను దెబ్బతీయుచున్న 'ప్రఘసుని 'సప్తవర్ణ వృక్షముతో చావకొట్టి నిహతుని చేసెను . శ్రీరాముడు తన మీదకు బాణములు వేయుచున్న అగ్నికేతువు ,రశ్మికేతువు ,సుప్తఘ్నుడు ,యజ్ఞకోపుడు అను రాక్షసులను తన బాణములచే యమపురికి పంపెను . 
'మైందుడు 'తన పిడికిలి దెబ్బతో 'వజ్రముష్టి 'అను రాక్షసుని చంపివేసెను . నికుంభుడు అను రాక్షసుడు నీలుని వంద బాణములచే గాయపరిచి ,వికటాట్టహాసము చేసెను . వెంటనే నీలుడు నికుంభుడి రధ చక్రమును పీకి దానితోనే నికుంభుని ,అతడి రధ సారధి ని తల మీద కొట్టెను . విద్యున్మాలి సుషేణుడిని తీవ్రముగా కొట్టి గర్జించెను . అప్పుడు సుషేణుడు ఒక కొండరాయితో విద్యున్మాలి రధమును ధ్వంసము చేసెను అప్పుడు విద్యున్మాలి రధము దిగి ,గదతో తనపై దాడిచేస్తున్న సుషేణుడిని కొట్టెను . ఆ దెబ్బను పట్టించుకొనక సుషేణుడు ఒక కొండరాయితో విద్యున్మాలిని తీవ్రముగా కొట్టెను . వెంటనే అతడు మరణించెను . 
వానర వీరులకు ,రాక్షస యోధులకు ఇలా ఘోరముగా జరిగిన ధ్వంధ్వ యుద్దములో రాక్షసులు వానరుల చేతిలో మట్టికరిచితిరి . ఆ యుద్ధరంగమున ఖడ్గములు ,గదలు ,బల్లెములు ,ఇనుపగుదియలు ,అడ్డుకత్తులు విరిగి పడియుండెను . ముక్కలై పడిపోయిన రథములు చచ్చిపడి వున్న రధాశ్వములు ,మదపుటేనుగులు ,వానరుల యొక్క ,రాక్షసుల యొక్క కళేబరములు రథముల యొక్క చక్రములు  ఆ సమారా భూమి అందు కనపడుచున్నవి . శవములు భక్షించుటకై అక్కడికి నక్కలు గుంపులు గుంపులుగా వచ్చి వున్నవి . రాక్షస యోధులను చీల్చి చెండాడుటచే వానరుల దేహములు రక్తసిత్తములై వున్నవి . అప్పుడు నిశాచరులు (రాత్రిపూట తిరుగు వారైన రాక్షసులు )మళ్లీ ఘోరముగా యుద్ధము చేయుటకై సూర్యాస్తమయముకై (సూర్యాస్తమయ సమయములో రాక్షసుల శక్తి అధికమగును )నిరీక్షించుచుండెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదిమూడవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment