Friday 5 August 2016

                              రామాయణము 

                                     

                                        బాలకాండ -నలుబదియవ సర్గ 

ప్రాణులందరిని హింసించుచున్న సగర పుత్రుల బల పరాక్రమములకు భయపడిన దేవ ,దానవ ,యక్ష ,సర్ప జాతులతో బ్రహ్మ దేవుడు "ఈ భూమండలం అంతా సర్వ శక్తివంతుడైన శ్రీ మహావిష్ణువుది ఆయన కపిల మహర్షిగా అవతరించి వున్నాడు . ఆయన కోపాగ్నికి వీరందరూ భస్మము అవుతారు . ఇదంతా ముందే నిర్ణయింపబడినది . "అని చెప్పగా దేవతలు మొదలగు వారంతా సంతోషించి వారి వారి స్థానములకు వెళ్లిరి . 
సమస్త భూమండలమును సాధించిన సగర పుత్రులు యాగాశ్వము కనపడలేదని తండ్రికి చెప్పగా ,సగర మహారాజు "తిరిగి భూమండలమును త్రవ్వుము . యాగాశ్వమును ,దానిని భందించిన వానిని పట్టుకుని రమ్ము "అని ఆజ్ఞాపించెను . అంతట వారి తిరిగి  త్రవ్వుతూ పాతాళ  లోక తూర్పు దిక్కుకు చేరి అక్కడ భూమిని మోయుచున్న 'విరూపాక్షం 'అనే పేరు కల గజమును చూసి దానికి నమస్కార ,ప్రదక్షణ చేసి దక్షిణ దిక్కుకు వెళ్లిరి . అక్కడ 'మహాపద్మము 'అనే పేరుకల గజమును చూసి దాని స్వరూపమునకు ఆశ్చర్యము పొంది దానికి నమస్కార ప్రదక్షణలు చేసి పశ్చిమ దిక్కుకు చేరిరి . అక్కడ 'సోమనసము 'అనే పేరుకల గజమును చూసి దానికి నమస్కార ,ప్రదక్షణలు చేసి కుశలం అడిగి ,ఉత్తర దిశకు చేరిరి . అక్కడ  'భద్రము 'అనే పేరు కల గజమును చూసి దానిని సృశించి ప్రదక్షణ ,నమస్కారములు చేసి ఈశాన్య దిశకు వెళ్లిరి . 
అక్కడ వారు కపిల మహర్షిని చూసిరి . ఆయన సమీపములో సంచరించుచున్న యాగాశ్వమును చూసి ,కపిల మహర్షే అపహరించారని భావించి కోపముతో ,గుడ్లురుముచు ,నాగళ్లు ,గడ్డపారలు,రాళ్లు ,వివిధ వృక్షములు మొదలగు వానిని తీసుకుని ఆగుము ,ఆగుము అంటూ  ఆయన మీదకు వెళ్లిరి . వారి దురుసు మాటలు విని కపిల మహర్షి మహారోషావేశముతో హుంకారము చేసెను . ఆ హుంకారమునకు వారందరూ భస్మమయిరి . 

రామాయణము బాలకాండ నలుబదియవ సర్గ సమాప్తము .

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  

                      


                 

















No comments:

Post a Comment