Monday 8 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదియవసర్గ

                                     రామాయణము 

                                      యుద్ధకాండ -ఇరువదియవసర్గ 

శార్దూలుడు అను రాక్షసుడు సముద్రము దాటి ఆవలి తీరమున వున్న అపారమైన వానర సేనతో వున్న శ్రీరాముడిని, లక్ష్మణుడిని ,సుగ్రీవుడిని చూసాడు . వెనువెంటనే సముద్రమును దాటి లంకా నగరమునకు వెళ్లి రావణునితో "ప్రభూ !వానర భల్లూక యోధులతో కూడిన అపారమైన సేన లంకా నగరమునకు వచ్చుటకు సముద్రము ఆవలి తీరమున ఉన్నది . సముద్ర తీరమున వున్న ఆ మహా సేన మఱియొక సముద్రమా అన్నట్టుగా ఉన్నది . నేను ఆకాశమునుండి చూసి చెప్పిన మాటలు ఇవి . ఆ సేన యొక్క బలాబలములు తెలుసుకొనుటకు ,నీవు దూతలను పంపు . వారు ఆ సేనల పూర్తి  వివరములు తెలుసుకుని ,వస్తారు . అప్పుడు నీవు ఉచితమైన రీతిలో తదనంతర కార్యక్రమును(సామ ,బేధ దాన ,దండోపాయములు ) ఆలోచించుకొనవచ్చును . (సీతాదేవిని శ్రీరామునికి అప్పగించుట దానోపాయము ,సుగ్రీవుని మంచి మాటలతో నీ వైపు త్రిప్పుకొనుట సామోపాయము ,శ్రీరాముడికి సుగ్రీవునికి మధ్య విరోధము సృష్టించుట భేదోపాయము ,యుద్ధము దండోపాయము )శ్రీ రాముని విషయములో దండోపాయము పనిచేయదు . "అని పలికెను . 
                    శార్ధూలిడిమాటలు విన్న రావణుడు మిక్కిలి ఆందోళనకు లోనయ్యేను . పిమ్మట బాగుగా అలోచించి ,శుకుడు అను రాక్షసుడిని పిలిపించి అతడితో "శుకా ! నీవు సముద్రము ఆవలి తీరమున ఉన్న వానర రాజైన సుగ్రీవునితో నా మాటలు మధురముగా ఇలా చెప్పు "ఓ సుగ్రీవా నీవు వానరారాజువి . గొప్పవాడైన ఋక్షజుని కుమారుడివి . వాలి నాకు మిత్రుడు వాలికి సోదరుడవైన నీవు కూడా నాకు సోదరుడితో సమానుడివి . నీవు శ్రీరామునితో ఉండుట వలన ఎటువంటి ప్రయోజనము లేదు . అతడు మానవుడు అతడిని వదిలిన మాత్రమున నీకు జరుగు చెడు ఏమియు ఉండదు . శ్రీరాముడి భార్యను నేను అపహరించుట వలన నీకు వచ్చిన నష్టము ఏమి ?ఆలోచించుకొనుము . నా పక్షమున ఉండుము . వానరులు లంకా నగరములో ప్రవేశించలేరు . దేవగంధర్వులు కూడా లంకా నగరములో ప్రవేశించలేరు . ఇక వానరుల సంగతి చెప్పనేముంది ?కావున కిష్కింధకు మరలిపొమ్ము "అని నా పలుకులుగా తెలుపు "అని శుకుడిని ఆదేశించెను . 
శుకుడు వెనువెంటనే ఒక చిలక గా మారి ఆకాశములో ఎగురుతూ సుగ్రీవుడి వద్దకు చేరి ఆకాశములో వుండే రావణుని సందేశమును మొత్తము వినిపించెను . ఆటలు ఆ పలుకులు పలుకుతుండగానే వానరులలో కొందరు ఆకాశములోకి ఎగిరి , ఆపక్షి రెక్కలు పీకు దానిని బందించి సుగ్రీవుడి ఎదురు గా నిలిపేను . వానరుల దేబాలకు తట్టుకోలేక ,శ్రీరాముడితో దయతలిచి వదిలివేయమని అర్ధించెను . అతడి అభ్యర్ధన విన్న శ్రీరాముడు 'అతడిని కొట్టకండి 'అని పలికెను . అప్పుడు వానరులు అతడిని బాధించుట ఆపిరి . అప్పుడా శుకుడు మళ్లీ సుగ్రీవునితో "సుగ్రీవా !లోకకంటకుడైన రావణుని మాట వినకపోయినచో నీకు అతడి చేతిలో మరణము తప్పదు . నీ సందేశముగా అతడికి ఏమి చెప్పమంటావు "అని పలికెను . 
అప్పుడు సుగ్రీవు డు "మీ ప్రభువుతో ఇలా చెప్పు !ఓ దుష్ట వానరా !నీవు నాకు మిత్రుడవు కావు బందువువి కూడా కావు . నాకు పరమ ఆప్తుడైన శ్రీరామునకు నీవు శత్రువువు అందువలన నీవు కూడా నాకు శత్రువువే నీవు చేసిన దుష్ట కార్యములు జటాయువును చంపుట ,సీతామాతను అపహరించుట , ఈ కార్యములకు తప్పక ఫలితము అనుభవించవలసినదే . నేను అతి త్వరలోనే నా సేనతో సహా అక్కడికి వచ్చి నిన్ను సపరివారంగా నాశనము చేసెదను . శ్రీరాముని విషతుల్యములైన బాణములకు త్వరలోనే నీవు బాలి కాబోవుచున్నావు . "అని పలికెను . 
అప్పుడు యువరాజైన అంగదుడు "ప్రభూ !యితడు దూతగా నాకు అనిపించుట లేదు . యితడు గూఢచారి అని అనుమానము . అతడు మాట్లాడుతూనే మన బలగములను పరిశీలించుచున్నాడు . ఇతడిని లంకకు పంపక ఇక్కడే బంధించుట ఉత్తమమని నా ఉద్దేశ్యము "అని పలికెను అంగదుడి మాటలు విన్న వానరులు ఆరాక్షసుని పట్టుకు హింసించసాగిరి . అప్పుడు అతడు రామా !రామా !అని బిగ్గరగా అరవసాగెను . అప్పుడు శ్రీరాముడు "అతడిని విడిచిపెట్టండి . దూతను చంపుట యుక్తము కాదు" అని పలికెను . 
రామాయణము యుద్ధకాండ ఇరువదియవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









No comments:

Post a Comment