Friday 19 August 2016

రామాయణము బాలకాండ నలుబది ఆరవసర్గ

                         రామాయణము 

                               బాలకాండ నలుబది ఆరవసర్గ 

ఓ రామా !క్షీరసాగర మదనములో తన పుత్రులు ,తన సవతి పుత్రులు అయిన దేవతలచే వధింపబడుటచే దితి మిక్కిలి భాదపడుతూ మరీచి మహర్షి కుమారుడు తన భర్త అయిన కశ్యప మహర్షి వద్దకు వెళ్లి ,పుత్ర శోకముతో భాదపడుతూ తనకి ఇంద్రుని అదుపు చేయగల పుత్రుడిని ప్రసాదింపమని వేడుకొనెను . దానికి ఆ మహర్షి" నీ పవిత్రతను కాపాడుకుంటూ తపస్సు చేయుము . నీవు కోరుకున్నట్టే బలశాలి అయిన కుమారుడు జన్మిస్తాడు "అని పలికెను . 
కశ్యప మహర్షి పలుకులు విని దితి మిక్కిలి సంతోషించి 'కుశప్లవము 'అను పేరు కల క్షేత్రమునకు వెళ్లి తీవ్రముగా తపస్సు ఆచరించసాగెను . దితి అలా తపస్సు ఆచరిన్చుచుండగా దేవేంద్రుడు మిక్కిలి వినయ విధేయతలతో సపర్యలు చేయసాగెను . ఆవిడకు కావల్సినవి అన్నీ సమకూర్చుచు ,మాతృ భావముతో దితికి పాదములొత్తుట ,చామరముతో వీచుట మొదలగు పరిచర్యలు చేసెను . వేయి సంవత్సరములలో ఒక పది సంవత్సరములు మిగిలి ఉండగా దేవేంద్రుడి సేవలకు సంతుష్టురాలైన దితి జరిగిన వృత్తాన్తమును చెప్పి" నీ తమ్ముడిని నేను శాంత పరుస్తాను . మీరిద్దరూ కలసి ముల్లోకాధిపత్యమును అనుభవించగలరు ."అని చెప్పెను . 
ఈ విధముగా చెప్పి మిక్కిలి నిద్ర రావడంతో దితి మధ్యాహ్న వేళ మాట్లాడుతూనే వొరిగి నిద్రపోయెను . పగటిపూట నిద్రపోవుట ,తన శిరోజములు పాదధూళి తగులుట గ్రహించిన ఇంద్రుడు ,ఆమె అశుచి అయినది అని గ్రహించి తనను అదుపు చేయగలవాడు జన్మిస్తాడని భయముతో ధైర్యము చేసి ,సూక్ష్మ రూపములో దితి గర్భములోకి ప్రవేశించి ,గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేసెను . ఇంద్రుడి వజ్రాయుధము తగిలి శిశువు ఏడ్చుట మొదలుపెట్టేను . అప్పుడు ఇంద్రుడు ఏడవకు అని పలికి శిశువును ముక్కలు చేసెను . శిశువు ఏడుపు విని దితి మేల్కొని శిశువుని వధింపకు అని పలికెను . అప్పుడు ఇంద్రుడు బయటకు వచ్చి ,దితికి నమస్కరించి ,"అమ్మా !పాదములవైపు శిరస్సును ఉంచి నిద్రించుటచే నీవు అశుచివైతివి . ఈ అవకాశమును చూసుకొని ,యుద్దములో నన్ను చంపగల వాడిని 7 ముక్కలుగా చేసితిని . నన్ను క్షమింపుము "అని పలికెను . 

రామాయణము బాలకాండ నలుబదిఆరవ సర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










 

No comments:

Post a Comment