Monday, 5 September 2016

రామాయణము బాలకాండ -అరువదియవ సర్గ

                            రామాయణము 

                       బాలకాండ -అరువదియవ సర్గ 

ఆ విధముగా శపించిన తర్వాత అక్కడ వున్న ఋషులు ,మునులతో "ఇతడు సుప్రసిద్దుడైన ఇక్ష్వాకు వంశ మహారాజు ,ధార్మికుడు ,దానశీలుడు సశరీరము గా స్వర్గమునకు వెళ్ళవలెననే కోరికతో నన్ను ఆశ్రయించివున్నాడు . యజ్ఞప్రభావమున యితడు స్వర్గమునకు చేరునట్లు మనము ఒక క్రతువును నిర్వహించవలెను . "అని చెప్పెను . 
ఆయన మాటలు విన్న ఋషులు ,మునులు విశ్వామిత్రుని మాటలు విని తమలో తాము ఈ విశ్వామిత్రుడు ముక్కోపి . ఆయన చెప్పినట్లే చేయుదుము . నిప్పులాంటివాడు ,ఆయనకు కోపము వచ్చినచో శపించగలడు . కావున ఆయన చెప్పినట్లు చేయుదుము . యాగ ఏర్పాట్లు చేయండి . ఈ యాగమునకు విశ్వామిత్రుడు ఆధ్వర్యము వహిస్తాడు  అనుకొనెను . 
యజ్ఞము చక్కగా జరుగుతోంది హావిర్భాగములు అందుకోవడానికి దేవతలు రావట్లేదు . అప్పుడు విశ్వామిత్రుడు కోపముతో ఊగిపోతూ ,"ఓ నరేంద్రా !నా తపః శక్తిని చూడు ఇప్పుడే నిన్ను సశరీరంగా స్వర్గమునకు పంపుతాను . నేను పెక్కు ఏండ్లు చేసిన అమోఘ తపః శక్తిని ధారపోసి నిన్ను స్వర్గానికి పంపుతాను . "అని పలికేను . త్రిశంకువు అందరూ చూస్తుండగానే ఆకాశము వైపు ఎగిరి వెళ్లెను . స్వర్గానికి వచ్చిన త్రిశంకువుని చూసి ఇంద్రుడు సకల దేవతల సమక్షంలో "ఓ త్రిశంకూ వెళ్ళిపో ,నీవు స్వర్గానికి అనర్హుడివి . నీవు గురువు చేత శపింపబడ్డావు కావున నీవు స్వర్గానికి రాలేవు . తలక్రిందులుగా భూమి మీదకు పడిపొమ్ము "అని పలుకగా ,ఆ త్రిశంకువు తలక్రిందులుగా భూమిమీద పడిపోవసాగెను . అలా పడిపోతున్న త్రిశంకుడిని చూసి విశ్వామిత్రుడు "ఆగుము "అని పలికి ఆ త్రిశంకుని అక్కడే నిలిపి ఋషులు ,మునులు అందరూ చూస్తుండగా మరియొక నక్షత్రమండలిని ,మరియొక సప్తర్షిమండలమును ,స్వర్గమును సృష్టించెను .

అప్పుడు అక్కడి మునులందరూ ,దేవతలు ,సప్తఋషులు "ఓ మహానుభావా !తపోధనా !ఈ త్రిశంకువు గురువు చేత శపింపబడెను .. కనుక యితడు సశరీరంగా స్వర్గమునకు చేరుటకు అనర్హుడు "అని పలికిరి . 
అప్పుడు విశ్వామిత్రుడు ఇతడికి సశరీరంగా స్వర్గమునకు పాముతానని మాట ఇచ్చాను కావున నేను సృష్టించిన ఈ స్వర్గము ,నక్షత్రమండలము శాశ్వతముగా ఉంటాయి . అని పలికెను 
అప్పుడు దేవతలు ఋషులు "సరే అట్లే కానిండు . కానీ అతడు గురువుకు చేసిన అపచారం ఫలితముగా తలక్రిందులుగా ఉండును . "అని పలికి తమ స్థానములకు వెళ్లిరి . యజ్ఞము సమాప్తి అయినది . ఋషులు ,మునులు వారి వారి ప్రదేశములు వెళ్లిరి . 
రామాయణము బాలకాండ అరువదియవ సర్గసమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Saturday, 3 September 2016

                                 రామాయణము 

                                  బాలకాండ _ ఏబదితొమ్మిదవసర్గ   

ఆ విధముగా తనను అర్ధించిన త్రిశంకుని మీద జాలి పడిన విశ్వామిత్రుడు "ఓ ఇక్ష్వాకు నరేంద్రా !నీవు ధార్మికుడవని నేను ఎరుగుదును . నీకు నేను అండగా ఉందును . యజ్ఞ కార్యమునకు అవసరమగు మునులను రప్పింతును . నీవు యజ్ఞము చేయుము . నిన్ను ఇలానే సశరీరంగా స్వర్గమునకు నేను పంపుతాను "అని ధైర్యము చెప్పి ,మిక్కిలి బుద్ధిశాలురు ,ధార్మికులు అయిన తన పుత్రులను పిలిచి యజ్ఞమునకు కావలిసిన సామాగ్రిని సమకూర్చమని ఆజ్ఞాపించెను . పిమ్మట తన శిష్యులను పిలిచి "సకల ఋషిగణములను ,వారి శిష్యులను ,బంధు ,మిత్రులను వెంటనే నా ఆదేశము అని చెప్పి తీసుకురండి . ఎవరయినా పరుషముగా పలికిన యెడల నాకు తెలపండి . "అని ఆజ్ఞాపించెను . 
విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారము యజ్ఞమునకు అవసరమగు సమస్త వస్తువులు వచ్చిచేరాయి . సమస్త దిక్కులనుండి ఋషులు ,మునులు ,శిష్య ,ప్రశిష్యులతో కూడి  విచ్చేసిరి . శిష్యులు వచ్చి "గురువర్యా !తమ ఆజ్ఞ అని చెప్పగానే ఋషులు ,మునులు అందరూ సంతోషముతో బయలుదేరిరి .మహోదయుడు అనే ముని ,వశిష్టుని 100 మంది పుత్రులు తప్ప అందరూ వచ్చుచున్నారు . ఓ మునీశ్వరా !ఆ వశిష్టుని పుత్రులు కోపముతో యజ్ఞము చేయువాడు చండాలుడు ,చేయించువాడు క్షత్రియులు  యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలు .ఋషులు ఎట్లు శ్వీకరింతురు . అని నిష్ఠురముగా పలికిరి "అని చెప్పిరి . 
అప్పుడు విశ్వామిత్రుడు కోపముతో "తీవ్రముగా తపమాచరించుచు పవిత్రముగా వున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దుర్మాత్ములందరూ మసియై పోవుదురు . ఇంకా ఏడువందల జన్మలవరకు వారు శవములను భక్షించుచు బ్రతుకుదురు . "దురాత్ముడైన మహోదయుడు కూడా నన్ను దూషించెను కావున అతడు కిరాతుడై జనులందరి చేత దూషించబడును . ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించుచు ,చంపుతూ బ్రతుకుచుందురు . "అని శాపము ఇచ్చెను . 

రామాయణము బాలకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

          








         

Friday, 2 September 2016

రామాయణము బాలకాండ -ఏబదియెనిమదవ సర్గ

                                 రామాయణము 

                                బాలకాండ -ఏబదియెనిమదవ సర్గ 

త్రిశంకు వచనములు విన్న వశిష్టుని పుత్రులు మిక్కిలి కోపముతో ఆయన మాటను కాదని యజ్ఞము జరిపించి ఆయనను అవమానించలేము . అని స్పష్టముగా చెప్పెను . గురుపుత్రుల మాటలు విని త్రిశంకువు" మా కులగురువు అయిన వశిష్ఠుడు ,వారి పుత్రులు అయిన మీరు నా కోరికను తిరస్కరించిరి . మంచిది నేను మరియొక దారి చూసుకొనెదను ."అని పలికెను . 
గురు పుత్రులు త్రిశంకువు వశిష్ట మహర్షి మాటలు ఉల్లంగించుటయే కాక ,మరియొకటి వద్దకు వెళ్తాను అనే మాట కు మిక్కిలి కోపం చెంది చండాలుడవు అవుతావు అని శపించిరి . త్రిశంకువు తన పురమునకు వెళ్లి జరిగినది తలుచుకుంటూ ఉండెను . మరునాడు తెల్లవారి లేచేసరికి త్రిశంకువు నల్లటి రూపముతో ఛండాలత్వమును పొందెను . అతని దుస్తులు సైతము నల్లగా మారిపోయెను . జుట్టు కురచగా మారెను . అతనిని చూసిన మంత్రులు ,అధికారులు భయముతో పరిగిడిరి . జనులు సైతము గుర్తింపకుండిరి . దానితో వంటరి అయిన త్రిశంకువు రాత్రియంబవళ్ళు దుఃఖముతో కృంగిపోవుచు ,చివరికి వశిష్ఠుడి తో వైరభావము కల విశ్వామిత్రుని వద్దకు చేరెను . 
విశ్వామిత్రుడు అతడి రూపము భాద చూసి జాలిపడెను . అతడి ఈ రూపమునకు ,భాదకు కారణమును అడిగెను . 
దానికి త్రిశంకువు తన స్వర్గమునకు వెళ్ళవలననే కోరిక అది తిరస్కరింప బడిన విధము ఆ క్రమములో తాను శపింపబడుట సమస్తము తెలిపెను . మరియు ఇలా పలికెను . "స్వామి !నేను అనేక యజ్ఞములు యాగములు చేసాను ,అనేక దానములు చేసాను . ఎప్పుడు అసత్యము ఆడి ఎరుగను . ప్రజలను ధర్మము అనుసరించి పాలించితిని . అటువంటి నాకు ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది . అయినను నాకు స్వర్గమునకు శరీరముతో వెళ్లాలనే కోరిక పోలేదు . నా ఈ కోరిక తీర్చుటకు మీరే సమర్థులు . ఇక నేను ఇతరులను ఎవ్వరిని ఆశ్రయించను,మీరు తప్ప నన్ను ఆడుకొనగలవారు ఎవ్వరును లేరు . నాయెడ అనుగ్రహమును చూపి ,దైవమును నాకు అనుకూలముగా చేయుటకు అనగా నా అదృష్టమును పండించుటకు మేరె తగుదురు . 

రామాయణము బాలకాండ ఏబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  










                                 

Thursday, 1 September 2016

                                   రామాయణము 

                            బాలకాండ -ఏబదియేడవసర్గ 

విశ్వామిత్రుడు , వశిష్టుని  వలన తనకు కలిగిన పరాభవమును తలచుకుని బాధపడుతూ ,దక్షిణ దిక్కుగా వెళ్లి ఫల మూలములను మాత్రమే తింటూ ఇంద్రియ నిగ్రహముతో తీవ్రమైన తపస్సుని ఆచరించెను . ఆలా చాలాకాలము చేసిన పిమ్మట బ్రహ్మ ప్రత్యక్షమై "నీవాచరించిన ఈ తపశ్చర్యను బట్టీ నిన్ను "రాజర్షి "గా గుర్తించుచున్నాను . అని పలికి తనతో పాటు వచ్చిన దేవతలతో సహా అంతర్ధానమయ్యెను . 
అప్పుడు విశ్వామిత్రుడు "నేనింతటి తీవ్ర తపస్సు చేసినను సమస్త దేవతలు .బ్రహ్మ నన్ను రాజర్షి గానే గుర్తించారు . నా తపస్సుకి తగిన ఫలితము లభించలేదు "అని బాధపడుతూ మునిపటికంటే తీవ్రముగా తపస్సు చేయసాగెను . 
ఇదే కాలములో ఇక్ష్వాకు వంశ ప్రముఖుడు అయిన "త్రిశంకు "మహారాజు రాజ్యమును పాలించుచువుండెను . అతడు సత్యవాది ,జితేంద్రియుడు ,అన్ని విధములుగా ఖ్యాతికెక్కినవాడు . ఆయనకు గొప్ప యజ్ఞాలు చేసి ఆ ప్రభావంతో సశరీరంగా స్వర్గానికి వెళ్లాలనే కోరిక పుట్టెను . వెంటనే అతడు వశిష్ట మహర్షిని ఆహ్వానించి ,ఆయనకు తన కోరికను తెలిపెను . అప్పుడు మహాత్ముడైన వశిష్ఠుడు అది అసాధ్యము అని చెప్పెను . అయినను త్రిశంకు ఎదో విధముగా  తన కోరికను తీర్చుకోవాలనే ఆశతో దక్షిణ దిశగా ప్రయాణించి వశిష్టుని పుత్రులను చూసి వారికి వారిని ప్రార్ధించి తన కోరిక ఎట్లైనను నెరవేర్చమని వేడుకొనెను వశిష్ఠుడు నిరాకరించెనని కూడా తెలిపెను . 


   రామాయణము బాలకాండ ఏబదియేడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






 

Wednesday, 31 August 2016

రామాయణము బాలకాండ -ఏబది ఆరవసర్గ

                                    రామాయణము 

                              బాలకాండ -ఏబది ఆరవసర్గ 

ఆ విధముగా వచ్చిన విశ్వామిత్రుడు ,వశిష్టుని మీద ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను . వశిష్ఠుడు ఏమాత్రము కదలక తన బ్రహ్మదండము ఎత్తి  నిలబడెను . ఆ బ్రహ్మదండ ప్రభావమున ఆగ్నేయాస్త్రము నామరూపములు లేకుండా పోయెను . అందులకు కోపముతో విశ్వామిత్రుడు వరుసగా వారుణాస్త్రము ,రౌద్రాస్త్రము ,ఐన్ద్రాస్త్రము ,పాశుపతము,ఐషీకాస్త్రము ను ప్రయోగించెను . 
ఇవే కాక తాను వారము వల్ల సంపాదించుకున్న సమస్త జీవముల అందు కల అస్త్రములన్నీ ప్రయోగించెను . బ్రహ్మపుత్రుడు అయిన వశిష్ట మహాముని బ్రహ్మ దండము ఆ అస్త్రములన్నిటిని కబళించివేసెను . అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను . బ్రహ్మదండము ఆ బ్రహ్మాస్త్రమును సైతము నిస్తేజమొనర్చెను . ఆసమయములో అక్కడి మునులు ,ఋషులకు వశిష్ట మహర్షి యమధర్మరాజులా ,ఆయన చేతిలోని దండము యమపాశములా కనిపించింది . 
అప్పుడు అక్కడి వారందరూ వశిష్ట మహర్షిని శాంతించమని ,ప్రసన్నుడవమ్మని వేడుకొనిరి . అంత వశిష్ఠుడు శాంతించేను . అప్పుడు విశ్వామిత్రుడు తనలో తాను "ఛీ క్షత్రియ బలము కూడా ఒక బలమా !బ్రహ్మ్తేజో బలమే నిజమైనబలము . ఒకేఒక్క బ్రహ్మదండము నేను తపస్సు ద్వారా సంపాదించుకున్న అనేక అస్త్రములను వమ్ముకావించింది . బ్రహ్మత్వము పొందుటకై క్షత్రియ రోషములను వదిలి ,మనసు ,ఇంద్రియములను నిగ్రహించి తీవ్రముగా తపస్సు చేసెదను "అనుకొనెను . 

రామాయణము బాలకాండ ఏబదిఆరవసర్గ సమాప్తము , 

             శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    








Tuesday, 30 August 2016

                                     రామాయణము 

                                        బాలకాండ- ఏబదియైదవసర్గ 

విశ్వామిత్రుని అస్త్ర ప్రభావముచే సమస్త సైనికులు చెల్లాచెదురు అవుట చూసిన వశిష్ఠుడు ఇంకా సైన్యమును పుట్టించమని ధేనువును ఆజ్ఞాపించెను . ఆయన ఆజ్ఞను అనుసరించి అనేక వేల ,లక్షల మందిని సృష్టించెను . ఆ సైన్యము విశ్వామిత్రుని సైన్యమును నామరూపములు లేకుండా చేయగా ,కోపితులైన విశ్వామిత్రుని 100 మంది కుమారులు వశిష్టుని మీదకు ఆయుధములు చేతబూని దాడికి వచ్చిరి . వశిష్ఠుడు ఒక్క హుంకారముతో వారందరిని భస్మమొనర్చెను . 
తన వందమంది కుమారులు ,సైనికులు అంతా నాశనమగుట చూసి విశ్వామిత్రుడు చింతాక్రాంతుడయ్యెను . కోరలు తీసిన పాము వలె అయ్యెను . రాజ్య పాలన చేయమని ఒక కుమారుడికి అప్పగించి వనములకు వెళ్లెను . కిన్నెరులు ,నాగులు సంచరించునట్టి ఆ హిమవత్పర్వత ప్రాంతమునకు చేరి పరమేశ్వరుని అనుగ్రహము పొందుటకు తపస్సు చేయసాగెను . 
పరమేశ్వరుడు ప్రసన్నుడై వరము కోరమనగా దేవ ,దానవ ,గాంధర్వ ,యక్ష ,కిన్నెర ,రాక్షసుల వద్ద వుండే సమస్త ధనుర్విద్యను ప్రసాదింపమని కోరెను .ఆయన అట్లే ప్రసాదించెను . దివ్యాస్త్రములతో గర్వము అధికముకాగా వశిష్టాశ్రమమునకు వెళ్లి ,తన అస్త్రములను ప్రయోగించెను . ఆ అస్త్రముల దాటికి తపోవనం పూర్తిగా దగ్దమయ్యెను . 
ఈ విధముగా విశ్వామిత్రుడు భయంకరముగా అస్త్రములు ప్రయోగించగా అక్కడ వున్న మునులు ,ఋషులు అందరూ భయముతో పరుగులు తీయసాగిరి . వశిష్ఠుడు ఎంత వారించినా వారు పారిపోవుట ఆపసాగిరి . క్షణములో ఆ ప్రదేశము అంతా శూన్యమాయెను . అప్పుడు వశిష్ఠుడు కోపముతో విశ్వామిత్రుని ఎదుట నిలిచి తన భ్రహ్మ దండమును చేతబూనెను . 

రామాయణము బాలకాండ ఏబదియైదవ సర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  












Sunday, 28 August 2016

రామాయణము బాలకాండ -ఏబదినాల్గవసర్గ

                                రామాయణము 

                             బాలకాండ -ఏబదినాల్గవసర్గ 

ఓ రామా !వశిష్ఠుడు కామధేనువును ఇచ్చుటకు నిరాకరించగా ,విశ్వామిత్రుడు కామధేనువును బలవంతముగా లాగుకొనిపోవుచుండెను . అప్పుడు ఆ కామధేనువు మనసులో బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఇలా అనుకోసాగేను . "మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యజించాడా ?నన్ను ఈ విధముగా రాజభటులు లాక్కుపోవుచున్నారు . ఈ ధర్మాత్ముని నేను మిక్కిలి భక్తితో సేవించుచున్నాను . ఈయనకు నాపై గల ప్రీతి అపారం నేను ఏ అపరాధము చేయలేదు . అయినను ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు . నేను చేసిన దోషమేమిటి ?"ఇలా ఆలోచిస్తూ ఆ ధేనువు మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండెను . పిమ్మట ఆ గోవు వందలాది సైన్యమును విదుల్చుకుని ,వాయువేగముతో వెళ్లి వశిష్టుని ఎదుట నిలిచి ఏడ్చుచు ఇలా పలికెను . 

ఓ బ్రహ్మకుమారా !పూజ్య మహర్షి !ఈ రాజభటులు నన్ను లాగుకొనిపోవుచున్నారు . నీవు నన్ను పరిత్యజించితివా ఏమి ?"అని దీనవదనముతో ,కన్నీరుతో అడిగెను . 
శోకముతో అలమటించుచున్న ఆ ధేనువు మొర విని ఆ బ్రహ్మర్షి దుఃఖితయైన ఒక సోదరితో వలె ఆ ధేనువుతో ఇలా అనెను . "ఓ శబలా !నిన్ను నేను త్యజించుటలేదు . నీవు నాకు ఇసుమంత అయినా అపకారము చేయలేదు . బలశాలి అయిన ఈ రాజే బలగర్వంతో నానుండి బలవంతముగా నిన్ను తీసుకుపోవుచున్నాడు . ఇతనితో సమానమయిన బలము నాకు లేదు . చతురంగ బాలసమన్వితమైన ఒక అక్షౌహిణి సేనతో కూడి ఉన్న యితడు మిక్కిలి శక్తిశాలి . "
వశిష్టుని మాటల ఆంతర్యమును గ్రహించిన ఆ కామధేనువు తేజోమూర్తి అయిన వశిష్టునితో సవినయముగా ఇట్లనెను . "ఓ బ్రహ్మర్షీ !నిజముగా క్షత్రియుని బలము బలమేకాదు . బ్రాహ్మణిని బలమే బలము . అది మిక్కిలి గొప్పది . క్షత్రియుని బలము కంటే గొప్పది . విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను . తపః శక్తి ముందు అతడు బలహీనుడే కానీ నీ  ముందు బలహీనుడే నాకు అనుజ్ఞను ఇమ్ము అతడి బలగర్వాన్ని నేను చిత్తుచేసెదను . "అనెను . 
కామధేనువు ఇలా పలుకగా శత్రుబలములను రూపుమాపగల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించెను . ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆధేనువు సైన్యమును సృష్టించింది . ఆ ధేనువు యొక్క హుంకారము నుండి "పప్లవులు "అనే (మ్లేచ్ఛజాతి సైనికులు )బయల్వెడలి విశ్వామిత్రుడు చూస్తుండగానే అతని సైన్యమునంతటిని నశింపచేయసాగిరి . అంతటిని చూసిన విశ్వామిత్రుడు కోపముతో కళ్ళెర్రచేసి తానే స్వయముగా రధమును అధిరోహించి వివిధాస్త్రశస్త్రములతో "పప్లవులను "హతమార్చెను . అది చూసిన ఆధేనువు మిక్కిలి కోపముతో "శకులు ,యవనులు "అను వారిని అసంఖ్యాకంగా సృష్టించెను . వారితో ఆప్రదేశము అంతా నిండిపోయెను . వారు మహా వీరులు మిక్కిలి ప్రభావశాలురు . పొడవైన ఖడ్గములను ,కత్తులను ధరించి వున్నారు. అట్టి సైనికులు విశ్వామిత్రుని సైన్యము అంతటిని తుదముట్టించిరి . అంతట విశ్వామిత్రుడు గొప్ప శక్తి కల అస్త్రములను ప్రయోగించగా వారందరూ చెల్లాచెదురైనారు . 

రామాయణము బాలకాండ ఏబదినాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .