Friday 23 August 2019

రామాయణము యుద్ధకాండ -నలుబదియెనిమిదవసర్గ

                                    రామాయణము 

                                         యుద్ధకాండ -నలుబదియెనిమిదవసర్గ 

మహాబలశాలురైన రామలక్ష్మణులు యుద్ధభూమిలో కిందపడివుండుట చూసిన సీతాదేవి ,అంతులేని శోకముతో కృశించి విలపించసాగెను . ఆ సమయములో సీతామాత తనకు వివాహము కాకముందు పండితులు ,జ్యోతిషశాస్త్రజ్ఞులు తనను దీర్ఘసుమంగళీ అని చక్రవర్తికి భార్య అని చెప్పిన విషయములు గుర్తుతెచ్చుకుని ,ఈ రోజు ఇలా ఎందుకు జరిగిందని వారి మాటలు ఎలా తప్పయ్యాయని రోదించెను . ఆ విధముగా రోదిస్తున్న సీతాదేవిని చూసిన త్రిజట సీతాదేవితో
 "అమ్మా !నీవు దుఃఖించవలదు . నీ భర్త మరణించలేదు . సజీవంగానే వున్నాడు . అందుకు కారణములు చెబుతున్నాను విను . వానర సైన్యము అంతా ప్రశాంతముగా వున్నది . ఒకవేళ రామలక్ష్మణులు మరణించినట్లయితే ,వానరసైన్యము ఇప్పటికే భయముతో పారిపోయెడి వారు . లేదా దుఃఖించెడివారు . అదేమిలేక వారు ప్రశాంతముగా వున్నారు పైగా రామలక్ష్మణులను రక్షించుచున్నారు . మరణించినవారిని రక్షించరుకదా !మరణించినవారి ముఖములు నిర్జీవంగా వికృతముగా ఉంటాయి . రామలక్ష్మణులు కిందపడి వున్నా వారి ముఖములు కళగా వున్నవి . కావున వారు మరణించలేదు . నా మాటలు విని దుఃఖము మానుము . నీ మంచి కోరేదానిగా నీకు ఇవన్నీ చెప్పాను . నా మాట నిజము "అని పలికెను . 
త్రిజట మాటలు విన్న సీతాదేవి కొద్దిగా ఊరడిల్లెను . పిమ్మట రాక్షస స్త్రీలు అశోకవనమునకు సీతాదేవిని చేర్చిరి . రావణాసురునకు విహారభూమి ఐన అశోకవనమునకు చేరిన పిమ్మట సీతాదేవి తన మనసులో రామలక్ష్మణులను తలుచుకుని మిక్కిలి బాధపడెను . 

రామాయణము యుద్ధకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment