Saturday, 27 August 2016

రామాయణము బాలకాండ -ఏబదిమూడవసర్గ

                                 రామాయణము 

                                      బాలకాండ -ఏబదిమూడవసర్గ 

వశిష్టుని ఆదేశము మేరకు కామధేనువు విశ్వామిత్రునికి ,అతని పరివారమునకు వారివారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్ధములు సమకూర్చెను . ఆ కామధేనువు చెరుకు గడలను ,రసములను ,తేనెలు ,పేలాలు ,మధురపానీయములు ,ఆసవములను ,శ్రేష్ఠమయిన పానకములను ,నానావిధ భక్ష్యములను ,పర్వత ప్రమాణములో వేడి వేడి అన్నపురాసులను ,పాయసములు ,సూపములు ,పెరుగులు ,పాలు ,క్షణములో అచ్చట సమృద్ధిగా సిద్ధమాయెను . నానా విధములైన మధుర రసములు ,షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములు ,పాత్రలనిండా బెల్లపు పాకముతో కూడిన పెక్కు విధములగు తినుబండారములు మొదలయినవి అన్నీ ప్రత్యక్షమాయెను . 
ఆ ఆహార పదార్థములను విశ్వామిత్ర మహర్షి ,అతని పరివారము సంతుష్టముగా భుజించిరి . దానితో విశ్వామిత్రుడు సంతుష్టుడై "ఓ మహర్షీ నీ అతిధి సత్కారములచే మిక్కిలి సంతుష్టుడను అయ్యాను నాదొక విన్నపము . నీకు లక్ష గోవులను ఇచ్చెదను . నాకు ఈ కామధేనువును ఇవ్వుము ఇది గోరత్నము కావున న్యాయముగా రాజుకే ఇది చెందవలెను . కావున దీనిని నాకు ఇచ్చివేయుము "అని పలికెను . 
అంత వశిష్ఠుడు "ఓ రాజా !నీవెన్ని లక్షల కోట్ల గోవులను మారె ఇతరములు ఇచ్చినను నేను ఈ కామధేనువుని ఇవ్వలేను . ఇదే నా సర్వ కర్మలకు మూలం . కావున నన్ను మన్నించి ఈ కామధేనువుని మాత్రం కోరవద్దు "అని చెప్పెను . ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడయ్యెను . ఇలా అనెను . 
"ఓ నిష్టా గరిష్టుడా !నడుమనందు బంగారు త్రాళ్ల తోనూ సువర్ణ కంఠాభరణములతో ,అంకుశములతో అలంకృతమైన 14000 ఏనుగులను ఇచ్చెదను . చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన నాలుగేసి తెల్లని అశ్వములతో కూర్చబడిన 800 బంగారు రథములను సమర్పించెదను . కాంభోజ ,బాహ్లిక దేశములలో పుట్టి గాంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్ఠములగు 11000 గుఱ్ఱములను ఇచ్చెదను . పలు వన్నెలతో ఒకదానికంటే మరియొకటి మేలయిన ,వయసులో వున్న ఒక కోటి ఆవులను నీకు సమర్పింతును . ఓ బ్రాహ్మణోత్తమా !నీవు కోరినంత బంగారమును ,రత్నాలరాశులను ఇచ్చెదను . ఈ కామధేనువును మాత్రము నాకు ఇమ్ము . "అని పలికెను . 
విశ్వామిత్రుడి మాటలు విని వశిష్ఠుడు ఇలా పలికెను . "ఓ రాజా !ఇదియే నాకు రత్నాల ఘని ,ధననిది ,నా సర్వస్వమూ ఇదే ,అంతేకాదు ఇది నా జీవనాధారము . ధర్మ ,పూర్ణమాసాది యాగములను దక్షిణలతో కూడిన యజ్ఞములను ,తదితర పుణ్య కార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము . నా ఋషి జీవన సమస్త విధులకు ఈ కామధేనువే జీవగఱ్ఱ . ఇక పెక్కు మాటలతో పనిలేదు . సకల మనోరధములను ఈడేర్చు ఈ దివ్యదేనువును ఇయ్యనే ఇయ్యను ". అనెను . 

రామాయణము బాలకాండ ఏబదిమూడవ సర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








                                      

Friday, 26 August 2016

రామాయణము బాలకాండ -ఏబదిరెండవ సర్గ

                                          రామాయణము 

                                             బాలకాండ -ఏబదిరెండవ సర్గ  

విశ్వామిత్రుడు గౌతముడి ఆశ్రమముని చూసి ఎంతో సంతోషించెను గౌతముని వద్దకు వెళ్లి ఆయనకు ప్రణామము చేసెను . మహిమాన్వితుడైన వశిష్ఠుడు  ఆయనకు స్వాగత సత్కారములు చేసెను . అతిధి పూజలు చేసెను . ఒకరినొకరు కుశల ప్రశ్నలు కావించుకొనిరి . వారు చక్కని కదా ప్రసంగములతో చాలా సమయము గడిపిరి .  పిమ్మట వశిష్ట మహర్షి "ఓ రాజా ! నీ చతురంగ బలమునకు ,నీకు ఆతిధ్యము ఇవ్వదలిచితిని . దయతో నన్ను అనుగ్రహింపుము . "అని కోరెను . 
విశ్వామిత్రుడు "మీ ప్రియా వచనములు మాకు సంతృప్తి కూర్చినవి అవే మాకు సత్కారములు . నీకు నా నమస్కారములు నాయెడ మిత్ర భావము చూపుము . వెళ్ళుటకు నాకు అనుజ్ఞను ఇమ్ము "అని కోరెను . దానికి వశిష్ఠుడు  అంగీరింపక పదే పదే ఆదిత్యము స్వీకరించమని కోరెను . అప్పుడు విశ్వామిత్రుడు అంగీకరించెను . 
విశ్వామిత్రుడు అంగీరింపగా వశిష్ఠుడు సంతోషముతో పలు వన్నెలు కల కామధేనువుని పిలిచెను . "చిత్ర విచిత్ర వర్ణముకల ఓ కామధేను ! నా మాట విని సైన్యముతో ,అపరివారముతో కూడి మన ఆశ్రమమునకు వచ్చిన ఈ మహారాజుకి నేను ఆతిధ్యమివ్వదలిచాను . కావున వారందరకీ ఇష్టమైన వంటకములను ,పిండివంటలను ,ఇంకనూ రకరకాల రసములు మొదలగు సమస్త పదార్థములను సమృద్ధిగా శీఘ్రమే వర్షింపుము . "అని పలికెను . 


రామాయణము బాలకాండ ఏబదిరెండవ సర్గ సమాప్తము . 

             శశి,

ఎం . ఏ (తెలుగు ),  తెలుగు పండితులు .  










Thursday, 25 August 2016

రామాయణము బాలకాండ -ఏబదియొకటవ సర్గ

                                               రామాయణము 

                                  బాలకాండ -ఏబదియొకటవ సర్గ  

గౌతమముని పెద్దకుమారుడు తపోధనుడు అయిన శతానందుడు విశ్వామిత్ర మహర్షి మాటలు (అహల్యా శాప విమోచనం )విని ,ఉత్సుకతతో" మా తల్లి విధి వశమున శాపమునకు గురి అయినదని రామచంద్రులకు తెలిపినారా ?శాప విమోచన అనంతరము మా తండ్రి గారు అచటికి ఏతెంచారా ?మా తల్లిని అనుగ్రహించారా ?వారిరువురు తమకు అతిధి మర్యాదలు ఒనర్చినారా ?"అని అడిగెను . 
విశ్వామిత్రుడు నా కర్తవ్యమును నేను నెరవేర్చినాను . మీ తండ్రిగారు రేణుకను జమదగ్ని వలె తన భార్య అయిన అహల్యను శ్వీకరించారు . అని తెలిపెను పిమ్మట శతానందుడు రామునితో 
"నరశ్రేష్ఠుడవు అయిన ఓ రామా !మా తల్లి శాపము తొలగించినందుకు నీకు శతకోటి వందనములు . నీ రాకతో మేము ధన్యులమైతిమి . నిన్ను తీసుకువచ్చిన ఈ విశ్వామిత్రుడు మిక్కిలి గొప్పవాడు . ఈయనఅంత ధన్యుడు ఈ భూమండలంలో ఇంకొకడు లేడు . ఈయన తపః ప్రభావమును ,చరిత్రను తెలిపెదను వినుము . 
ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు ,సమస్త విద్యలలో ఆరితేరినవాడు . శత్రువులను అణచినవాడు అనుక్షణము ప్రజాక్షేమము కోరుచు రాజ్యపాలన చేసినవాడు . ప్రజాపతి కుమారుడు కుశుడు ,అతని కుమారుడు కుశనాభుడు 
అతడు మిక్కిలి బలశాలి ,అతని కుమారుడు గాది ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు . మహాబల సంపన్నుడు అయిన ఈ విశ్వామిత్రుడు పెక్కు కాలము చక్కగా రాజ్యపాలన చేసి అనేకమంది సైన్యముతో కూడి భూమండలమును చుట్టివచ్చెను . అతడు నగరములు ,రాష్ట్రములు ,నదులు ,పర్వతములు ,ఆశ్రమములు దాటుతూ వశిష్టుని ఆశ్రమమునకు విచ్చేసెను . ప్రశాంత వాతావరణముతో ఏంటో రమ్యముగా దేవదానవ ,గంధర్వులతో ,కిన్నెరులతో చక్కగా అది శోభిల్లుతూ ఉండెను . 
ఆ ఆశ్రమములో అనేకమంది తపోధనులు అయినా మునులు కలరు . వారిలో కొందరికి జలము మాత్రమే ఆహారము ,కొందరికి వాయువు మాత్రమే ఆహారము ,మరికొందరికి పండిరాలిన ఆకులు మాత్రమే ఆహారము . ఇంకొందరికి పండ్లు ,దుంపలు మాత్రమే ఆహారము . వారందరూ మనోనిగ్రహము కలిగినవారు . రాగద్వేషములకు అతీతులు ,జితేంద్రియులు . పెక్కుమంది మహిమాన్వితులైన మునులతో ఆ ఆశ్రమము మరో బ్రహ్మలోకమా అన్నట్లుగా వున్నది . గొప్పవాడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమము ను దర్శించెను . 

రామాయణము బాలకాండ ఏబదియొకటవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















Wednesday, 24 August 2016

రామాయణము బాలకాండ - ఏబదియవ సర్గ

                          రామాయణము 



                     బాలకాండ - ఏబదియవ సర్గ 

శ్రీరామ లక్ష్మణులతో కలసి విశ్వామిత్రుడు ఈశాన్య దిశగా ప్రయాణించి జనక మహారాజు యజ్ఞ వేదికకు చేరుకొనిరి . అక్కడ అనేకమంది మునులతో ,ఋషులతో వేదపండితులతో నిండుగా ఉండెను . జలసమృద్ది కల ఒక ప్రశాంత నిర్జన ప్రదేశమును తమ బసగా రామలక్ష్మణులు విశ్వామిత్రుడు ఏర్పాటు చేసుకుని ,విశ్రమించారు . 
విశ్వామిత్ర మహర్షి రాక గురించి తెలుసుకున్న జనక మహారాజు స్వయముగా వారి వద్దకు వచ్చి అతిధి మర్యాదలు చేసి ,కుశల ప్రశ్నలు వేసెను . విశ్వామిత్ర మహర్షి కూడా జనక మహారాజుని కుశల ప్రశ్నలు అడిగి అక్కడ జరుగుతున్నా యాగము గురించి ప్రశ్నించెను . దానికి జనక మహారాజు ఆ యాగ వృత్తాన్తము అంతా చెప్పి తమరు వచ్చుట వలన ఈ యాగముకు సాఫల్యము చేకూరిందని పలికి ,మరొక్క పన్నెండు దినములలో ఈ యాగము పరిసమాప్తి అవుతుందని చెప్పెను . ఇంకా హవిర్భాగములు శ్వీకరించుటకు వచ్చే దేవతలను తమరు చూడవచ్చని పలికెను . 
జనక మహారాజు రామలక్ష్మణులను చూసి విశ్వామిత్రునితో వారి గురించి ప్రశ్నించెను . విశ్వామిత్ర మహర్షి వారి గురించి , తాటక వద గురించి ,యాగ సంరక్షణ గురించి ,అహల్యా శాప విమోచనం గురించి సమస్తము జనక మహారాజుకు వివరించి ,ప్రస్తుతము జనక మహారాజు వద్దనున్న శివధనస్సు చూచుటకు వచ్చినారని తెలిపెను . 

    రామాయణము  బాలకాండ ఏబదియవ సర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 












Tuesday, 23 August 2016

రామాయణము బాలకాండ -నలుబది తొమ్మిదవ సర్గ

                            రామాయణము 


                                   బాలకాండ -నలుబది తొమ్మిదవ సర్గ 

గౌతముడి వలన శపింపబడిన ఇంద్రుడు అగ్ని మొదలయిన దేవతలతో "గౌతముని శాప కారణముగా నేను వృషణములు లేని వాడను అయ్యాను . అహల్య ఆకారణముగా శపింపబడినది . నాకు ఎట్లయినను తిరిగి వృషణము వచ్చునట్లు చేయుడు "అని పలికెను . అప్పుడు వారందరూ పితృదేవతల  వద్దకు వెళ్లి జరిగిన విషయమును చెప్పి యజ్ఞములలో మీకు సమర్పింపబడే మేషము (మేకపోతు )యొక్క వృషణములు ఇచ్చి ఇంద్రుడిని సఫలుడిని గావింపుము  అని కోరిరి . వారును అంగీకరించి వారికి సమర్పింపబడిన మేకపోతుల వృషణములను ఇంద్రునికి సమర్పించిరి . అని విశ్వామిత్రుడు శ్రీ రాముడికి ఆ ఆశ్రమ వృత్తాన్తమును తెలిపెను . 
విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ప్రకారము శ్రీరాముడు ఆ ఆశ్రమములోకి ప్రవేశించి అక్కడ కఠోర దీక్షలో ఉండి అన్యులెవ్వరికి కనపడకుండా వున్నా అహల్యను చూసేను . శ్రీరాముడి దర్శించినంతనే అహల్య శాప విముక్తురాలగెను . పిమ్మట అక్కడ వున్నా వారందరికీ ఆవిడ కనిపించెను  . 


రామలక్ష్మణులు అహల్యా దేవి పాదములకు నమస్కరించిరి . పిమ్మట అహల్య కూడా తన భర్త గౌతముని మాటలు తలచుకుని రామలక్ష్మణుల పాదముల్లకు నమస్కారములు చేసినది . పిమ్మట వారిని ఆహ్వానించి అతిధి సత్కారములు చేసింది . అప్పుడు దేవతలు దుందుభులు మ్రోగించుచు పుష్పవర్షము కురిపించిరి . గంధర్వులు గానములు చేసిరి . అప్సరసలు నాట్యము చేసిరి . 
తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయము గ్రహించి గౌతముడు వచ్చి ,అహల్యా సమేతముగా విధివిధానంగా భక్తి శ్రద్దలతో శ్రీరాముని పూజించెను . పిమ్మట శ్రీరాముడు వారి నుండి వీడ్కోలు తీసుకుని మిథిలా నగరము వైపు తన ప్రయాణమును సాగించేను . 

రామాయణము బాలకాండ నలుబది తొమ్మిదవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

            



















Monday, 22 August 2016

రామాయణము బాలకాండ -నలుబది ఎనిమిదవ సర్గ

                            రామాయణము 



                               బాలకాండ -నలుబది ఎనిమిదవ సర్గ 

కుశల ప్రశ్నలు అయినా తర్వాత 'సుమతి 'మహారాజు సుకుమారులైన ఈ బాలురు ఎవరు ?అని రామలక్ష్మణులను ఉద్దేశించి విశ్వామిత్ర మహర్షిని అడిగెను . అప్పుడు విశ్వామిత్రుడు వారు దశరధుని పుత్రులని తాటక ,సుభాహాది రాక్షసుల వదలను పూసగుచ్చినట్టు ఆ మహారాజుకి వివరించెను . 'సుమతి మహారాజు ఆ వృత్తాన్తము అంతా విని మిక్కిలి సంతోషించెను . ఆ రోజు అచటనే విశ్రమించి మరునాటి ఉదయమే విశ్వామిత్రుడు ,రామలక్ష్మణులు మిథిలా నగరము వైపుగా తమ ప్రయాణమును కొనసాగించిరి . 
మిధిలకు సమీపములో ఒక సుందరమైన ఆశ్రమమును వారు చూసిరి . అది మిక్కిలి పాతది అయినాను ఎంతో రామణీయముగా వున్నది . అక్కడ ఎవ్వరు లేరు . రాముడు ఇదేమి అని విశ్వామిత్ర మహర్షిని అడుగగా ఆ వృత్తాంతమును మహర్షి ఇలా తెలిపెను . 
"ఓ నరశ్రేష్టా !ఇది మహాత్ముడైన గౌతమముని ఆశ్రమము ఇది ఒకానొకప్పుడు దివ్య శోభలతో విలసిల్లుచు దేవతలా పూజలను సైతము అందుకొంచు ఉండెను . పూర్వకాలమున గౌతమముని ,తన భార్య అహల్యతో కూడి ఈ ఆశ్రమమున నివశించెను . గౌతమముని ఆశ్రమమున లేని సమయము చూసుకుని ఇంద్రుడు గౌతముని వేషము దాల్చి అహల్య వద్దకు వచ్చెను . తన దివ్య దృష్టితో వచ్చినది ఇంద్రుడు అని తెలుసుకుని అహల్య "ఓ సురశ్రేష్టా నేను దాంపత్య జీవితమున సంతుష్టురాలును ఇక్కడి నుండి వెంటనే వెళ్లి నీ ,నీ గౌరవము నిలుపుము ". అని పలికెను . అందుకు ఇంద్రుడు అలాగే అని పలికి గౌతముడు వచ్చునేమో అని భయపడుతూ వెలుపలికి రాగా గౌతముడు వస్తూ ఇంద్రుడిని చూసి కోపముతో విగత వృషణుడవు అయ్యెదవు అని శపించెను . అహల్యను కూడా వేల సంవత్సరములు అన్నపానాదులు లేక వాయు భక్షణముతో తపించుచు ఈ ఆశ్రమముననే పడివుండెదవు అని శపించెను . 
దశరధుని కుమారుడు అయిన శ్రీరాముడి పాదధూళి స్పర్శ తో పవిత్రురాలివి అవుతావు అని చెప్పి ఈ ఆశ్రమము వీడి హిమాలయములలో తపస్సు నిమిత్తమై వెడలెను . 

రామాయణము బాలకాండ నలుబది ఎనిమిదవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

                      






















Saturday, 20 August 2016

రామాయణము బాలకాండ -నలుబది ఏడవసర్గ

                                రామాయణము 

                      బాలకాండ -నలుబది ఏడవసర్గ           

దితి తన గర్భస్థ శిశువు ముక్కలైనందుకు మిక్కిలి చింతించెను . ఏడు ముక్కలు ఏడుగురు కుమారులుగా మరుత్తులు అనే పేరుతో విఖ్యాతులై దివ్యలోకములో సంచరింతురు . అని ఇంద్రునితో పలికెను . ఇంద్రుడు నివశించి ,దితికి సేవలు చేసిన ప్రదేశము ఇదే అని విశ్వామిత్రుడు రామునికి తాము వున్న స్థానము గురించి చెప్పెను . ఇక్ష్వాకు వంశమునకు చెందిన 'సుమతి 'అను పేరు గల జితేంద్రియుడు అయిన మహారాజు ప్రస్తుతము ఈ విశాల నగరమును    పాలించుచున్నారు . విశాల నగరమును పాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూలపురుషుడు అయిన ఇక్ష్వాకుని అనుగ్రహముచే దీర్గాయుష్మంతులై వర్ధిల్లిరి . వారందరూ మహాత్ములు ,పరాక్రమశాలురు ,పరమ ధార్మికులు అని విశ్వామిత్రుడు చెప్పెను . 
ఆ రాత్రి అక్కడే విశ్రమించాలని నిశ్చయించుకున్నారు . మిగుల పరాక్రమవంతుడు ,మహా యశశ్వి అయినా సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు తెలుసుకుని ,పురోహితులతో ,బంధువులతో కూడి ఎదురేగి స్వాగత సత్కారములు చేసెను . సకల మర్యాదలతో ఆయనను పూజించి ,అంజలి ఘటించి కుశల ప్రశ్నలు అడిగెను . పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇలా పలికెను . 
"ఓ మహాత్మా !నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసిరి . నేను ధన్యుడనైతిని . మీ దర్శన భాగ్యము కూడా కలిగెను . ఇక నాయంతటి ధన్యుడు ఎవ్వడుండును ?

రామాయణము బాలకాండ నలుబది ఏడవ సర్గ సమాప్తము . 


                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .