Wednesday 13 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియొకటవసర్గ

                            రామాయణము 

           

                          కిష్కిందకాండ -ముప్పదియొకటవసర్గ 

దశరథ మహారాజా కుమారుడైన శ్రీరాముడు ఆ విధముగా సీత ఎడబాటుతో దీనంగా పలికిన పలుకులు విన్న లక్ష్మణుడు కోపముతో అన్న మాటలు సుగ్రీవునికి చెప్పుటకు బయలుదేరెను . లక్ష్మణుడు  దీనుడైన వున్న తన అన్న ఒక పక్క రాజ్యభోగములలో తేలుతున్న సుగ్రీవుడు ఒక పక్క అని కోపముతో పెద్దపెద్ద అడుగులు వేస్తూ కిష్కింధకు బయలుదేరెను . ఆయన వేగముగా నడుస్తుంటే కాలికింద పడు రాళ్లు నుగ్గునుగ్గు అవుతున్నాయి . తాడి చెట్లు ,మద్ది చెట్లు నెలకొరుగుతున్నాయి . ఆ విధముగా కిష్కింద వైపు వచ్చిన లక్ష్మణుడు అక్కడ కనిపించిన వానరులను చూసి ఇంకా కోపోద్రిక్తుడయ్యెను . 

లక్ష్మణుడు కోపముతో భీకరముగా వచ్చుట చూసిన వానరులందరూ భయముతో చెట్లపైకి ఎక్కసాగిరి . ఎవరివైపు చూడకుండా ,ఎవరితోనూ మాట్లాడకుండా లక్ష్మణుడు తిన్నగా సుగ్రీవుడి అంతఃపురములోకి ప్రవేశించెను . లక్ష్మణుని చూసి అచట వున్న మంత్రులు సైతము వణకసాగిరి . అచ్చటనే వున్న అంగదుని చూసి లక్ష్మణుడు "అంగదా !నీ పినతండ్రికి నేను వచ్చినట్లుగా తెలియజేయి "అని పలికెను . లక్ష్మణుని ఆజ్ఞ ప్రకారము అంగదుడు సుగ్రీవునికి లక్ష్మణుని రాకను తెలియజేయుటకు అంతరాళములోకి ప్రవేశించెను . 
ఆ సమయములో సుగ్రీవుడు తన రాణులతో కలసి మద్యం మత్తులో ఉండెను . అంగదుడు  పలికిన పలుకులు కూడా సుగ్రీవుని చెవికి ఎక్కలేదు . లక్ష్మణుని ముందున్న మంత్రులు ఎంతో బుద్దికుశులురు వారు లక్ష్మణుని బహువిధములుగా పొగిడి అతడికి మర్యాద చేసి వారు కూడా లక్ష్మణుడి రాక గురించి సుగ్రీవునికి తెలియచేయుటకు వెళ్లిరి . వారు సుగ్రీవునితో లక్ష్మణుని రాకను గురించి తెలిపిరి . అయినను మద్యం మత్తులో వున్నా సుగ్రీవుడు చెవికెక్కలేదు . లక్ష్మణుని భీకర కోపముతో వున్నా ఆకారముని చూసి వానరులు భయముతో గగ్గోలు పెట్టసాగిరి . ఆ పెద్ద అరుపులకు సుగ్రీవునికి కొంత తెలివి వచ్చెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియొకటవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment