Friday 12 August 2016

రామాయణము బాలకాండ -నలుబది మూడవ సర్గ

                                  రామాయణము 

                                          బాలకాండ -నలుబది మూడవ సర్గ 

బ్రహ్మ దేవుడు వెళ్లిన తర్వాత భగీరధుడు బొటనవేలు మీద నిలబడి ఒక సంవత్సరము కాలము కఠిన తపస్సు చేసెను . శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై గంగను శిరస్సున ధరించుటకు అంగీకరించెను . అంతట గంగాదేవి ఆకాశమున నుండి శివుడి శిరసుపైకి దూకేను ఆమె "నా ప్రవాహముతో శంకరుని కూడా పాతాళమునకు తీసుకువెళ్ళెదను . "అని మనసున భావించెను . 


శివుడు గంగ గర్వము గ్రహించి తన శిరస్సుపై పడిన గంగను కదలనివ్వకుండా తన జటలతో బంధించెను . అప్పుడు భగీరధుడు తిరిగి ఈశ్వరుడిని ప్రార్ధించగా ఆయన సంతుష్టుడై గంగను బ్రహ్మ చే సృష్టించబడిన బిందుసరోవరము నందు వదిలెను . అలా విడబడిన గంగ ఏడూ పాయలుగా విడువడి హ్లాదిని ,పావని ,నళిని అనే మూడు పాయలు తూర్పు వైపు ప్రవహించెను . సుచక్షువు ,సీత ,సింధువు అను పాయలు మంగళ ప్రదములైన జలములతో పశ్చిమం వైపు ప్రవహించెను . ఈ గంగా ప్రవాహములో ఏడవది భగీరదుని అనుసరించెను . ముందు భగీరధుడు ఒక దివ్య రథముపై వెళ్లుచుండగా మనో వేగముతో గంగ ఆయనను అనుసరించెను . ఆవిధముగా భూలోకమున ప్రవహించుచున్న గంగ మిక్కిలి సుందరముగా ఉండెను . దేవతలు ,ఋషులు ,మునులు ఈ ప్రవాహమును చూచుచు ,ఇది శివుని శిరస్సుపైనుండి పడినది కావున మిక్కిలి పవిత్రము అనుకుని నీటిని తీసుకుని శిరస్సున చల్లుకొనిరి . వారందరూ ఆ ప్రవాహమును అనుసరించిరి . 


అసాధారణ కార్యములు నిర్వహించడములో సమర్ధుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగ ఆయన ఆశ్రమమును మున్సి వేసెను . దానితో కోపించిన ఆయన ఆ సమస్త ప్రవాహమును మింగివేసెను . అంతట భగీరధుడు ,దేవతలు మునులు ,ఋషులు అందరూ జహ్ను మహర్షిని ప్రార్ధించిరి . అప్పుడు ఆయన గంగాజలమును తన చెవులు ద్వారా విడిచి పెట్టెను . కావున అప్పటి నుండి ఆవిడను జాహ్నవి అని పిలుస్తారు .. భగీరథుని అనుసరించుతూ గంగ సముద్రమును చేరెను . తదుపరి పాతాళ లోకమును చేరెను . సగర పుత్రుల భస్మ రాశులపై ప్రవహించి వారికి ఉత్తమ గతులు కల్పించెను . 

రామాయణము బాలకాండ నలుబది మూడవ సర్గ సమాప్తము . 


                             శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 










No comments:

Post a Comment