Friday 8 September 2017

రామాయణము అరణ్యకాండ -డబ్బదియొకటవసర్గ

                                 రామాయణము 

                              అరణ్యకాండ -డబ్బదియొకటవసర్గ 

మహానుభావా !రామా !పూర్వము నేను మిక్కిలి సుందరమైన రూపము కలిగి స్ఫురద్రూపి (కావలిసిన రూపము లోకి మారగల శక్తి కలవాడి)నై అప్పుడప్పుడు భయంకరమైన రూపము ధరించి ,అరణ్యములలో తపము చేయుచున్న మునుల చెంతకు వెళ్లి వారిని భయపెట్టుచుండెడివాడను . ఒకరోజు స్థూలశిరుడు అను పేరుకల ఒక మహర్షిని నేను ఆ విధముగానే భయపెట్టితిని . అప్పుడా మహర్షి కోపముతో" లోకభయంకరమైన ఈ రూపమే నీకు శాశ్వతముగా ఉండిపోవును "అని శపించెను . 

అప్పుడు నేను నా అపరాధమును గ్రహించి కరుణించమని ఆ మునిని వేడుకొనగా ,ఆ ముని ఇక్ష్వాకువంశీయుడైన శ్రీరాముడు నీ చెంతకు వచ్చి ,నీ భుజములను ఖండించి ,నిన్ను అగ్నికి ఆహుతి ఇచ్చినప్పుడు నీకు శాప విముక్తి కలుగునని ఆ ముని చెప్పెను . అప్పటి నుండి రాక్షసాకారములో నేను ఉండిపోయితిని . అప్పుడు నేను బ్రహ్మకై ఘోర తపమొనర్చి ఆయనను మెప్పించి వరములను పొందితిని . ఆ వర గర్వముచే నేను దేవేంద్రుడిపైకి యుద్ధమునకు వెళ్ళితిని . 
అప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధముచే నా శిరస్సుపై కొట్టెను . అప్పుడు నా శిరస్సు ,కాళ్ళు పొట్టలోకి కూరుకుపోయేను . అప్పుడు నేను దేవేంద్రునితో ఇటుల వున్న నేను ఎలా బతకగలను అని ప్రార్ధించగా దేవేంద్రుడు దయతలిచి నాకు పొడవైన చేతులను ,పొట్టపై నోటిని ప్రసాదించెను . అప్పటి నుండి నేను ,నా దీర్ఘబాహువులతో దొరికిన మృగములను పట్టి తింటూ బ్రతుకుచున్నాను . ఎప్పటికైనను రాముడు వచ్చి నాకు ఈ రూపము నుండి విముక్తి కలిగించునని ఎదురుచూచుచున్నాను . ఓ రామా !నీవు తప్ప నన్ను ఎవరు చంపజాలరు . కావున నన్ను దహనమొనర్పి ముక్తిని కలిగించు "అని ప్రార్ధించెను 
అప్పుడు శ్రీరాముడు కబంధునితో "కబంధా !నేను నా తమ్ముడు లేకుండుట చూసి ,నా భార్యను ఒక రాక్షసుడు అపహరించాడు . నాకు అతడి పేరు తప్ప వివరములు ఏమియు తెలియవు . ఒకవేళ నీకు తెలిసినచో చెప్పుము "అని అడిగెను . అప్పుడా కబంధుడు రామా ఈ రూపములో నాకు జ్ఞానము లేదు నీవు నన్ను దహనమొనర్చినచో నేను నీకు తెలిసినంతవరకూ చెప్పగలను . "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ డబ్బదియవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం .ఏ .ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment