Tuesday 30 August 2016

                                     రామాయణము 

                                        బాలకాండ- ఏబదియైదవసర్గ 

విశ్వామిత్రుని అస్త్ర ప్రభావముచే సమస్త సైనికులు చెల్లాచెదురు అవుట చూసిన వశిష్ఠుడు ఇంకా సైన్యమును పుట్టించమని ధేనువును ఆజ్ఞాపించెను . ఆయన ఆజ్ఞను అనుసరించి అనేక వేల ,లక్షల మందిని సృష్టించెను . ఆ సైన్యము విశ్వామిత్రుని సైన్యమును నామరూపములు లేకుండా చేయగా ,కోపితులైన విశ్వామిత్రుని 100 మంది కుమారులు వశిష్టుని మీదకు ఆయుధములు చేతబూని దాడికి వచ్చిరి . వశిష్ఠుడు ఒక్క హుంకారముతో వారందరిని భస్మమొనర్చెను . 
తన వందమంది కుమారులు ,సైనికులు అంతా నాశనమగుట చూసి విశ్వామిత్రుడు చింతాక్రాంతుడయ్యెను . కోరలు తీసిన పాము వలె అయ్యెను . రాజ్య పాలన చేయమని ఒక కుమారుడికి అప్పగించి వనములకు వెళ్లెను . కిన్నెరులు ,నాగులు సంచరించునట్టి ఆ హిమవత్పర్వత ప్రాంతమునకు చేరి పరమేశ్వరుని అనుగ్రహము పొందుటకు తపస్సు చేయసాగెను . 
పరమేశ్వరుడు ప్రసన్నుడై వరము కోరమనగా దేవ ,దానవ ,గాంధర్వ ,యక్ష ,కిన్నెర ,రాక్షసుల వద్ద వుండే సమస్త ధనుర్విద్యను ప్రసాదింపమని కోరెను .ఆయన అట్లే ప్రసాదించెను . దివ్యాస్త్రములతో గర్వము అధికముకాగా వశిష్టాశ్రమమునకు వెళ్లి ,తన అస్త్రములను ప్రయోగించెను . ఆ అస్త్రముల దాటికి తపోవనం పూర్తిగా దగ్దమయ్యెను . 
ఈ విధముగా విశ్వామిత్రుడు భయంకరముగా అస్త్రములు ప్రయోగించగా అక్కడ వున్న మునులు ,ఋషులు అందరూ భయముతో పరుగులు తీయసాగిరి . వశిష్ఠుడు ఎంత వారించినా వారు పారిపోవుట ఆపసాగిరి . క్షణములో ఆ ప్రదేశము అంతా శూన్యమాయెను . అప్పుడు వశిష్ఠుడు కోపముతో విశ్వామిత్రుని ఎదుట నిలిచి తన భ్రహ్మ దండమును చేతబూనెను . 

రామాయణము బాలకాండ ఏబదియైదవ సర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  












No comments:

Post a Comment