Saturday, 9 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ

                                  రామాయణము 

                                అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ 

రామలక్ష్మణులు కబంధుని మాటలు విన్న తర్వాత ,గిరి సమీపమున గోతిని తవ్వి అందు కబంధుని పడవేసి అతడి దేహమును కట్టెలతో ఎండు ఆకులతో దహనమొనర్చిరి . అతడి దేహము పూర్తిగా దహనమయిన పిమ్మట ఒక దివ్య తేజస్సుతో కూడి దివ్యాభరణములు ,వస్త్రములు ధరించిన ఒక దివ్యపురుషుడు ఆ చితి మంటలనుండి వచ్చెను . అతడు "రామా !నాకు శాప విమోచనము కలిగించినందుకు కుతజ్ఞుడను . 
నీకు నీ భార్య సీతాదేవి లభించుటకు ఒక వీరుడితో స్నేహము చేయుట ఉత్తమము అని నా భావన . కిష్కింద అను వానర రాజ్యమునకు వాలి రాజు అతడు వానరుడు . అతడు ఇంద్రుని అంశతో జన్మించాడు . అతడి తమ్ముడు కారణాంతరముల వలన అతడి అన్న గారిచే రాజ్యము నుండి వెడలగొట్టబడి ఋశ్యమూకం అను పర్వతముపై నలుగురు వానరులతో కలిసి జీవించుచున్నాడు . అతడికి ఈ భూమి మీద తెలియని ప్రదేశము లేదు . సూర్యుడి కాంతి పడు యావత్ భూమి అతడికి తెలుసు . 
అతడు సీతాదేవిని అన్వేషించుటలో నీకు తప్పక తోడ్పడగలడు . అతడికి నీవు చేయవలసిన సహాయము ఒకటి కలదు ఆ పని నీ వలన అయినను అవకపోయినను అతడు నీకు సహాయపడగలడు . అతడు వానరుడని చులకనగా చూడకు . సీతను ఎత్తుకెళ్లిన రాక్షసుడు ఆమెను మీరు పర్వతముపై దాచినను ,పాతాళములో దాచినాను వాడిని చంపి ఆమెను నీకు అప్పగించగల సమర్థుడు . కావున నీవు అతడితో మైత్రి ఏర్పరుచుకొనుము . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదిరెండవసర్గసమాప్తము . 

                                      శశి ,

ఎం . ఏ, ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








  

Friday, 8 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదియొకటవసర్గ

                                 రామాయణము 

                              అరణ్యకాండ -డబ్బదియొకటవసర్గ 

మహానుభావా !రామా !పూర్వము నేను మిక్కిలి సుందరమైన రూపము కలిగి స్ఫురద్రూపి (కావలిసిన రూపము లోకి మారగల శక్తి కలవాడి)నై అప్పుడప్పుడు భయంకరమైన రూపము ధరించి ,అరణ్యములలో తపము చేయుచున్న మునుల చెంతకు వెళ్లి వారిని భయపెట్టుచుండెడివాడను . ఒకరోజు స్థూలశిరుడు అను పేరుకల ఒక మహర్షిని నేను ఆ విధముగానే భయపెట్టితిని . అప్పుడా మహర్షి కోపముతో" లోకభయంకరమైన ఈ రూపమే నీకు శాశ్వతముగా ఉండిపోవును "అని శపించెను . 

అప్పుడు నేను నా అపరాధమును గ్రహించి కరుణించమని ఆ మునిని వేడుకొనగా ,ఆ ముని ఇక్ష్వాకువంశీయుడైన శ్రీరాముడు నీ చెంతకు వచ్చి ,నీ భుజములను ఖండించి ,నిన్ను అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు నీకు శాప విముక్తి కలుగునని ఆ ముని చెప్పెను . అప్పటి నుండి రాక్షసాకారములో నేను ఉండిపోయితిని . అప్పుడు నేను బ్రహ్మకై ఘోర తపమొనర్చి ఆయనను మెప్పించి వరములను పొందితిని . ఆ వర గర్వముచే నేను దేవేంద్రుడిపైకి యుద్ధమునకు వెళ్ళితిని . 
అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధముచే నా శిరస్సుపై కొట్టెను . అప్పుడు నా శిరస్సు ,కాళ్ళు పొట్టలోకి కూరుకుపోయేను . అప్పుడు నేను దేవేంద్రునితో ఇటుల వున్న నేను ఎలా బతకగలను అని ప్రార్ధించగా దేవేంద్రుడు దయతలిచి నాకు పొడవైన చేతులను ,పొట్టపై నోటిని ప్రసాదించెను . అప్పటి నుండి నేను ,నా దీర్ఘబాహువులతో దొరికిన మృగములను పట్టి తింటూ బ్రతుకుచున్నాను . ఎప్పటికైనను రాముడు వచ్చి నాకు ఈ రూపము నుండి విముక్తి కలిగించునని ఎదురుచూచుచున్నాను . ఓ రామా !నీవు తప్ప నన్ను ఎవరు చంపజాలరు . కావున నన్ను దహనమొనర్పి ముక్తిని కలిగించు "అని ప్రార్ధించెను 
అప్పుడు శ్రీరాముడు కబంధునితో "కబంధా !నేను నా తమ్ముడు లేకుండుట చూసి ,నా భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు . నాకు అతడి పేరు తప్ప వివరములు ఏమియు తెలియవు . ఒకవేళ నీకు తెలిసినచో చెప్పుము "అని అడిగెను . అప్పుడా కబంధుడు రామా ఈ రూపములో నాకు జ్ఞానము లేదు నీవు నన్ను దహనమొనర్చినచో నేను నీకు తెలిసినంతవరకూ చెప్పగలను . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం .ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Thursday, 7 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదియవసర్గ

                                           రామాయణము 

                                                అరణ్యకాండ -డబ్బదియవసర్గ 

తన చేతులలో చిక్కుకున్న రామలక్ష్మణులను చూసి కబంధుడు ఓ క్షత్రియ శ్రేష్ఠులారా !నా ఆకలి సమయములో బాగుగా దొరికినారు . నాకు మిమ్ములను ఆహారముగా ఆ దేవుడే పంపినాడు . "అని పలికెను . ఆ మాటలు విన్న రామలక్ష్మణులు ఆ రాక్షసుడి భుజములను నరికివేసిరి . శ్రీరాముడు కుడి చేతిని లక్ష్మణుడు ఎడమ చేతిని నరికివేసినారు . అప్పుడా రాక్షసుడు భూమ్యాకాశములు ,దశదిశలు పిక్కటిల్లేలా అరుస్తూ నేలపై పడిపోయెను . 

అపుడా రాక్షసుడు ఆ రఘువీరులను చూసి 'మీరెవరని ప్రశ్నించెను . అప్పుడు లక్ష్మణుడు "ఈయన రఘువంశతిలకుఁడైన శ్రీరాముడు నేను ఈయన తమ్ముడు లక్ష్మణుడను .ఈ రామచంద్రుని భార్య  ను  ఒక రక్కసుడు అపహరించుటచే ఆమెను వెతుకుచూ ఇలా వచ్చితిమి . నీవెవరు ? కంఠము ,ముఖము లేక ఇటుల వికృతముగా ఎందులకు ఉంటివి ?"అని ప్రశ్నించగా ఆ రాక్షసుడు తన గాధను జ్ఞప్తికి తెచ్చుకుని వారికి తన కథను చెప్పసాగెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియవసర్గ సర్గ సమాప్తము . 

                                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



Monday, 4 September 2017

రామాయణము అరణ్యకాండ -అరువదితొమ్మిదవసర్గ

                                                      రామాయణము 

                                                        అరణ్యకాండ -అరువదితొమ్మిదవసర్గ 

రామలక్ష్మణులు జటాయువుకి జలతర్పణములు అర్పించినపిమ్మట నైరుతి దిశగా సీతాదేవిని వెతుకుతూ నడసాగెను . ఆ మార్గము దట్టమైన చెట్లతో పొదలతో ప్రవేశించుటకు వీలులేకుండా ఉండెను . ఆ అరణ్యమున రామలక్ష్మణులు నడుచుచు ముందుకు సాగుతుండెను . అచట వారికి ఒక గుహ కనిపించెను . ఆ గుహ వద్ద స్థూలకాయురాలైన ఒక రాక్షసి ఉండి వీరిని అడ్డగించెను . లక్ష్మణుడు ఆ రాక్షసి ముక్కు చెవులు కోసివేసెను . అప్పుడా రాక్షసి బిగ్గరగా అరుస్తూ అచటి నుండి పారిపోయెను . 
రామలక్ష్మణులు ఆ అరణ్యములో ముందుకు సాగుతుండగా లక్ష్మణునినికి అనేక దుశ్శకునములు ఎదురయ్యెను . అందువలన వారిరువురు ,ధనుర్భాణములను ధరించి సిద్ధముగా ఉండెను . అంత కొంత దూరము వెళ్లిన పిమ్మట పెద్ద ఆకారముకల ఒక రాక్షసుడు వారికి కనిపించెను .. అతడికి ముఖము ,మెడ లేకుండెను . పొట్టలో నోరు ఉండెను . అతడి చేతులు మిక్కిలి పొడుగుగా ఉండెను . మొండెము ఒక్కటే ఉండుటచే ఆ రక్కసుడు మిక్కిలి భయంకరముగా ఉండెను . 

ఆ రాక్షసుడు రామలక్ష్మణులను చూసి తన చేతులతో వారిని చెరో చేతితో మిక్కిలి గట్టిగా పట్టుకొనెను . రాముడు ధైర్యము సడలక ఉండెను కానీ ,లక్ష్మణుడు ప్రాణ సమానుడైన తన అన్నగారు ఆ రాక్షసుడు చేతిలో చిక్కుకొనుట చూసి దిగులుపడెను . పిమ్మట అతడు రాముడితో "అన్నా !నా గురించి ఆలోచించకు ,నన్ను వీడికి ఆహారముగా వదిలి నీవు వెడలిపో నీకు వదిన తప్పక దొరుకును . నన్ను మాత్రము మరువకుము "అని పలికెను . 
తమ్ముడి మాటలకు రాముడి ధైర్యము కొద్దిగా సడలేను కానీ ,లక్ష్మణుని చూసి ధైర్యము తెచ్చుకొనెను . 

రామాయణము అరణ్యకాండ అరువదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Tuesday, 15 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదియెనిమిదవసర్గ

                                            రామాయణము 

                                            అరణ్యకాండ -అరువదియెనిమిదవసర్గ 

శ్రీరాముడు నేలపై పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న గృధ రాజుని చూసి లక్ష్మణునితో "లక్ష్మణా !ఈ జటాయువు నాకోసము ఆ రాక్షసుడితో పోరాడి ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు . అయ్యో ఈయనకు నావలన కదా ఇంతటి కష్టము వచ్చిపడినది . మా తండ్రిగారికి మిత్రుడు ,నా శ్రేయోభిలాషి ఐన ఈయన ప్రాణాపాయముతో కొట్టుమిట్టాడుతూ ,నోట మాట లేక పడివున్నాడు . "అని పలికెను . 

పిమ్మట శ్రీరాముడు జటాయువుతో "అయ్యో మీకు మా వలన ఎంత కష్టము వచ్చినది . అసలు సీతను అపహరించిన ఆ రక్కసుడు ఎవ్వడు ?అతడు ఎందులకు జానకిని ఎందులకు అపహరించాడు ?అతడిదే రాజ్యము . మిమ్ము ఎటుల జయించగలిగాడు ?"అని అడిగాడు . అప్పుడు జటాయువు "రామా !ఆ రాక్షసుడి పేరు రావణుడు అతడు సీతను అపహరించుకు పోవుచుండగా నేను నా శాయశక్తులా ఎదుర్కొంటిని . కానీ అతడు నేను అలసిన తరుణములో నా రెక్కలను కాళ్ళను కండించివేసెను . 

అతడు సీతను ఎత్తుకుని దక్షిణ దిశగా పోయెను . అతడి పేరు రావణుడు . అతడు మిశ్రవసుడి కుమారుడు . లంకాధిపతి . కుబేరుడి సోదరుడు ." అని పలికి ఆ జటాయువు మరణించెను . అప్పుడు శ్రీరాముడు జటాయువును పట్టుకుని మిక్కిలి ఆక్రోశించెను . అప్పుడు ఆ క్షణములో ఆయన బాధ వర్ణనాతీతము . కొంత తడవుకు రాముడు లక్ష్మణునితో కలిసి జటాయువుకి ఉత్తమ గతులు కల్పించుట కొరకు దహనసంస్కారాది కార్యము నిర్వహించి ,పిండము పెట్టెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                             శశి ,

                                   ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు . 





Monday, 14 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువది ఏడవసర్గ

                            రామాయణము 

                       అరణ్యకాండ -అరువది ఏడవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విని కోపము తగ్గించుకుని లక్ష్మణుడు చెప్పినట్టు ఆ దండకారణ్యప్రాంతమంతా  వెతుకసాగెను . కొంత దూరము వెళ్లిన పిమ్మట పెద్ద ఆకారము రక్తమోడుతూ కనిపించెను . ఆ పర్వతాకారములో వున్న ప్రాణిని చూసిన శ్రీరాముడు అది రాక్షసుడేమో సీతను మింగేసాడేమో అని ఊహించి ఆ ప్రాణిని చంపుటకు ధనుస్సుని పట్టుకొనెను . అప్పుడా ప్రాణి "రామా !నేను జటాయువుని . సీతను రావణుడు అపహరించి తీసుకుపోవుచుండగా నేను అడ్డగించినాను . నా శాయశక్తులా యత్నించినాను . ఆ రావణుడి రధమును ,అతడి సారధిని నాశనము చేసితిని . పిమ్మట అతడు నా రెక్కలు కాళ్ళు నరికి జానకిని తీసుకుని వెళ్ళిపోయాడు . "అని పలికెను . 
అప్పుడు శ్రీరాముడు తన తండ్రి మిత్రుడు తనకు అత్యంత ఆప్తుడు అయిన జటాయువు ఆ విధముగా ప్రాణాపాయ స్థితిలో ఉండుట చూసి మిక్కిలి బాధపడెను . పిమ్మట రాముడు ఆ గ్రద్ద ను తాకుతూ ఏడవసాగెను . తన పెన్నిధి దూరమయినట్లుగా బాధపడసాగెను . 

రామాయణము అరణ్యకాండ అరువదియేడవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం . ఏ ,ఎం. ఏ ,తెలుగు పండితులు . 






Sunday, 13 August 2017

రామాయణము అరణ్యకాండ -అరువదిఆరవసర్గ

                                          రామాయణము 

                                            అరణ్యకాండ -అరువదిఆరవసర్గ 

సీతాదేవి కొఱకై ఏడ్చుచు రాముడు మిక్కిలి బాధా హృదయుడు అయ్యెను . లక్ష్మణుడు అన్న పక్కనే ఉండి అన్నకు ధైర్యము చెబుతూ అన్నకు కాళ్ళు నొక్కుతూ సపరిచర్యలు చేయసాగెను . ఎన్నో విధములుగా రాముని ఓదార్చుటకు యత్నించుచు ఉండెను . 

రామాయణము అరణ్యకాండ అరువదిఆరవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ ,తెలుగు పండితులు .