Saturday 9 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ

                                  రామాయణము 

                                అరణ్యకాండ -డబ్బదిరెండవసర్గ 

రామలక్ష్మణులు కబంధుని మాటలు విన్న తర్వాత ,గిరి సమీపమున గోతిని తవ్వి అందు కబంధుని పడవేసి అతడి దేహమును కట్టెలతో ఎండు ఆకులతో దహనమొనర్చిరి . అతడి దేహము పూర్తిగా దహనమయిన పిమ్మట ఒక దివ్య తేజస్సుతో కూడి దివ్యాభరణములు ,వస్త్రములు ధరించిన ఒక దివ్యపురుషుడు ఆ చితి మంటలనుండి వచ్చెను . అతడు "రామా !నాకు శాప విమోచనము కలిగించినందుకు కుతజ్ఞుడను . 
నీకు నీ భార్య సీతాదేవి లభించుటకు ఒక వీరుడితో స్నేహము చేయుట ఉత్తమము అని నా భావన . కిష్కింద అను వానర రాజ్యమునకు వాలి రాజు అతడు వానరుడు . అతడు ఇంద్రుని అంశతో జన్మించాడు . అతడి తమ్ముడు కారణాంతరముల వలన అతడి అన్న గారిచే రాజ్యము నుండి వెడలగొట్టబడి ఋశ్యమూకం అను పర్వతముపై నలుగురు వానరులతో కలిసి జీవించుచున్నాడు . అతడికి ఈ భూమి మీద తెలియని ప్రదేశము లేదు . సూర్యుడి కాంతి పడు యావత్ భూమి అతడికి తెలుసు . 
అతడు సీతాదేవిని అన్వేషించుటలో నీకు తప్పక తోడ్పడగలడు . అతడికి నీవు చేయవలసిన సహాయము ఒకటి కలదు ఆ పని నీ వలన అయినను అవకపోయినను అతడు నీకు సహాయపడగలడు . అతడు వానరుడని చులకనగా చూడకు . సీతను ఎత్తుకెళ్లిన రాక్షసుడు ఆమెను మీరు పర్వతముపై దాచినను ,పాతాళములో దాచినాను వాడిని చంపి ఆమెను నీకు అప్పగించగల సమర్థుడు . కావున నీవు అతడితో మైత్రి ఏర్పరుచుకొనుము . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదిరెండవసర్గసమాప్తము . 

                                      శశి ,

ఎం . ఏ, ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








  

No comments:

Post a Comment