Saturday 27 August 2016

రామాయణము బాలకాండ -ఏబదిమూడవసర్గ

                                 రామాయణము 

                                      బాలకాండ -ఏబదిమూడవసర్గ 

వశిష్టుని ఆదేశము మేరకు కామధేనువు విశ్వామిత్రునికి ,అతని పరివారమునకు వారివారి అభిరుచులకు తగినట్లుగా భోజన పదార్ధములు సమకూర్చెను . ఆ కామధేనువు చెరుకు గడలను ,రసములను ,తేనెలు ,పేలాలు ,మధురపానీయములు ,ఆసవములను ,శ్రేష్ఠమయిన పానకములను ,నానావిధ భక్ష్యములను ,పర్వత ప్రమాణములో వేడి వేడి అన్నపురాసులను ,పాయసములు ,సూపములు ,పెరుగులు ,పాలు ,క్షణములో అచ్చట సమృద్ధిగా సిద్ధమాయెను . నానా విధములైన మధుర రసములు ,షడ్రసములతో కూడిన భక్ష్య విశేషములు ,పాత్రలనిండా బెల్లపు పాకముతో కూడిన పెక్కు విధములగు తినుబండారములు మొదలయినవి అన్నీ ప్రత్యక్షమాయెను . 
ఆ ఆహార పదార్థములను విశ్వామిత్ర మహర్షి ,అతని పరివారము సంతుష్టముగా భుజించిరి . దానితో విశ్వామిత్రుడు సంతుష్టుడై "ఓ మహర్షీ నీ అతిధి సత్కారములచే మిక్కిలి సంతుష్టుడను అయ్యాను నాదొక విన్నపము . నీకు లక్ష గోవులను ఇచ్చెదను . నాకు ఈ కామధేనువును ఇవ్వుము ఇది గోరత్నము కావున న్యాయముగా రాజుకే ఇది చెందవలెను . కావున దీనిని నాకు ఇచ్చివేయుము "అని పలికెను . 
అంత వశిష్ఠుడు "ఓ రాజా !నీవెన్ని లక్షల కోట్ల గోవులను మారె ఇతరములు ఇచ్చినను నేను ఈ కామధేనువుని ఇవ్వలేను . ఇదే నా సర్వ కర్మలకు మూలం . కావున నన్ను మన్నించి ఈ కామధేనువుని మాత్రం కోరవద్దు "అని చెప్పెను . ఆ మాటలు విన్న విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడయ్యెను . ఇలా అనెను . 
"ఓ నిష్టా గరిష్టుడా !నడుమనందు బంగారు త్రాళ్ల తోనూ సువర్ణ కంఠాభరణములతో ,అంకుశములతో అలంకృతమైన 14000 ఏనుగులను ఇచ్చెదను . చిరుగంటల పట్టెడలతో అలంకరింపబడిన నాలుగేసి తెల్లని అశ్వములతో కూర్చబడిన 800 బంగారు రథములను సమర్పించెదను . కాంభోజ ,బాహ్లిక దేశములలో పుట్టి గాంధర్వ జాతికి చెందిన మిక్కిలి బలిష్ఠములగు 11000 గుఱ్ఱములను ఇచ్చెదను . పలు వన్నెలతో ఒకదానికంటే మరియొకటి మేలయిన ,వయసులో వున్న ఒక కోటి ఆవులను నీకు సమర్పింతును . ఓ బ్రాహ్మణోత్తమా !నీవు కోరినంత బంగారమును ,రత్నాలరాశులను ఇచ్చెదను . ఈ కామధేనువును మాత్రము నాకు ఇమ్ము . "అని పలికెను . 
విశ్వామిత్రుడి మాటలు విని వశిష్ఠుడు ఇలా పలికెను . "ఓ రాజా !ఇదియే నాకు రత్నాల ఘని ,ధననిది ,నా సర్వస్వమూ ఇదే ,అంతేకాదు ఇది నా జీవనాధారము . ధర్మ ,పూర్ణమాసాది యాగములను దక్షిణలతో కూడిన యజ్ఞములను ,తదితర పుణ్య కార్యములను నిర్వహించుటకు ఈ గోవే నాకు ఆధారము . నా ఋషి జీవన సమస్త విధులకు ఈ కామధేనువే జీవగఱ్ఱ . ఇక పెక్కు మాటలతో పనిలేదు . సకల మనోరధములను ఈడేర్చు ఈ దివ్యదేనువును ఇయ్యనే ఇయ్యను ". అనెను . 

రామాయణము బాలకాండ ఏబదిమూడవ సర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








                                      

No comments:

Post a Comment