Friday, 22 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదిరెండవసర్గ

                                   రామాయణము 

                                   కిష్కిందకాండ -ముప్పదిరెండవసర్గ 

మత్తు నుండి బయటకు వచ్చిన సుగ్రీవుడు లక్ష్మణుడు కోపముగా వచ్చినట్లు మంత్రులవలన తెలుసుకుని బయపడసాగెను . ఏమిచేయాలో తోచక తన మంత్రులతో "ఓ మంత్రులారా !లక్ష్మణుడు అంత కోపముగా ఉండుటకు కారణము ఏమయి ఉండును . నేను ఆయనకు ఏమియు అపరాధము చేయలేదు కదా ! ఇంతకూ మునుపు నేను ఎప్పుడు ఆ మహానుభావునితో కనీసము పరుషముగానైనా మాట్లాడివుండలేదు . ఆయన కోపము శాంతించు ఉపాయము ఏదయినను చెప్పండి "అని పలికెను . 
             ఆ మాటలు విన్న మంత్రులు "ఓ వానర రాజా !లక్ష్మణుడు మీరు సీతాదేవి అన్వేషణకు ఏ ప్రయత్నము చేయుట లేదని కోపముగా వుండి  ఉండవచ్చు . రామలక్ష్మణులు బలపరాక్రములు ,మహానుభావులు వారు నీకు మహోపకారం చేసినారు . లోకోపవాదమును గూర్చి ఏమాత్రము ఆలోచించక నీ అన్నాను చంపి నీ భార్యను నీ రాజ్యమును నీకు అప్పగించారు . అట్టి వారితో విరోధము తగదు . వారు చేసిన ఉపకారమునకు బదులుగా నీవు వారికి సహాయము చేయవలెను అది నీ బాధ్యత . ప్రస్తుతము నీవు బందు మిత్రులతో సహా లక్ష్మణుని శరణు కొరుము ,ఆయనను ప్రసన్నుడిని చేసికొనుము . ఆయన పరుషముగా మాట్లాడినను పల్లెత్తు మాట మాట్లాడక భరించుము "అని పలికెను . 

రామాయణము కిష్కింద కాండ ముప్పదిఏందవాసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Wednesday, 13 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియొకటవసర్గ

                            రామాయణము 

           

                          కిష్కిందకాండ -ముప్పదియొకటవసర్గ 

దశరథ మహారాజా కుమారుడైన శ్రీరాముడు ఆ విధముగా సీత ఎడబాటుతో దీనంగా పలికిన పలుకులు విన్న లక్ష్మణుడు కోపముతో అన్న మాటలు సుగ్రీవునికి చెప్పుటకు బయలుదేరెను . లక్ష్మణుడు  దీనుడైన వున్న తన అన్న ఒక పక్క రాజ్యభోగములలో తేలుతున్న సుగ్రీవుడు ఒక పక్క అని కోపముతో పెద్దపెద్ద అడుగులు వేస్తూ కిష్కింధకు బయలుదేరెను . ఆయన వేగముగా నడుస్తుంటే కాలికింద పడు రాళ్లు నుగ్గునుగ్గు అవుతున్నాయి . తాడి చెట్లు ,మద్ది చెట్లు నెలకొరుగుతున్నాయి . ఆ విధముగా కిష్కింద వైపు వచ్చిన లక్ష్మణుడు అక్కడ కనిపించిన వానరులను చూసి ఇంకా కోపోద్రిక్తుడయ్యెను . 

లక్ష్మణుడు కోపముతో భీకరముగా వచ్చుట చూసిన వానరులందరూ భయముతో చెట్లపైకి ఎక్కసాగిరి . ఎవరివైపు చూడకుండా ,ఎవరితోనూ మాట్లాడకుండా లక్ష్మణుడు తిన్నగా సుగ్రీవుడి అంతఃపురములోకి ప్రవేశించెను . లక్ష్మణుని చూసి అచట వున్న మంత్రులు సైతము వణకసాగిరి . అచ్చటనే వున్న అంగదుని చూసి లక్ష్మణుడు "అంగదా !నీ పినతండ్రికి నేను వచ్చినట్లుగా తెలియజేయి "అని పలికెను . లక్ష్మణుని ఆజ్ఞ ప్రకారము అంగదుడు సుగ్రీవునికి లక్ష్మణుని రాకను తెలియజేయుటకు అంతరాళములోకి ప్రవేశించెను . 
ఆ సమయములో సుగ్రీవుడు తన రాణులతో కలసి మద్యం మత్తులో ఉండెను . అంగదుడు  పలికిన పలుకులు కూడా సుగ్రీవుని చెవికి ఎక్కలేదు . లక్ష్మణుని ముందున్న మంత్రులు ఎంతో బుద్దికుశులురు వారు లక్ష్మణుని బహువిధములుగా పొగిడి అతడికి మర్యాద చేసి వారు కూడా లక్ష్మణుడి రాక గురించి సుగ్రీవునికి తెలియచేయుటకు వెళ్లిరి . వారు సుగ్రీవునితో లక్ష్మణుని రాకను గురించి తెలిపిరి . అయినను మద్యం మత్తులో వున్నా సుగ్రీవుడు చెవికెక్కలేదు . లక్ష్మణుని భీకర కోపముతో వున్నా ఆకారముని చూసి వానరులు భయముతో గగ్గోలు పెట్టసాగిరి . ఆ పెద్ద అరుపులకు సుగ్రీవునికి కొంత తెలివి వచ్చెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Friday, 8 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియవసర్గ

                                             రామాయణము 

                                                కిష్కిందకాండ -ముప్పదియవసర్గ 

సుగ్రీవుడు నీలునికి వానరులను సమీకరించు భాద్యతను అప్పగించి అంతఃపురములోకి ప్రవేశించెను . ప్రసవనగిరిపై శ్రీరాముడు మేఘములు తొలగిపోవుటచే నిర్మలంగా ఉన్న ఆకాశమును చూసి సీతాదేవి ఎడబాటుకు మిక్కిలి శోకపీడితుడయ్యెను . సీతాదేవి కొరకు ఇంకనూ వ్యాకులుడయ్యెను . ఇంతవరకు జానకి జాడ తెలియదయ్యెను ,రావణునిపై దండెత్తుటకు సమయము మించిపోవుచున్నది . అని ఆలోచిస్తూ శ్రీరాముడు శోకములో మునిగిపోయెను . పిదప కొంత సమయము తర్వాత లక్ష్మణుని పిలిచి 
               "లక్ష్మణా !సుగ్రీవుడు భోగలాలసుడై వర్షాకాలం గడిచినపిదప సీతాన్వేషణ చేయుదునని నాకు ఇచ్చిన ప్రతినను మరచినట్లున్నాడు . తమ్ముడా !సుగ్రీవునితో సమయానుకూలంగా మాట్లాడి ,అతడు మనకు చేసిన ప్రతిమను గుర్తుచేసి ,మన పని ముందుకు సాగునట్లు చేయుము" అని దీనవధానుడై పలికెను . ఈ విధముగా తన అన్న భాదను చూసిన లక్ష్మణుడు సుగ్రీవునిపై మిక్కిలి కోపముతో మండిపడుతూ అతడిని శిక్షించుటకు సిద్దపడెను . 
               రామాయణము కిష్కింద కాండ ముప్పదియవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                   


Sunday, 3 February 2019

రామాయణము కిష్కింద కాండ -ఇరువదితొమ్మిదవసర్గ

                                            రామాయణము 

                                           కిష్కింద కాండ -ఇరువదితొమ్మిదవసర్గ  

కిష్కింధకు రాజు అయిన పిమ్మట సుగ్రీవుడు రాజ్యాకార్యములను పట్టించుకొనక మంత్రులపై కార్యభారములను విడిచి నిత్యమూ భోగలాలసుడై ఉండెను . సమస్త కార్యములు అదుపు తప్పినవి . మంత్రులు రాజ్యభారమును పట్టించుకొనక ఉండెను . సమస్త విషయ సమర్థుడు అయిన హనుమంతుడు ,వర్షాకాలం ముగిసిన పిమ్మట ,శరద్కాలము వచ్చేనని గ్రహించి వెంటనే సుగ్రీవుని వద్దకు వెళ్లి సమయోచితముగా ఇలా మాట్లాడనారంభించెను . 
"పూజ్యుడైన ఓ ప్రభూ !నీకు రాజ్యాధికారం సంప్రాప్తించినది . కీర్తిప్రతిష్టలు అబ్భినవి ,వంశపారంపర్యముగా వచ్చిన సంపదలు వృద్ధి అయినవి . వానర భల్లూకములకు ప్రభువైన ఓ సుగ్రీవా !నీవు పరాక్రమవంతుడవు ,మహా శక్తిమంతుడవు . మహాత్ములైన కోట్లకొలది వానర యోధులు నీ అధీనములో వున్నారు . వారిని ఎంతటి వారైనా ఎదిరించలేరు . నీకు సహాయము చేసిన రామునికి ప్రత్యుపకారము చేయవలసిన సమయము ఆసన్నమయినది . వర్షాకాలం ముగిసినది . శరద్కాలము ఆరంభమయినది సీతాన్వేషణకు ఇదే సరి అయినా సమయము . సీతాన్వేషణకు నీ సైన్యమును నియోగించు మహానుభావుడైన శ్రీరాముడు బలపరాక్రమ సంపన్నుడు దేవతలు సైతము అతనిని ఎదిరించజాలరు . అంతటి మహానుభావుడు నీ సహాయమును ఆశించాడు . తక్షణమే ఆయనకు సహాయము చేయుము . ఆయన చెప్పిన తదుపరి మనము పనులు ప్రారంభించిన కాలయాపన అవుతుంది "అని పలుకగా సుగ్రీవుడు 
తన కర్తవ్యమును సమాలోచించుకుని సైన్యాధిపతి అయిన నీలుని పిలిపించి ఎక్కడెక్కడి వానర వీరులను 15 రోజులలోపు కిష్కింధకు చేరవలసినదిగా ఆజ్ఞ ఇచ్చాడు . అలా 15 రోజులలో రాణి వానరులకు మరణ దండన విధించబడుతుందని చెప్పాడు వానరులకు సమాచారమును చేరవేయు పనిని నీలునికి ,ఆంజనేయునికి అప్పగించాడు . ఆవిధముగా ఆజ్ఞ ఇచ్చి పిమ్మట సుగ్రీవుడు తన అంతఃపురమునకు వెళ్లెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువది తొమ్మిదవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు 0,తెలుగు పండితులు . 











                                      రామాయణము 

                                          కిష్కిందకాండ -ఇరువది ఎనిమిదవసర్గ 

వర్షాకాలం వచ్చెను . వర్షము ఎడతెరిపి లేకుండా కురవసాగెను . రామలక్ష్మణులు ప్రసవన   గిరిపై  ఉండెను . వర్షాకాలం ముగిసిన పిమ్మట సీతాన్వేషణ సుగ్రీవుడు చేయునని రాముడు లక్ష్మణునితో పలికెను . భరతుడిని గుర్తుచేసుకొనెను . 
రామాయణము కిష్కిందకాండ ఇరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                                    రామాయాణం 

                                                          
                                                కిష్కింద కాండ  ఇరువది ఏడోవ సర్గ 
సుగ్రీవుడు కిష్కింధకు పట్టాభిషిక్తుడయ్యెను . వానర వీరుల సంతోష కోలాహలం ఆకాశమును తాకినది . రామలక్ష్మణులు ప్రసవనగిరి అనే పర్వతముపై కల ఒక గుహలో తమ నివాసము ఏర్పరుచుకొనిరి . ఆ ప్రసవనగిరి పరమ రమణీయమైన ప్రదేశము . ఆ ప్రాంతమున స్వచ్ఛమైన జలములకు కానీ ఫల, పుష్పములకు కానికొదువ లేదు . పచ్చని ప్రకృతితో అత్యంత సుందరమగు ప్రదేశము ఆ ప్రసవనగిరి . అంతటి సుందర ప్రదేశములో ఉన్నప్పటికీ రాముని మనస్సు సీత పక్కన లేదనే బాధతో ఎల్లప్పుడూ కలతచెందుతూ వుడేడిది . శ్రీరాముడు అశృనయనములతో ఉండుట చూసిన లక్ష్మణుడు తల్లడిల్లెడివాడు . లక్ష్మణుడు అన్న గారికి ధైర్యము చెప్పి ,ఆయన దైన్యమును తొలగించెను . పిమ్మట శ్రీరాముడు దైన్యము తొలగించుకుని ,"లక్ష్మణా !ఈ వానాకాలము సీతాన్వేషణకు సరిఅయిన సమయము కాదు . సర్డుకాలము వచ్చేది వరకు మనము వేచి వుండెదము . సుగ్రీవుడు పట్టాభిషిక్తుడై ,తన భార్యను తిరిగి పొంది సంతోషముతో ఉండి ఉంటాడు . ఉపకారికి అతడు తప్పక ప్రత్యుపకారము చేస్తాడు . అప్పటి వరకు మనము ఇక్కడే వేచి ఉందాము . "అని పలికెను . 
రామాయణము కిష్కిందకాండ ఇరువదియేడవసర్గ సమాప్తము . 

                         శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 
                         

Sunday, 9 September 2018

రామాయణము కిష్కిందకాండ -ఇరువదిఆరవసర్గ

                                  రామాయణము 

                                   కిష్కిందకాండ -ఇరువదిఆరవసర్గ 

వాలికి దాహంగా సంస్కారములు ముగిసిన పిమ్మట సుగ్రీవుడు ఒకచోట కూర్చుని బాధపడుచుండెను . తన అన్న ను తలచుకొని మిక్కిలి రోదించెను . అప్పుడు వానర ప్రముఖులందరూ సుగ్రీవుని వద్దకు వెళ్లి అతడిని ఓదార్చి ,శ్రీరాముని వద్దకు అతడిని తీసుకువెళ్ళేను . వారందరూ శ్రీరామునికి నమస్కారము చేసిరి . పిమ్మట  వాయునందనుడు శ్రీరామునితో "ఓ మహా వీరా !అనితర సాధ్యమయిన వాలి రాజ్యము నీ దయవలన సుగ్రీవుని కి దక్కినది . సుగ్రీవుడు నీ ఆజ్ఞకు బద్దుడు . అతడిని ఈ రాజ్యమునకు రాజుగా చేయుము . అతడు నిన్ను బాగుగా గౌరవించును . మాతో కిష్కింధకు రమ్ము . "అని పిలిచెను . 

అప్పుడు శ్రీరాముడు "హనుమా !నేను పదునాలుగు సంవత్సరముల కాలము గ్రామములో కానీ పట్టణములో కానీ ప్రవేశించరాదని మా ఆటీన్ద్రి ఆజ్ఞ . కావున మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఈ ప్రసవం గిరిపై ఉంటాను ఇచ్చటి ప్రక్రుతి రామణీయముగా ఉండును . గాలులు చల్లగా ఉండును . "అని పలికి పిమ్మట సుగ్రీవునితో "సుగ్రీవా !నీవు కిష్కింధకు రాజువి కమ్ము . నీ అన్న వాలి కుమారుడైన అంగదుడు వీరుడు . సర్వ శ్రేష్ఠుడు . అతడిని యువరాజుగా ప్పట్టాభిషిక్తుడిని గావింపుము . వానలు వుండు నాలుగు మాసములను వార్షికములు అందురు . ఈ సమయములో సీతాన్వేషణ కష్టము . కావున మీరు సుఖముగా కిష్కిందలో వుండండి . వర్షాకాలం పూర్తి అయిన పిదప కార్తీకమాస ఆరంభములో సీతాన్వేషణ కు ,రావణ వద్దకు సైన్యమును సంసిద్దము చేయుము . "అని పలికెను . 
అప్పుడు సుగ్రీవుడు శ్రీరాముని ఆదేశము మేరకు కిష్కిందా నగరములో ప్రవేశించేను . నగరంలోని ప్రజలు ,వానర ప్రముఖులు అందరూ సుగ్రీవుని చుట్టుముట్టేను . వారందరితో కొద్దిసేపు కుశలప్రశ్నలు మొదలగు సంభాషణలు గావించి పిమ్మట సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్లి అటునుండి రాజ్యసభకు వెళ్లెను . వానరులు రాజ్యసభను రంగురంగుల పూలతో అలంకరించిరి . బంగారు సింహాసనంపై సుగ్రీవుని కూర్చొండబెట్టి ,పుణ్యతీర్ధములనుండి ,నదీనదముల నుండి ,సప్తసముద్రముల నుండి తెచ్చిన నీటిని బంగారు పాత్రలో ఉంచి వాటితో సుగ్రీవునికి పట్టాభిషేకము చేసెను . ఆ సమయములో బ్రాహ్మణోత్తములు అనేక యజ్ఞములు చేసిరి . వారందరికీ అమూల్యమైన నగలు ,వస్త్రములు ,దనము ,ధాన్యము ,గోవులు ,వస్తువులను ,మావోహారమైన ఆహార పదార్ధములను ఇచ్చి సంతోష పరిచేను . సుగ్రీవుడు తన భార్య రుమను శ్వీకరించెను . పిమ్మట శ్రీరాముని ఆదేశము మేరకు అంగదుని యువరాజుగా పట్టాభిషేకము చేసెను . అప్పుడు అచట వున్న వానర ప్రముఖులందరూ "బాగుబాగు "అని పొగిడిరి . పిమ్మర సుగ్రీవుడు శ్రీరాముని దగ్గరకు వెళ్లి పట్టాభిషేక విషయములన్నీ వివరించెను . 

రామాయణము కిష్కిందకాండ ఇరువది ఆరవసర్గ సమాప్తము . 

                              శశి ,

ఎం . ఏ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .