Saturday 3 September 2016

                                 రామాయణము 

                                  బాలకాండ _ ఏబదితొమ్మిదవసర్గ   

ఆ విధముగా తనను అర్ధించిన త్రిశంకుని మీద జాలి పడిన విశ్వామిత్రుడు "ఓ ఇక్ష్వాకు నరేంద్రా !నీవు ధార్మికుడవని నేను ఎరుగుదును . నీకు నేను అండగా ఉందును . యజ్ఞ కార్యమునకు అవసరమగు మునులను రప్పింతును . నీవు యజ్ఞము చేయుము . నిన్ను ఇలానే సశరీరంగా స్వర్గమునకు నేను పంపుతాను "అని ధైర్యము చెప్పి ,మిక్కిలి బుద్ధిశాలురు ,ధార్మికులు అయిన తన పుత్రులను పిలిచి యజ్ఞమునకు కావలిసిన సామాగ్రిని సమకూర్చమని ఆజ్ఞాపించెను . పిమ్మట తన శిష్యులను పిలిచి "సకల ఋషిగణములను ,వారి శిష్యులను ,బంధు ,మిత్రులను వెంటనే నా ఆదేశము అని చెప్పి తీసుకురండి . ఎవరయినా పరుషముగా పలికిన యెడల నాకు తెలపండి . "అని ఆజ్ఞాపించెను . 
విశ్వామిత్రుడి ఆజ్ఞ ప్రకారము యజ్ఞమునకు అవసరమగు సమస్త వస్తువులు వచ్చిచేరాయి . సమస్త దిక్కులనుండి ఋషులు ,మునులు ,శిష్య ,ప్రశిష్యులతో కూడి  విచ్చేసిరి . శిష్యులు వచ్చి "గురువర్యా !తమ ఆజ్ఞ అని చెప్పగానే ఋషులు ,మునులు అందరూ సంతోషముతో బయలుదేరిరి .మహోదయుడు అనే ముని ,వశిష్టుని 100 మంది పుత్రులు తప్ప అందరూ వచ్చుచున్నారు . ఓ మునీశ్వరా !ఆ వశిష్టుని పుత్రులు కోపముతో యజ్ఞము చేయువాడు చండాలుడు ,చేయించువాడు క్షత్రియులు  యజ్ఞమునకు చెందిన హవిస్సులను దేవతలు .ఋషులు ఎట్లు శ్వీకరింతురు . అని నిష్ఠురముగా పలికిరి "అని చెప్పిరి . 
అప్పుడు విశ్వామిత్రుడు కోపముతో "తీవ్రముగా తపమాచరించుచు పవిత్రముగా వున్న నన్ను ఈ విధముగా దూషించిన ఆ దుర్మాత్ములందరూ మసియై పోవుదురు . ఇంకా ఏడువందల జన్మలవరకు వారు శవములను భక్షించుచు బ్రతుకుదురు . "దురాత్ముడైన మహోదయుడు కూడా నన్ను దూషించెను కావున అతడు కిరాతుడై జనులందరి చేత దూషించబడును . ఎల్లప్పుడూ సకల ప్రాణులను హింసించుచు ,చంపుతూ బ్రతుకుచుందురు . "అని శాపము ఇచ్చెను . 

రామాయణము బాలకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

          








         

No comments:

Post a Comment