Friday, 19 August 2016

రామాయణము బాలకాండ నలుబది ఆరవసర్గ

                         రామాయణము 

                               బాలకాండ నలుబది ఆరవసర్గ 

ఓ రామా !క్షీరసాగర మదనములో తన పుత్రులు ,తన సవతి పుత్రులు అయిన దేవతలచే వధింపబడుటచే దితి మిక్కిలి భాదపడుతూ మరీచి మహర్షి కుమారుడు తన భర్త అయిన కశ్యప మహర్షి వద్దకు వెళ్లి ,పుత్ర శోకముతో భాదపడుతూ తనకి ఇంద్రుని అదుపు చేయగల పుత్రుడిని ప్రసాదింపమని వేడుకొనెను . దానికి ఆ మహర్షి" నీ పవిత్రతను కాపాడుకుంటూ తపస్సు చేయుము . నీవు కోరుకున్నట్టే బలశాలి అయిన కుమారుడు జన్మిస్తాడు "అని పలికెను . 
కశ్యప మహర్షి పలుకులు విని దితి మిక్కిలి సంతోషించి 'కుశప్లవము 'అను పేరు కల క్షేత్రమునకు వెళ్లి తీవ్రముగా తపస్సు ఆచరించసాగెను . దితి అలా తపస్సు ఆచరిన్చుచుండగా దేవేంద్రుడు మిక్కిలి వినయ విధేయతలతో సపర్యలు చేయసాగెను . ఆవిడకు కావల్సినవి అన్నీ సమకూర్చుచు ,మాతృ భావముతో దితికి పాదములొత్తుట ,చామరముతో వీచుట మొదలగు పరిచర్యలు చేసెను . వేయి సంవత్సరములలో ఒక పది సంవత్సరములు మిగిలి ఉండగా దేవేంద్రుడి సేవలకు సంతుష్టురాలైన దితి జరిగిన వృత్తాన్తమును చెప్పి" నీ తమ్ముడిని నేను శాంత పరుస్తాను . మీరిద్దరూ కలసి ముల్లోకాధిపత్యమును అనుభవించగలరు ."అని చెప్పెను . 
ఈ విధముగా చెప్పి మిక్కిలి నిద్ర రావడంతో దితి మధ్యాహ్న వేళ మాట్లాడుతూనే వొరిగి నిద్రపోయెను . పగటిపూట నిద్రపోవుట ,తన శిరోజములు పాదధూళి తగులుట గ్రహించిన ఇంద్రుడు ,ఆమె అశుచి అయినది అని గ్రహించి తనను అదుపు చేయగలవాడు జన్మిస్తాడని భయముతో ధైర్యము చేసి ,సూక్ష్మ రూపములో దితి గర్భములోకి ప్రవేశించి ,గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేసెను . ఇంద్రుడి వజ్రాయుధము తగిలి శిశువు ఏడ్చుట మొదలుపెట్టేను . అప్పుడు ఇంద్రుడు ఏడవకు అని పలికి శిశువును ముక్కలు చేసెను . శిశువు ఏడుపు విని దితి మేల్కొని శిశువుని వధింపకు అని పలికెను . అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి ,దితికి నమస్కరించి ,"అమ్మా !పాదములవైపు శిరస్సును ఉంచి నిద్రించుటచే నీవు అశుచివైతివి . ఈ అవకాశమును చూసుకొని ,యుద్దములో నన్ను చంపగల వాడిని 7 ముక్కలుగా చేసితిని . నన్ను క్షమింపుము "అని పలికెను . 

రామాయణము బాలకాండ నలుబదిఆరవ సర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










 

Thursday, 18 August 2016

రామాయణము బాలకాండ -నలుబదిఐదవ సర్గ

                                   రామాయణము 

                                   బాలకాండ -నలుబదిఐదవ సర్గ 

ఆ రాత్రి రామ లక్ష్మణులు ,విశ్వమిత్రుడు ,మునులు అక్కడే విశ్రమించి తెల్లవారి లేచి తమ విధులు పూర్తి చేసుకుని గంగ ను దాటి ఉత్తర తీరమునకు చేరిరి . పిమ్మట వారు 'విశాల 'అను నగరము దర్శించిరి . రమ్యమైన ఆ నగరము అమరావతి వలేదివ్యముగా విరాజిల్లుచు ఉండెను . 
మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్రునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషాల గురించి తెలుపమని ప్రార్ధించెను . ఆయన ప్రార్ధనను విన్న విశ్వామిత్రుడు ఇలా చెప్పెను . "ఓ రామా !శుభకరమైన దేవేంద్రుడి కథను వివరించెదను అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చియు వివరించెదను వినుము . 
ఓ రామా !పూర్వకాలమున కృతయుగము న దితి పుత్రులు బలశాలురుగా ,అదితి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహా పరాక్రమశాలురు గా ఉండిరి . దేవతలకు ,దైత్యులకు మనకు రోగములు ,ముసలితనము మరణము లేకుండుట ఎట్లు అను ఆలోచన కలిగెను . ఓ రామా !ఆ మహాత్ములు ఇలా ఆలోచించుచుండగా క్షీరసాగరమును మదించి దానినుండి అమృతమును పొందుదాము అనే ఉపాయము వారికి తట్టెను . 
శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా ,వాసుకిని త్రాడుగా చేసుకుని క్షీరసాగరమును చిలికిరి . ఇలా వేయి సంవత్సరములు జరిగిన పిమ్మట కవ్వపు త్రాడుగావున్న వాసుకి విషమును క్రక్కుచు తన కోరలచే శిలలను కాటువేయసాగెను . వాసుకి కోరలనుండి అగ్నిజ్వాలలవలె భయంకరమైన హాలాహలము అనే మహావిషము బయల్వెడలెను . ఆ విషాగ్ని సమస్త జగమును దగ్దమొనరించ సాగెను . అంతట దేవదానవ మొదలగు వారందరూ ప్రార్ధించగా పరమేశ్వరుడా హాలాహలమును శ్వీకరించి కంఠము నందు నిలుపుకుని గరళకంఠుడు అయ్యెను . 
తిరిగి పాల సముద్రమును చిలుక నారంభించగా మందర పర్వతము పాతాళమునకు దిగబడెను . అప్పుడు అందరూ ప్రార్ధించగా మహావిష్ణువు కూర్మ రూపమును ధరించి మందర పర్వతమును తన మోపున ధరించెను . తిరిగి పాలసముద్రమును చిలుక నారభించగా కొన్ని సంవత్సరములకు ఒక మహా పురుషుడు క్షీరసాగరమున ఉద్భవించెను . ఆయనయే ధన్వంతరి . ఆయన ఒక చేతితో దండమును మరియొక చేతితో కమండలమును ధరించి ఉండెను . ఇంకనూ అప్సరసలు కూడా అందుండీ ఉద్భవించిరి .  

దేవదానవులలో ఎవరూ అప్సరసలని కానీ వారి వెనుక ఉద్భవించిన పరిచారిక స్త్రీలను కానీ భార్యలుగా స్వీకరించలేదు . వరుణ దేవుని కూతురు వారుణి ఆ సాగరము నుండి ఉద్భవించెను . ఇంకను పాల సముద్రము నుండి కౌస్తభము అను దివ్యమణి ,దివ్య అశ్వము అలాగే అమృతము వెలువడినవి . అమృతము కోసము దేవదానవులు తీవ్రముగా పోట్లాడుకొనిరి . ఫలితముగా ఇరు పక్షములవారిలో చాలామంది మరణించిరి . పిమ్మట సర్వ శక్తిమంతుడు అయిన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే మోహినీ రూపము దాల్చి క్షణములో అమృతకలశమును హస్తగతమొనర్చుకొనెను . 


. తనను శరణు జొచ్చిన దేవతలకు అమృతమును దానవుల కళ్ళు కప్పి పోసెను . 

ఇంద్రుడు దైత్యులను హతమార్చి రాజ్యాధికారమును చేబట్టి ,ఋషులు ,చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకమును అతడు సంతోషముతో పరిపాలించెను . 

             రామాయణము బాలకాండ నలుబది అయిదవ సర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







Monday, 15 August 2016

రామాయణము బాలకాండ -నలుబది నాల్గవసర్గ

                              రామాయణము 

                        బాలకాండ -నలుబది నాల్గవసర్గ 

ఆ విధముగా గంగ భస్మరాసులపై ప్రవహించి వారిని పునీతులను చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై "భూమిమీద సాగర జలములు ఉన్నంతకాలము సగరపుత్రులు దేవతల వలె స్వర్గమున వుంటారు . ఈ గంగ నీకు పెద్దకూతురు ఈమెను ఇకనుండి భగీరధి అని పిలిచెదరు . ఈమె మూడులోకములలో ప్రవహించుట వలన  ఈమె త్రిపద గా వాసిగాంచును . నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నావు . ముల్లోకములలో తిరుగులేని యశస్సును సంపాదించావు .  శిరోమణీ పవిత్ర గంగా జలములో స్నానమాచరించి పునీతుడవు కమ్ము . నీ పితృదేవతలకు తర్పణములు వదులుము . "అని చెప్పి అంతర్ధానమయ్యెను . 
అంతట భగీరధుడు బ్రహ్మ చెప్పినట్లు తర్పణములు వదిలి శుచియై తన నగరమునకు వచ్చి సర్వ సంపదలతో తులతూగుచూ తన రాజ్యమును పాలించెను . ఆ రాజ్యములో ప్రజలందరూ శోక సంతాపములు లేక ఆరోగ్య భాగ్యములతో హాయిగా ఉండెను . 
ఓ రామా !గంగావతార వృత్తాన్తము నీకు వివరించితిని . నీకు శుభమగుగాక బ్రాహ్మణులు ,క్షత్రియులు మొదలగు వారందరికీ ఈ పవిత్ర గాద వివరించినచో వారి జీవితములు ధన్యమగును . వారికి యశస్సు ప్రాప్తించును . ఆయువు పెరుగును . పుత్రులు కలుగును . స్వర్గము ప్రాప్తించును .పితృదేవతలు ,దేవతలు  వారియెడ ప్రసన్నులగుదురు . శుభకరమైన ఈ గంగావతారనమును భక్తి  వారికి కోరికలు అన్నీ తీరును . ,వారి పాపములు అన్నీ నశించును . ఆయువు వృద్ధి చెందును . కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును . అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పెను . 


రామాయణము బాలకాండ నలుబది నాల్గవ సర్గ సమాప్తము . 


                 శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Friday, 12 August 2016

రామాయణము బాలకాండ -నలుబది మూడవ సర్గ

                                  రామాయణము 

                                          బాలకాండ -నలుబది మూడవ సర్గ 

బ్రహ్మ దేవుడు వెళ్లిన తర్వాత భగీరధుడు బొటనవేలు మీద నిలబడి ఒక సంవత్సరము కాలము కఠిన తపస్సు చేసెను . శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై గంగను శిరస్సున ధరించుటకు అంగీకరించెను . అంతట గంగాదేవి ఆకాశమున నుండి శివుడి శిరసుపైకి దూకేను ఆమె "నా ప్రవాహముతో శంకరుని కూడా పాతాళమునకు తీసుకువెళ్ళెదను . "అని మనసున భావించెను . 


శివుడు గంగ గర్వము గ్రహించి తన శిరస్సుపై పడిన గంగను కదలనివ్వకుండా తన జటలతో బంధించెను . అప్పుడు భగీరధుడు తిరిగి ఈశ్వరుడిని ప్రార్ధించగా ఆయన సంతుష్టుడై గంగను బ్రహ్మ చే సృష్టించబడిన బిందుసరోవరము నందు వదిలెను . అలా విడబడిన గంగ ఏడూ పాయలుగా విడువడి హ్లాదిని ,పావని ,నళిని అనే మూడు పాయలు తూర్పు వైపు ప్రవహించెను . సుచక్షువు ,సీత ,సింధువు అను పాయలు మంగళ ప్రదములైన జలములతో పశ్చిమం వైపు ప్రవహించెను . ఈ గంగా ప్రవాహములో ఏడవది భగీరదుని అనుసరించెను . ముందు భగీరధుడు ఒక దివ్య రథముపై వెళ్లుచుండగా మనో వేగముతో గంగ ఆయనను అనుసరించెను . ఆవిధముగా భూలోకమున ప్రవహించుచున్న గంగ మిక్కిలి సుందరముగా ఉండెను . దేవతలు ,ఋషులు ,మునులు ఈ ప్రవాహమును చూచుచు ,ఇది శివుని శిరస్సుపైనుండి పడినది కావున మిక్కిలి పవిత్రము అనుకుని నీటిని తీసుకుని శిరస్సున చల్లుకొనిరి . వారందరూ ఆ ప్రవాహమును అనుసరించిరి . 


అసాధారణ కార్యములు నిర్వహించడములో సమర్ధుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగ ఆయన ఆశ్రమమును మున్సి వేసెను . దానితో కోపించిన ఆయన ఆ సమస్త ప్రవాహమును మింగివేసెను . అంతట భగీరధుడు ,దేవతలు మునులు ,ఋషులు అందరూ జహ్ను మహర్షిని ప్రార్ధించిరి . అప్పుడు ఆయన గంగాజలమును తన చెవులు ద్వారా విడిచి పెట్టెను . కావున అప్పటి నుండి ఆవిడను జాహ్నవి అని పిలుస్తారు .. భగీరథుని అనుసరించుతూ గంగ సముద్రమును చేరెను . తదుపరి పాతాళ లోకమును చేరెను . సగర పుత్రుల భస్మ రాశులపై ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించెను . 

రామాయణము బాలకాండ నలుబది మూడవ సర్గ సమాప్తము . 


                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










Thursday, 11 August 2016

                         రామాయణము 




                           బాలకాండ -నలుబది రెండవ సర్గ 

సగరుడు మరణించిన తర్వాత అతని మనవడు అంశుమంతుడు రాజు అయ్యెను . అతని కుమారుడు దిలీపుడు . దిలీపుడిని రాజు చేసి అంశుమంతుడు గంగావతరణం కోసం హిమాలయాలకు వెళ్లి చాలా ఏళ్ళు తపస్సు చేసి తపస్సు ఫలించకుండానే మరణించెను . దిలీపుడు జరిగిన వృత్తాoతము తెలుసుకుని చాలా బాధపడెను గంగావతారణకు ఏమి చేయాలనీ దీర్ఘముగా ఆలోచించి ఏ నిర్ణయము తీసుకోకుండానే ఉండెను . అతని కుమారుడు భగీరధుడు . మిక్కిలి ధార్మికుడు . తన తండ్రి దిలీపుడు ఎన్నో యజ్ఞ యాగములను చేసి ఆ పుణ్య ఫలమున బాధ్యతలు కుమారుడికి అప్పగించి స్వర్గస్థుడయ్యెను . భగీరధునికి పుత్రులు లేరు అతడు తన గంగను భువిపైన అవతరింప చేయుటకు తపస్సు చేయుటకు రాజ్య భారమును మంత్రులకు అప్పగించి హిమాలయములకు వెళ్లెను . 
దీర్ఘ కాలము తపస్సు చేసి బ్రహ్మ దేవుడిని ప్రసన్నుడిని చేసుకుని ,తన ముత్తాతలకు ఉత్తమ గతులు కల్పించటానికి గంగను అవతరింప చేయమని ,ఇక్ష్వాకు వంశమునకు సంతానమును ప్రసాదింపమని రెండు వారములు కోరెను . ఆ వర ప్రభావంవలన గంగ హిమాలయములో ఉద్భవించినది . హిమవంతుని పెద్ద కుమార్తె ఆయిన గంగ ప్రవాహము యొక్క వేగ దాటికి ఈ భూలోకము తట్టుకోలేడు . గంగను ధరించ ఈశ్వరుడే సమర్ధుడు కావున అతని గూర్చి తపస్సు చేయమని బ్రహ్మ దేవుడు చెప్పి అంతర్ధానమయ్యెను . 

రామాయణము బాలకాండ నలుబదిరెండవ సర్గ సమాప్తము . 


                         శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Monday, 8 August 2016

                        రామాయణము 



                      బాలకాండ -నలుబది ఒకటవ సర్గ 

సగర మహారాజు తన పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి తన మనవడు అంశుమంతుని పిలిచి" నీ పినతండులు ఏమయినారో తెలియకుండా వుంది . నీవు శక్తీ మంతుడవు . సమర్థుడవు కావున నీవు వెళ్లి మీ పినతండ్రుల జాడ కనుగొని యాగాశ్వము జాడ కనుగొని దానిని బంధించిన వాడిని చంపి  రమ్ము "అని అతడిని పంపెను . 
తాతగారి ఆజ్ఞను పొంది అంశుమంతుడు ఖడ్గము  ధనుర్భాణములు ధరించి తన పినతండ్రులు భూమిని త్రవ్విన దారిలో వెళ్లి దిగ్గజాలకు నమస్కరించి ,వాటిని ఆచూకీ అడిగి భస్మరాశి వద్దకు చేరిరి . వారి మరణ వార్త విని దుఃఖితుడై ఏడవసాగెను . ఆ అంశుమంతుడు అచటనే సంచరిస్తున్న యాగాశ్వమును చూసేను . అతడు తన పినతండ్రులకు తర్పణములు ఇచ్చుటకు జలముకై చూడగా ఎక్కడా దొరకలేదు . తన తండ్రుల మేనమామ అయిన గరుత్మంతుడు కనపడి ధైర్యము చెప్పెను . గంగా జలములో తర్పణములు విడువుము అని పలికెను . ఇంకనూ యాగాశ్వము తీసుకువెళ్లి యజ్ఞమును పూర్తిచేయమని చెప్పెను . 
అతడు ఆవిధముగా యాగాశ్వమును తీసుకువెళ్లి యజ్ఞ దీక్షలో వున్న తాతకు జరిగిన వృత్తాంతము అంతా వివరించెను పుత్రుల మరణ వార్త దుఃఖించి యదావిధిగా యజ్ఞమును పూర్తిచేసెను . తన నగరమునకు వెళ్లెను . గంగను తీసుకువచ్చే విషయము గురించి ఒక నిర్ణయమునకు రాలేకపోయెను ఇలా చాలా కాలము గడిచెను . ఏ నిర్ణయము తీసుకోకుండానే ఆయన మరణించెను . 



రామాయణము బాలకాండ నలుబది ఒకటవ సర్గ సమాప్తము . 


                        శశి ,

 ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 









. 

Friday, 5 August 2016

                              రామాయణము 

                                     

                                        బాలకాండ -నలుబదియవ సర్గ 

ప్రాణులందరిని హింసించుచున్న సగర పుత్రుల బల పరాక్రమములకు భయపడిన దేవ ,దానవ ,యక్ష ,సర్ప జాతులతో బ్రహ్మ దేవుడు "ఈ భూమండలం అంతా సర్వ శక్తివంతుడైన శ్రీ మహావిష్ణువుది ఆయన కపిల మహర్షిగా అవతరించి వున్నాడు . ఆయన కోపాగ్నికి వీరందరూ భస్మము అవుతారు . ఇదంతా ముందే నిర్ణయింపబడినది . "అని చెప్పగా దేవతలు మొదలగు వారంతా సంతోషించి వారి వారి స్థానములకు వెళ్లిరి . 
సమస్త భూమండలమును సాధించిన సగర పుత్రులు యాగాశ్వము కనపడలేదని తండ్రికి చెప్పగా ,సగర మహారాజు "తిరిగి భూమండలమును త్రవ్వుము . యాగాశ్వమును ,దానిని భందించిన వానిని పట్టుకుని రమ్ము "అని ఆజ్ఞాపించెను . అంతట వారి తిరిగి  త్రవ్వుతూ పాతాళ  లోక తూర్పు దిక్కుకు చేరి అక్కడ భూమిని మోయుచున్న 'విరూపాక్షం 'అనే పేరు కల గజమును చూసి దానికి నమస్కార ,ప్రదక్షణ చేసి దక్షిణ దిక్కుకు వెళ్లిరి . అక్కడ 'మహాపద్మము 'అనే పేరుకల గజమును చూసి దాని స్వరూపమునకు ఆశ్చర్యము పొంది దానికి నమస్కార ప్రదక్షణలు చేసి పశ్చిమ దిక్కుకు చేరిరి . అక్కడ 'సోమనసము 'అనే పేరుకల గజమును చూసి దానికి నమస్కార ,ప్రదక్షణలు చేసి కుశలం అడిగి ,ఉత్తర దిశకు చేరిరి . అక్కడ  'భద్రము 'అనే పేరు కల గజమును చూసి దానిని సృశించి ప్రదక్షణ ,నమస్కారములు చేసి ఈశాన్య దిశకు వెళ్లిరి . 
అక్కడ వారు కపిల మహర్షిని చూసిరి . ఆయన సమీపములో సంచరించుచున్న యాగాశ్వమును చూసి ,కపిల మహర్షే అపహరించారని భావించి కోపముతో ,గుడ్లురుముచు ,నాగళ్లు ,గడ్డపారలు,రాళ్లు ,వివిధ వృక్షములు మొదలగు వానిని తీసుకుని ఆగుము ,ఆగుము అంటూ  ఆయన మీదకు వెళ్లిరి . వారి దురుసు మాటలు విని కపిల మహర్షి మహారోషావేశముతో హుంకారము చేసెను . ఆ హుంకారమునకు వారందరూ భస్మమయిరి . 

రామాయణము బాలకాండ నలుబదియవ సర్గ సమాప్తము .

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .