Sunday 28 August 2016

రామాయణము బాలకాండ -ఏబదినాల్గవసర్గ

                                రామాయణము 

                             బాలకాండ -ఏబదినాల్గవసర్గ 

ఓ రామా !వశిష్ఠుడు కామధేనువును ఇచ్చుటకు నిరాకరించగా ,విశ్వామిత్రుడు కామధేనువును బలవంతముగా లాగుకొనిపోవుచుండెను . అప్పుడు ఆ కామధేనువు మనసులో బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఇలా అనుకోసాగేను . "మహనీయుడైన వశిష్ఠుడు నన్ను పరిత్యజించాడా ?నన్ను ఈ విధముగా రాజభటులు లాక్కుపోవుచున్నారు . ఈ ధర్మాత్ముని నేను మిక్కిలి భక్తితో సేవించుచున్నాను . ఈయనకు నాపై గల ప్రీతి అపారం నేను ఏ అపరాధము చేయలేదు . అయినను ఈ మహర్షి నన్ను త్యజించుచున్నాడు . నేను చేసిన దోషమేమిటి ?"ఇలా ఆలోచిస్తూ ఆ ధేనువు మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండెను . పిమ్మట ఆ గోవు వందలాది సైన్యమును విదుల్చుకుని ,వాయువేగముతో వెళ్లి వశిష్టుని ఎదుట నిలిచి ఏడ్చుచు ఇలా పలికెను . 

ఓ బ్రహ్మకుమారా !పూజ్య మహర్షి !ఈ రాజభటులు నన్ను లాగుకొనిపోవుచున్నారు . నీవు నన్ను పరిత్యజించితివా ఏమి ?"అని దీనవదనముతో ,కన్నీరుతో అడిగెను . 
శోకముతో అలమటించుచున్న ఆ ధేనువు మొర విని ఆ బ్రహ్మర్షి దుఃఖితయైన ఒక సోదరితో వలె ఆ ధేనువుతో ఇలా అనెను . "ఓ శబలా !నిన్ను నేను త్యజించుటలేదు . నీవు నాకు ఇసుమంత అయినా అపకారము చేయలేదు . బలశాలి అయిన ఈ రాజే బలగర్వంతో నానుండి బలవంతముగా నిన్ను తీసుకుపోవుచున్నాడు . ఇతనితో సమానమయిన బలము నాకు లేదు . చతురంగ బాలసమన్వితమైన ఒక అక్షౌహిణి సేనతో కూడి ఉన్న యితడు మిక్కిలి శక్తిశాలి . "
వశిష్టుని మాటల ఆంతర్యమును గ్రహించిన ఆ కామధేనువు తేజోమూర్తి అయిన వశిష్టునితో సవినయముగా ఇట్లనెను . "ఓ బ్రహ్మర్షీ !నిజముగా క్షత్రియుని బలము బలమేకాదు . బ్రాహ్మణిని బలమే బలము . అది మిక్కిలి గొప్పది . క్షత్రియుని బలము కంటే గొప్పది . విశ్వామిత్రుడు మహావీరుడే కాదనను . తపః శక్తి ముందు అతడు బలహీనుడే కానీ నీ  ముందు బలహీనుడే నాకు అనుజ్ఞను ఇమ్ము అతడి బలగర్వాన్ని నేను చిత్తుచేసెదను . "అనెను . 
కామధేనువు ఇలా పలుకగా శత్రుబలములను రూపుమాపగల సైన్యమును సృష్టింపుము అని ఆదేశించెను . ఆ మహర్షి ఆదేశమును పాటించి ఆధేనువు సైన్యమును సృష్టించింది . ఆ ధేనువు యొక్క హుంకారము నుండి "పప్లవులు "అనే (మ్లేచ్ఛజాతి సైనికులు )బయల్వెడలి విశ్వామిత్రుడు చూస్తుండగానే అతని సైన్యమునంతటిని నశింపచేయసాగిరి . అంతటిని చూసిన విశ్వామిత్రుడు కోపముతో కళ్ళెర్రచేసి తానే స్వయముగా రధమును అధిరోహించి వివిధాస్త్రశస్త్రములతో "పప్లవులను "హతమార్చెను . అది చూసిన ఆధేనువు మిక్కిలి కోపముతో "శకులు ,యవనులు "అను వారిని అసంఖ్యాకంగా సృష్టించెను . వారితో ఆప్రదేశము అంతా నిండిపోయెను . వారు మహా వీరులు మిక్కిలి ప్రభావశాలురు . పొడవైన ఖడ్గములను ,కత్తులను ధరించి వున్నారు. అట్టి సైనికులు విశ్వామిత్రుని సైన్యము అంతటిని తుదముట్టించిరి . అంతట విశ్వామిత్రుడు గొప్ప శక్తి కల అస్త్రములను ప్రయోగించగా వారందరూ చెల్లాచెదురైనారు . 

రామాయణము బాలకాండ ఏబదినాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
















No comments:

Post a Comment