Monday 1 July 2019

రామాయణము యుద్ధకాండ -పందొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                     యుద్ధకాండ -పందొమ్మిదవసర్గ 

సుగ్రీవుడి మాటలు విన్న విభీషణుడు తన అనుచరులతో కలిసి ,నేలపైకి దిగి శ్రీరాముని పాదముల చెంత వాలెను . పిదప శ్రీరామునితో "ప్రభూ !నేను రావణుని తమ్ముడిని . నా పేరు విభీషణుడు . మా అన్న వలన నీకు ఎంతో కష్టము కలిగెను . అతడి దురాగతములు చూడలేక నేను లంకను ,మా అన్నను ,నా భార్యా పిల్లలను ,నా స్నేహితులను ,మిత్రులను సమస్త సంపదలను వదిలి వచ్చినాను . ఇక నా జీవితమూ నీ అధీనము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న కరుణాసముద్రుడైన శ్రీరాముడు విభీషనుడికి అభయమిచ్చెను . అతడిని ఓదార్చెను . పిమ్మట శ్రీరాముడు లంక లోని రాక్షసుల బలాబలములు తెలుపమని అడుగగా విభీషణుడు "ఓ రాకుమారా !లంకకు మా అన్న అయిన రావణుడు అధిపతి . అతడు బ్రహ్మను మెప్పించి దేవదానవగంధర్వులలో ఎవరిచేత చావులేకుండా వారము పొందెను . ఆ రావణునికి తమ్ముడు నాకు మరో అన్న ఐన కుంభకర్ణుడు గొప్ప యోధుడు యుద్ధమున ఇంద్రుడంతటి బలశాలి . 
ఓ రామా !ప్రహస్తుడనువాడు రావణుని సేనాధిపతి . కైలాసములో కుభేరునితో జరిగిన యుద్దములో కుభేరుడి సేనాధిపతి ఐన మణిభద్రుని ఇతడు ఓడించెను . రావణుని కుమారుడు ఇంద్రజిత్తు . అతడు యజ్ఞముద్వారా అగ్ని దేవుని సంతృప్తి పరిచి అమితమైన శక్తిని సంపాదించుకొనెను . రణరంగమున శత్రువులకు కనపడకుండా యితడు యుద్ధము చేస్తాడు . మహోదరుడు ,మహాపార్శ్వుడు ,అకంపనుడు అనువారు రావణుని సేనాధిపతులు . వారు యుద్దములో దిక్పాలకులతో సమానురు . లంక లో నివసించు కోట్లకొలదిగా కల రాక్షసులు కామరూపులు ,రక్తమాంసములను భక్షించువారు . రావణుని చేతిలో దేవతలతో సహా దీక్పాలురులందరూ పరాజితులై పారిపోయిరి . "అని పలికెను . 
విభీషణుడి మాటలు విన్న శ్రీరాముడు "విభీషణా !ఆ రావణుని ,అతడి సమస్త సేనలను అతడి మిత్రులని ,అతడి బంధువులను రణరంగమునకు బలి ఇచ్చి లంకకు నిన్ను రాజును చేస్తాను "అని పలికెను . శ్రీరాముడి మాటలు విన్న విభీషణుడు "ఆ రాక్షసులతో యుద్ధ విషయములో నేను యధాశక్తి సహాయపడగలను . నా ప్రాణములు ఒడ్డి అయినా ఆ రావణుని సైన్యముతో నీ తరుపున యుద్ధము చేస్తాను "అని పలికెను . 
ఆ మాటలు విన్న శ్రీరాముడు వెంటనే లక్ష్మణునిచే సముద్ర జలములను తెప్పించి ,సమస్త వానరుల సమక్షమంలో విభీషనుడికి పట్టాభిషేకము చేసెను . అప్పుడా సేన అందరూ బాగుబాగు అని ప్రశంసించిరి . పిదప హనుమ ,సుగ్రీవుడు ,విభీషణునితో అపారమైన సముద్రము దాటుటకు ఉపాయము అడిగెను . అప్పుడు విభీషణుడు "శ్రీరాముడు సముద్రుడిని వేడుకొనుటయే యుక్తము "అని పలికెను . అప్పుడా శ్రీరామ్ లక్ష్మణులు ,వానరులూ అందరూ చర్చించుకొని ,విభీషణుడు చెప్పిన ఉపాయము సరి అయినదే అని నిరణయించుకొనెను . పిదప శ్రీరాముడు సముద్రమునకు ఎదురుగా ఒక దర్భాసనముపై కూర్చొనెను . 

రామాయణము యుద్ధకాండ పందొమ్మిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment