Thursday 18 August 2016

రామాయణము బాలకాండ -నలుబదిఐదవ సర్గ

                                   రామాయణము 

                                   బాలకాండ -నలుబదిఐదవ సర్గ 

ఆ రాత్రి రామ లక్ష్మణులు ,విశ్వమిత్రుడు ,మునులు అక్కడే విశ్రమించి తెల్లవారి లేచి తమ విధులు పూర్తి చేసుకుని గంగ ను దాటి ఉత్తర తీరమునకు చేరిరి . పిమ్మట వారు 'విశాల 'అను నగరము దర్శించిరి . రమ్యమైన ఆ నగరము అమరావతి వలేదివ్యముగా విరాజిల్లుచు ఉండెను . 
మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముడు విశ్వామిత్రునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషాల గురించి తెలుపమని ప్రార్ధించెను . ఆయన ప్రార్ధనను విన్న విశ్వామిత్రుడు ఇలా చెప్పెను . "ఓ రామా !శుభకరమైన దేవేంద్రుడి కథను వివరించెదను అట్లే ఈ దేశమున జరిగిన ఒక సంఘటనను గూర్చియు వివరించెదను వినుము . 
ఓ రామా !పూర్వకాలమున కృతయుగము న దితి పుత్రులు బలశాలురుగా ,అదితి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహా పరాక్రమశాలురు గా ఉండిరి . దేవతలకు ,దైత్యులకు మనకు రోగములు ,ముసలితనము మరణము లేకుండుట ఎట్లు అను ఆలోచన కలిగెను . ఓ రామా !ఆ మహాత్ములు ఇలా ఆలోచించుచుండగా క్షీరసాగరమును మదించి దానినుండి అమృతమును పొందుదాము అనే ఉపాయము వారికి తట్టెను . 
శక్తి సంపన్నులైన ఆ దేవదానవులు మందర పర్వతమును కవ్వముగా ,వాసుకిని త్రాడుగా చేసుకుని క్షీరసాగరమును చిలికిరి . ఇలా వేయి సంవత్సరములు జరిగిన పిమ్మట కవ్వపు త్రాడుగావున్న వాసుకి విషమును క్రక్కుచు తన కోరలచే శిలలను కాటువేయసాగెను . వాసుకి కోరలనుండి అగ్నిజ్వాలలవలె భయంకరమైన హాలాహలము అనే మహావిషము బయల్వెడలెను . ఆ విషాగ్ని సమస్త జగమును దగ్దమొనరించ సాగెను . అంతట దేవదానవ మొదలగు వారందరూ ప్రార్ధించగా పరమేశ్వరుడా హాలాహలమును శ్వీకరించి కంఠము నందు నిలుపుకుని గరళకంఠుడు అయ్యెను . 
తిరిగి పాల సముద్రమును చిలుక నారంభించగా మందర పర్వతము పాతాళమునకు దిగబడెను . అప్పుడు అందరూ ప్రార్ధించగా మహావిష్ణువు కూర్మ రూపమును ధరించి మందర పర్వతమును తన మోపున ధరించెను . తిరిగి పాలసముద్రమును చిలుక నారభించగా కొన్ని సంవత్సరములకు ఒక మహా పురుషుడు క్షీరసాగరమున ఉద్భవించెను . ఆయనయే ధన్వంతరి . ఆయన ఒక చేతితో దండమును మరియొక చేతితో కమండలమును ధరించి ఉండెను . ఇంకనూ అప్సరసలు కూడా అందుండీ ఉద్భవించిరి .  

దేవదానవులలో ఎవరూ అప్సరసలని కానీ వారి వెనుక ఉద్భవించిన పరిచారిక స్త్రీలను కానీ భార్యలుగా స్వీకరించలేదు . వరుణ దేవుని కూతురు వారుణి ఆ సాగరము నుండి ఉద్భవించెను . ఇంకను పాల సముద్రము నుండి కౌస్తభము అను దివ్యమణి ,దివ్య అశ్వము అలాగే అమృతము వెలువడినవి . అమృతము కోసము దేవదానవులు తీవ్రముగా పోట్లాడుకొనిరి . ఫలితముగా ఇరు పక్షములవారిలో చాలామంది మరణించిరి . పిమ్మట సర్వ శక్తిమంతుడు అయిన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే మోహినీ రూపము దాల్చి క్షణములో అమృతకలశమును హస్తగతమొనర్చుకొనెను . 


. తనను శరణు జొచ్చిన దేవతలకు అమృతమును దానవుల కళ్ళు కప్పి పోసెను . 

ఇంద్రుడు దైత్యులను హతమార్చి రాజ్యాధికారమును చేబట్టి ,ఋషులు ,చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకమును అతడు సంతోషముతో పరిపాలించెను . 

             రామాయణము బాలకాండ నలుబది అయిదవ సర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 







No comments:

Post a Comment