Wednesday, 17 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదినాల్గవసర్గ

                                     రామాయణము 

                                  యుద్ధకాండ -ఇరువదినాల్గవసర్గ 

సముద్ర తీరమున అపారంగా మరో సముద్రమా అన్నట్టుగా వున్న వానరసైన్యము నకు లంకా నగరమునుండి రాక్షసుల కోలాహలం వినపడెను . అప్పుడు ఆ వానరులు కూడా బిగ్గరగా గర్జనలు చేసిరి . ఆ ధ్వని ,లంకా నగరంలోని రాక్షసులకు వినపడినది . ఆ లంకా నగరమును చూసిన శ్రీరాముడు సీతాదేవిని గుర్తుతెచ్చుకుని బాధపడెను . పిమ్మట ఆ ప్రభువు ,సైన్య రక్షణ కొరకు ఎవరెవరు ఎక్కడ ఉండాలో వ్యూహ రచన చేసెను . ఆప్రకారముగా సైన్యమును నిలబెట్టి మరే రాక్షసుడు ఆ సైన్యములోకి ప్రవేశించకుండా ఏర్పాట్లు చేసెను . 
లంకా నగరంలోకి తిరిగి వచ్చిన శుకుడిని చూసిన రావణుడు నవ్వుతూ "శుకా !నీవు ఎందుకిలా వున్నావు ?ఆ వానరుల చేతికి చిక్కినావా ఏమిటి ?"అని వేళాకోళముగా ప్రశ్నించెను . అప్పుడు శుకుడు అక్కడ జరిగిన వృత్తాన్తమును చెప్పి ,శ్రీరాముడి బలపరాక్రమములను ,అతడి ఔదార్యమును వివరించి చెప్పెను . అపారంగా ఉన్న వానర సైన్య బలము గురించి కూడా చెప్పి సీతాదేవిని శ్రీరాముడికి అప్పచెప్పమని హితవు చెప్పెను . 
అప్పుడు రావణుడు శుకుడితో "ఓ శుకా !సహస్రాక్షుడైన ఇంద్రుడు కానీ ,వరణుడు కానీ ,యముడు కానీ ,శంకరుడి మిత్రుడైన కుబేరుడు కానీ ,నన్ను ఎదిరించలేరు . మానవ మాత్రుడు శ్రీరాముడు ! ఆ విషయము తెలియని శ్రీరాముడు నాపైకి యుద్ధమునకు వచ్చుచున్నాడు . ఏదేమైనప్పటికీ సీతను మాత్రము అప్పగించుట మాత్రము చేయను . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము యుద్ధకాండ -ఇరువదిమూఢవసర్గ

                                  రామాయణము 

                                  యుద్ధకాండ -ఇరువదిమూఢవసర్గ 

లంకను దాటిన పిమ్మట శ్రీరాముడు .లక్ష్మణుడు ,సుగ్రీవుడు సమస్త సేనతో కూడి సముద్ర తీరమునే విడిది చేసిరి . శకున శాస్త్ర నిపుణుడు ఐన శ్రీరాముడు ,శుభ శకునములు చూసి సంతోషించెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదిమూఢవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

Wednesday, 10 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదిరెండవసర్గ

                                 రామాయణము 

                                యుద్ధకాండ -ఇరువదిరెండవసర్గ 

పిమ్మట రఘువరుడు సముద్రునితో "ఓ మహా సముద్రుడా !నేడే పాతాళ లోకము వరకు వ్యాపించి ఉన్న నిన్ను శుష్కింప చేసెదను . నీవు ఇంకి పోయిన తర్వాత వానరులంతా నడుచుకుంటూ ,లంకకు చేరుకుంటారు . సాగరుడా ! దానవులకు ఆశ్రయమిచ్చుట వలన వారి గుణములు నీకు కూడా అబ్బినట్టున్నవి . "అని పలికి ,బాణమును ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్ర మంత్రము చదివేను . అప్పుడు లోకములన్నీ అల్లకల్లోలములు అయినవి . పర్వతము కదిలినవి . దిక్కులన్నిటా చీకట్లు వ్యాపించినవి . నక్షత్రములతో సహా సూర్యచంద్రులు వక్ర గతిన తిరుగసాగిరి . ఆకాశమున సుడిగాలులు తిరిగినవి . 
అప్పుడు సముద్రుడు భయముతో పారిపోవుచుండెను . పారిపోవు వాడి మీదకు బాణము ప్రయోగించరాదని భావించిన శ్రీరాముడు బాణము వేయక ఆగెను . అది గమనించిన సముద్రుడు దివ్య రూపములో వచ్చి శ్రీరాముని దయతలచమని నీటిని మరల్చి దారి ఇవ్వలేనని ప్రార్ధించెను . అప్పుడు శ్రీరాముడు "ఎక్కుపెట్టిన బాణము వృధాగా పోరాదు ఎక్కడ ప్రయోగించను ?"అని అడుగగా సముద్రుడు దొంగలు దోపిడీ దారులు వుండే ద్రుమకుల్యము అనే ప్రదేశము చూపెను . వెనువెంటనే శ్రీరాముడు బాణమును ప్రయోగించెను . అది పెద్దపెద్ద మంటలతో దగ్దమయ్యెను . 
అది చూసిన సముద్రుడు తనలో ఏది వేసినా తేలుస్తాననీ ,అలా సేతువు నిరమించుకోమని ,వానరులలో నీలుడు విశ్వకర్మ కుమారుడు ,అతడు చక్కగా సేతువు నిర్మించుటలో నిపుణుడు . అతడి సహాయముతో సేతువు నిర్మించుకుని లంకా నగరమునకు చేరమని ఎంతో మర్యాదగా పలికి ,అంతర్ధానమయ్యెను . అప్పుడు నీలుడి పర్యవేక్షణలో ,వానరులు పెకలించి  తెచ్చిన వృక్షములు ,కొమ్మలు బండరాళ్ల తో సేతువు నిర్మాణము చక్కగా పూర్తి అయినది . ఆ సేతువు మీదగా సకల సేనా లంకా నగరము వైపుగా సాగిపోవుచున్నది . అందులో కొందరు వానరులు సేతువుపై నడుస్తూ వెళ్తున్నారు . ఇంకొందరు గాలిలో ఎగురుతూ ,మరికొందరు గంతులేస్తూ ,మిగిలిన వాళ్ళు సముద్రపు నీళ్లలో ఈదుతూ సముద్రమును దాటిరి .యావత్ సైన్యముతో శ్రీరాముడు ,లక్ష్మణుడు ,సుగ్రీవుడు సముద్రము ఆవలి తీరమునకు చేరిరి . 

రామాయణము యుద్ధకాండ ఇరువదిరెండవసర్గ . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




రామాయణము యుద్ధకాండ -ఇరువదియొకటవసర్గ

                                 రామాయణము 

                                    యుద్ధకాండ -ఇరువదియొకటవసర్గ 

శుకుడు వెళ్లిపోయిన పిమ్మట ,శ్రీరాముడు సముద్రుడికి ఎదురుగా దర్భాసనముపై కూర్చుండెను . ఆ మహాప్రభువు పగలూ రాత్రి కూడా అక్కడే ఆ ఆసనంపై ఉండెను . మూడుదినములు గడిచెను . సముద్రములో ఏమాత్రము మార్పులేదు . సముద్రుడు శ్రీరామునికి ఎదురుగా వచ్చి నిలబడలేదు . సహనము నశించిన శ్రీరాముడు సముద్రుడిపై మిక్కిలి కోపించెను . అప్పుడు పక్కనే వున్న లక్ష్మణునితో "లక్ష్మణా !శాంతస్వభావము కలవారికి ఈ లోకములో కీర్తిప్రతిష్టలు అబ్బవు . యుద్దములో విజయము కూడా సిద్దించదు . నా శాంతమును చూసిన సముద్రుడు కూడా నన్ను అసమర్ధుడు గా భావించినట్టువున్నాడు . అతడికి నా ప్రతాపము చూపించి ,నా దారికి తెచ్చుకొనెదను "అని పలికెను . 
ఈ విధముగా లక్ష్మణునితో పలికి ,వెంటనే తన ధనస్సు తీసుకుని ధనుష్టంకారము చేసెను . ఆ ధనుష్టంకార ధ్వనికి లోకములన్నీ అల్లకల్లోలమయ్యెను . పిమ్మట శ్రీరాముడు విషతుల్యములైన బాణములను సముద్రములోకి ప్రవేశించెను . మిక్కిలి బయంకరములైన అలలతో వుండేసముద్రము ,ఆ బాణముల తాకిడికి ఇంకా బయంకరములు అయ్యెను . సముద్రములో ముసళ్లు ,తిమింగలములు ,చేపలు చచ్చి పైకి తేలేను . శ్రీరాముడు మరో బాణము ప్రయోగించుటకు సంసిద్ధుడవుతుండగా లక్ష్మణుడు శ్రీరాముని ధనుస్సుని తన చేతితో పట్టుకుని "అన్నా !ఆగు ఇక చాలు "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదియొకటవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


Monday, 8 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదియవసర్గ

                                     రామాయణము 

                                      యుద్ధకాండ -ఇరువదియవసర్గ 

శార్దూలుడు అను రాక్షసుడు సముద్రము దాటి ఆవలి తీరమున వున్న అపారమైన వానర సేనతో వున్న శ్రీరాముడిని, లక్ష్మణుడిని ,సుగ్రీవుడిని చూసాడు . వెనువెంటనే సముద్రమును దాటి లంకా నగరమునకు వెళ్లి రావణునితో "ప్రభూ !వానర భల్లూక యోధులతో కూడిన అపారమైన సేన లంకా నగరమునకు వచ్చుటకు సముద్రము ఆవలి తీరమున ఉన్నది . సముద్ర తీరమున వున్న ఆ మహా సేన మఱియొక సముద్రమా అన్నట్టుగా ఉన్నది . నేను ఆకాశమునుండి చూసి చెప్పిన మాటలు ఇవి . ఆ సేన యొక్క బలాబలములు తెలుసుకొనుటకు ,నీవు దూతలను పంపు . వారు ఆ సేనల పూర్తి  వివరములు తెలుసుకుని ,వస్తారు . అప్పుడు నీవు ఉచితమైన రీతిలో తదనంతర కార్యక్రమును(సామ ,బేధ దాన ,దండోపాయములు ) ఆలోచించుకొనవచ్చును . (సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట దానోపాయము ,సుగ్రీవుని మంచి మాటలతో నీ వైపు త్రిప్పుకొనుట సామోపాయము ,శ్రీరాముడికి సుగ్రీవునికి మధ్య విరోధము సృష్టించుట భేదోపాయము ,యుద్ధము దండోపాయము )శ్రీ రాముని విషయములో దండోపాయము పనిచేయదు . "అని పలికెను . 
                    శార్ధూలిడిమాటలు విన్న రావణుడు మిక్కిలి ఆందోళనకు లోనయ్యేను . పిమ్మట బాగుగా అలోచించి ,శుకుడు అను రాక్షసుడిని పిలిపించి అతడితో "శుకా ! నీవు సముద్రము ఆవలి తీరమున ఉన్న వానర రాజైన సుగ్రీవునితో నా మాటలు మధురముగా ఇలా చెప్పు "ఓ సుగ్రీవా నీవు వానరారాజువి . గొప్పవాడైన ఋక్షజుని కుమారుడివి . వాలి నాకు మిత్రుడు వాలికి సోదరుడవైన నీవు కూడా నాకు సోదరుడితో సమానుడివి . నీవు శ్రీరామునితో ఉండుట వలన ఎటువంటి ప్రయోజనము లేదు . అతడు మానవుడు అతడిని వదిలిన మాత్రమున నీకు జరుగు చెడు ఏమియు ఉండదు . శ్రీరాముడి భార్యను నేను అపహరించుట వలన నీకు వచ్చిన నష్టము ఏమి ?ఆలోచించుకొనుము . నా పక్షమున ఉండుము . వానరులు లంకా నగరములో ప్రవేశించలేరు . దేవగంధర్వులు కూడా లంకా నగరములో ప్రవేశించలేరు . ఇక వానరుల సంగతి చెప్పనేముంది ?కావున కిష్కింధకు మరలిపొమ్ము "అని నా పలుకులుగా తెలుపు "అని శుకుడిని ఆదేశించెను . 
శుకుడు వెనువెంటనే ఒక చిలక గా మారి ఆకాశములో ఎగురుతూ సుగ్రీవుడి వద్దకు చేరి ఆకాశములో వుండే రావణుని సందేశమును మొత్తము వినిపించెను . ఆటలు ఆ పలుకులు పలుకుతుండగానే వానరులలో కొందరు ఆకాశములోకి ఎగిరి , ఆపక్షి రెక్కలు పీకు దానిని బందించి సుగ్రీవుడి ఎదురు గా నిలిపేను . వానరుల దేబాలకు తట్టుకోలేక ,శ్రీరాముడితో దయతలిచి వదిలివేయమని అర్ధించెను . అతడి అభ్యర్ధన విన్న శ్రీరాముడు 'అతడిని కొట్టకండి 'అని పలికెను . అప్పుడు వానరులు అతడిని బాధించుట ఆపిరి . అప్పుడా శుకుడు మళ్లీ సుగ్రీవునితో "సుగ్రీవా !లోకకంటకుడైన రావణుని మాట వినకపోయినచో నీకు అతడి చేతిలో మరణము తప్పదు . నీ సందేశముగా అతడికి ఏమి చెప్పమంటావు "అని పలికెను . 
అప్పుడు సుగ్రీవు డు "మీ ప్రభువుతో ఇలా చెప్పు !ఓ దుష్ట వానరా !నీవు నాకు మిత్రుడవు కావు బందువువి కూడా కావు . నాకు పరమ ఆప్తుడైన శ్రీరామునకు నీవు శత్రువువు అందువలన నీవు కూడా నాకు శత్రువువే నీవు చేసిన దుష్ట కార్యములు జటాయువును చంపుట ,సీతామాతను అపహరించుట , ఈ కార్యములకు తప్పక ఫలితము అనుభవించవలసినదే . నేను అతి త్వరలోనే నా సేనతో సహా అక్కడికి వచ్చి నిన్ను సపరివారంగా నాశనము చేసెదను . శ్రీరాముని విషతుల్యములైన బాణములకు త్వరలోనే నీవు బాలి కాబోవుచున్నావు . "అని పలికెను . 
అప్పుడు యువరాజైన అంగదుడు "ప్రభూ !యితడు దూతగా నాకు అనిపించుట లేదు . యితడు గూఢచారి అని అనుమానము . అతడు మాట్లాడుతూనే మన బలగములను పరిశీలించుచున్నాడు . ఇతడిని లంకకు పంపక ఇక్కడే బంధించుట ఉత్తమమని నా ఉద్దేశ్యము "అని పలికెను అంగదుడి మాటలు విన్న వానరులు ఆరాక్షసుని పట్టుకు హింసించసాగిరి . అప్పుడు అతడు రామా !రామా !అని బిగ్గరగా అరవసాగెను . అప్పుడు శ్రీరాముడు "అతడిని విడిచిపెట్టండి . దూతను చంపుట యుక్తము కాదు" అని పలికెను . 
రామాయణము యుద్ధకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









Monday, 1 July 2019

రామాయణము యుద్ధకాండ -పందొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                     యుద్ధకాండ -పందొమ్మిదవసర్గ 

సుగ్రీవుడి మాటలు విన్న విభీషణుడు తన అనుచరులతో కలిసి ,నేలపైకి దిగి శ్రీరాముని పాదముల చెంత వాలెను . పిదప శ్రీరామునితో "ప్రభూ !నేను రావణుని తమ్ముడిని . నా పేరు విభీషణుడు . మా అన్న వలన నీకు ఎంతో కష్టము కలిగెను . అతడి దురాగతములు చూడలేక నేను లంకను ,మా అన్నను ,నా భార్యా పిల్లలను ,నా స్నేహితులను ,మిత్రులను సమస్త సంపదలను వదిలి వచ్చినాను . ఇక నా జీవితమూ నీ అధీనము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న కరుణాసముద్రుడైన శ్రీరాముడు విభీషనుడికి అభయమిచ్చెను . అతడిని ఓదార్చెను . పిమ్మట శ్రీరాముడు లంక లోని రాక్షసుల బలాబలములు తెలుపమని అడుగగా విభీషణుడు "ఓ రాకుమారా !లంకకు మా అన్న అయిన రావణుడు అధిపతి . అతడు బ్రహ్మను మెప్పించి దేవదానవగంధర్వులలో ఎవరిచేత చావులేకుండా వారము పొందెను . ఆ రావణునికి తమ్ముడు నాకు మరో అన్న ఐన కుంభకర్ణుడు గొప్ప యోధుడు యుద్ధమున ఇంద్రుడంతటి బలశాలి . 
ఓ రామా !ప్రహస్తుడనువాడు రావణుని సేనాధిపతి . కైలాసములో కుభేరునితో జరిగిన యుద్దములో కుభేరుడి సేనాధిపతి ఐన మణిభద్రుని ఇతడు ఓడించెను . రావణుని కుమారుడు ఇంద్రజిత్తు . అతడు యజ్ఞముద్వారా అగ్ని దేవుని సంతృప్తి పరిచి అమితమైన శక్తిని సంపాదించుకొనెను . రణరంగమున శత్రువులకు కనపడకుండా యితడు యుద్ధము చేస్తాడు . మహోదరుడు ,మహాపార్శ్వుడు ,అకంపనుడు అనువారు రావణుని సేనాధిపతులు . వారు యుద్దములో దిక్పాలకులతో సమానురు . లంక లో నివసించు కోట్లకొలదిగా కల రాక్షసులు కామరూపులు ,రక్తమాంసములను భక్షించువారు . రావణుని చేతిలో దేవతలతో సహా దీక్పాలురులందరూ పరాజితులై పారిపోయిరి . "అని పలికెను . 
విభీషణుడి మాటలు విన్న శ్రీరాముడు "విభీషణా !ఆ రావణుని ,అతడి సమస్త సేనలను అతడి మిత్రులని ,అతడి బంధువులను రణరంగమునకు బలి ఇచ్చి లంకకు నిన్ను రాజును చేస్తాను "అని పలికెను . శ్రీరాముడి మాటలు విన్న విభీషణుడు "ఆ రాక్షసులతో యుద్ధ విషయములో నేను యధాశక్తి సహాయపడగలను . నా ప్రాణములు ఒడ్డి అయినా ఆ రావణుని సైన్యముతో నీ తరుపున యుద్ధము చేస్తాను "అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు వెంటనే లక్ష్మణునిచే సముద్ర జలములను తెప్పించి ,సమస్త వానరుల సమక్షమంలో విభీషనుడికి పట్టాభిషేకము చేసెను . అప్పుడా సేన అందరూ బాగుబాగు అని ప్రశంసించిరి . పిదప హనుమ ,సుగ్రీవుడు ,విభీషణునితో అపారమైన సముద్రము దాటుటకు ఉపాయము అడిగెను . అప్పుడు విభీషణుడు "శ్రీరాముడు సముద్రుడిని వేడుకొనుటయే యుక్తము "అని పలికెను . అప్పుడా శ్రీరామ్ లక్ష్మణులు ,వానరులూ అందరూ చర్చించుకొని ,విభీషణుడు చెప్పిన ఉపాయము సరి అయినదే అని నిరణయించుకొనెను . పిదప శ్రీరాముడు సముద్రమునకు ఎదురుగా ఒక దర్భాసనముపై కూర్చొనెను . 

రామాయణము యుద్ధకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము యుద్ధకాండ -పదునెనిమిదవసర్గ

                             రామాయణము 

                            యుద్ధకాండ -పదునెనిమిదవసర్గ 

వానర ప్రముఖుల అందరి మాటలు విన్న తదుపరి శ్రీరాముడు వారితో "శత్రువైనా అంజలిఘటించి ,దీనుడై శరణు వేడి అనుగ్రహించమని ప్రార్ధించినచో అతనికి హాని చేయరాదు . అతడిని ఆడుకొనవలెను . తమ ప్రాణములను ఒడ్డి అయినా వారిని కాపాడవలెను . 
భయపడి కానీ ఆపద్ధర్మము ఎరుగక కానీ ,లాభాపేక్షతో కానీ ,శక్తిగలవాడై యుండియు ఏదేని ఒక నెపముతో ఆ సారాను చొచ్చిన వారిని రక్షింపనిచో అతడు ఈ లోకమున నిందలపాలగుటయే కాక మీదు మిక్కిలి నరక బాధలను కూడా పొందును . శరణాగతుని రక్షింపకుండుట మహా దోషము . దాని వలన నరకము తప్పదు . 
నేను విభీషణునికి అభయమిచ్చుచున్నాను . అతనికే కాదు రావణుడే వచ్చి శరణు కోరినను ,వానికి కూడా అభయమిచ్చెదను . "అని పలికెను . ఆ మాటలు విన్న సుగ్రీవుడు శ్రీరాముని అనుమతితో ,విభీషణుడి వద్దకు వెళ్లి ,"శ్రీరామచంద్రుడు నీకు అభయమిచ్చినాడు "అని పలికెను . ఆ మాటలు విన్న విభీషణుడు పరమానంద భరితుడయ్యెను . 

రామాయణము యుద్ధకాండ పదునెనిమిదవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .