Tuesday 23 August 2016

రామాయణము బాలకాండ -నలుబది తొమ్మిదవ సర్గ

                            రామాయణము 


                                   బాలకాండ -నలుబది తొమ్మిదవ సర్గ 

గౌతముడి వలన శపింపబడిన ఇంద్రుడు అగ్ని మొదలయిన దేవతలతో "గౌతముని శాప కారణముగా నేను వృషణములు లేని వాడను అయ్యాను . అహల్య ఆకారణముగా శపింపబడినది . నాకు ఎట్లయినను తిరిగి వృషణము వచ్చునట్లు చేయుడు "అని పలికెను . అప్పుడు వారందరూ పితృదేవతల  వద్దకు వెళ్లి జరిగిన విషయమును చెప్పి యజ్ఞములలో మీకు సమర్పింపబడే మేషము (మేకపోతు )యొక్క వృషణములు ఇచ్చి ఇంద్రుడిని సఫలుడిని గావింపుము  అని కోరిరి . వారును అంగీకరించి వారికి సమర్పింపబడిన మేకపోతుల వృషణములను ఇంద్రునికి సమర్పించిరి . అని విశ్వామిత్రుడు శ్రీ రాముడికి ఆ ఆశ్రమ వృత్తాన్తమును తెలిపెను . 
విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞ ప్రకారము శ్రీరాముడు ఆ ఆశ్రమములోకి ప్రవేశించి అక్కడ కఠోర దీక్షలో ఉండి అన్యులెవ్వరికి కనపడకుండా వున్నా అహల్యను చూసేను . శ్రీరాముడి దర్శించినంతనే అహల్య శాప విముక్తురాలగెను . పిమ్మట అక్కడ వున్నా వారందరికీ ఆవిడ కనిపించెను  . 


రామలక్ష్మణులు అహల్యా దేవి పాదములకు నమస్కరించిరి . పిమ్మట అహల్య కూడా తన భర్త గౌతముని మాటలు తలచుకుని రామలక్ష్మణుల పాదముల్లకు నమస్కారములు చేసినది . పిమ్మట వారిని ఆహ్వానించి అతిధి సత్కారములు చేసింది . అప్పుడు దేవతలు దుందుభులు మ్రోగించుచు పుష్పవర్షము కురిపించిరి . గంధర్వులు గానములు చేసిరి . అప్సరసలు నాట్యము చేసిరి . 
తన ఆశ్రమమునకు శ్రీరాముడు విచ్చేసిన విషయము గ్రహించి గౌతముడు వచ్చి ,అహల్యా సమేతముగా విధివిధానంగా భక్తి శ్రద్దలతో శ్రీరాముని పూజించెను . పిమ్మట శ్రీరాముడు వారి నుండి వీడ్కోలు తీసుకుని మిథిలా నగరము వైపు తన ప్రయాణమును సాగించేను . 

రామాయణము బాలకాండ నలుబది తొమ్మిదవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

            



















No comments:

Post a Comment