Wednesday 17 July 2019

రామాయణము యుద్ధకాండ -ఇరువదినాల్గవసర్గ

                                     రామాయణము 

                                  యుద్ధకాండ -ఇరువదినాల్గవసర్గ 

సముద్ర తీరమున అపారంగా మరో సముద్రమా అన్నట్టుగా వున్న వానరసైన్యము నకు లంకా నగరమునుండి రాక్షసుల కోలాహలం వినపడెను . అప్పుడు ఆ వానరులు కూడా బిగ్గరగా గర్జనలు చేసిరి . ఆ ధ్వని ,లంకా నగరంలోని రాక్షసులకు వినపడినది . ఆ లంకా నగరమును చూసిన శ్రీరాముడు సీతాదేవిని గుర్తుతెచ్చుకుని బాధపడెను . పిమ్మట ఆ ప్రభువు ,సైన్య రక్షణ కొరకు ఎవరెవరు ఎక్కడ ఉండాలో వ్యూహ రచన చేసెను . ఆప్రకారముగా సైన్యమును నిలబెట్టి మరే రాక్షసుడు ఆ సైన్యములోకి ప్రవేశించకుండా ఏర్పాట్లు చేసెను . 
లంకా నగరంలోకి తిరిగి వచ్చిన శుకుడిని చూసిన రావణుడు నవ్వుతూ "శుకా !నీవు ఎందుకిలా వున్నావు ?ఆ వానరుల చేతికి చిక్కినావా ఏమిటి ?"అని వేళాకోళముగా ప్రశ్నించెను . అప్పుడు శుకుడు అక్కడ జరిగిన వృత్తాన్తమును చెప్పి ,శ్రీరాముడి బలపరాక్రమములను ,అతడి ఔదార్యమును వివరించి చెప్పెను . అపారంగా ఉన్న వానర సైన్య బలము గురించి కూడా చెప్పి సీతాదేవిని శ్రీరాముడికి అప్పచెప్పమని హితవు చెప్పెను . 
అప్పుడు రావణుడు శుకుడితో "ఓ శుకా !సహస్రాక్షుడైన ఇంద్రుడు కానీ ,వరణుడు కానీ ,యముడు కానీ ,శంకరుడి మిత్రుడైన కుబేరుడు కానీ ,నన్ను ఎదిరించలేరు . మానవ మాత్రుడు శ్రీరాముడు ! ఆ విషయము తెలియని శ్రీరాముడు నాపైకి యుద్ధమునకు వచ్చుచున్నాడు . ఏదేమైనప్పటికీ సీతను మాత్రము అప్పగించుట మాత్రము చేయను . "అని పలికెను . 

రామాయణము యుద్ధకాండ ఇరువదినాల్గవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



No comments:

Post a Comment