Thursday 22 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదియేడవసర్గ

                                   రామాయణము 

                                 యుద్ధకాండ -నలుబదియేడవసర్గ 

రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు చెప్పిన మాటలు విని మిక్కిలి సంతోషించిన రావణుడు ఇంద్రజిత్తును పంపించివేసి ,అశోకవనంలో సీతాదేవికి కాపలా పెట్టిన రాక్షసస్త్రీలను రప్పించెను . త్రిజట మొదలగు స్త్రీలు రావణుడి ఆజ్ఞ మేరకు వచ్చారు . వారితో రావణుడు "మీరు తక్షణమే బయలుదేరి ,అశోకవనమునకు వెళ్లి ఇంద్రజిత్తు రామలక్ష్మణులను చంపిన విషయము తెలిపి ,ఆమెను పుష్పకవిమానములో తీసుకువెళ్లి ,యుద్ధరంగములో పడివున్న రామలక్ష్మణులను చూపించండి "అని పలికెను . 
రావణుడి ఆజ్ఞ మేరకు త్రిజట మొదలగు రాక్షస స్త్రీలు పుష్పకవిమానమును అశోకవనమునకు తీసుకువెళ్లి ,సీతాదేవిని అందు ఎక్కించి ,యుద్దభూమికి తీసుకువెళ్లిరి . యుద్ధభూమిలో రాక్షసులు సంతోషముగా కోలాహలంగా ఉండిరి . వానరులందరూ బాధతో ఉండిరి . యుద్ధభూమిలో రామలక్ష్మణులు కిందపడి ఉండిరి . వారి కవచములు విరిగి ఉండెను . వారి శరీరములు మట్టికొట్టుకుని ఉండెను . అది చూసిన సీతాదేవి మిక్కిలి రోదించెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు )తెలుగుపండితులు . 

No comments:

Post a Comment