Thursday 25 August 2016

రామాయణము బాలకాండ -ఏబదియొకటవ సర్గ

                                               రామాయణము 

                                  బాలకాండ -ఏబదియొకటవ సర్గ  

గౌతమముని పెద్దకుమారుడు తపోధనుడు అయిన శతానందుడు విశ్వామిత్ర మహర్షి మాటలు (అహల్యా శాప విమోచనం )విని ,ఉత్సుకతతో" మా తల్లి విధి వశమున శాపమునకు గురి అయినదని రామచంద్రులకు తెలిపినారా ?శాప విమోచన అనంతరము మా తండ్రి గారు అచటికి ఏతెంచారా ?మా తల్లిని అనుగ్రహించారా ?వారిరువురు తమకు అతిధి మర్యాదలు ఒనర్చినారా ?"అని అడిగెను . 
విశ్వామిత్రుడు నా కర్తవ్యమును నేను నెరవేర్చినాను . మీ తండ్రిగారు రేణుకను జమదగ్ని వలె తన భార్య అయిన అహల్యను శ్వీకరించారు . అని తెలిపెను పిమ్మట శతానందుడు రామునితో 
"నరశ్రేష్ఠుడవు అయిన ఓ రామా !మా తల్లి శాపము తొలగించినందుకు నీకు శతకోటి వందనములు . నీ రాకతో మేము ధన్యులమైతిమి . నిన్ను తీసుకువచ్చిన ఈ విశ్వామిత్రుడు మిక్కిలి గొప్పవాడు . ఈయనఅంత ధన్యుడు ఈ భూమండలంలో ఇంకొకడు లేడు . ఈయన తపః ప్రభావమును ,చరిత్రను తెలిపెదను వినుము . 
ఈ విశ్వామిత్రుడు ధర్మజ్ఞుడు ,సమస్త విద్యలలో ఆరితేరినవాడు . శత్రువులను అణచినవాడు అనుక్షణము ప్రజాక్షేమము కోరుచు రాజ్యపాలన చేసినవాడు . ప్రజాపతి కుమారుడు కుశుడు ,అతని కుమారుడు కుశనాభుడు 
అతడు మిక్కిలి బలశాలి ,అతని కుమారుడు గాది ఆ గాధి కుమారుడే ఈ విశ్వామిత్రుడు . మహాబల సంపన్నుడు అయిన ఈ విశ్వామిత్రుడు పెక్కు కాలము చక్కగా రాజ్యపాలన చేసి అనేకమంది సైన్యముతో కూడి భూమండలమును చుట్టివచ్చెను . అతడు నగరములు ,రాష్ట్రములు ,నదులు ,పర్వతములు ,ఆశ్రమములు దాటుతూ వశిష్టుని ఆశ్రమమునకు విచ్చేసెను . ప్రశాంత వాతావరణముతో ఏంటో రమ్యముగా దేవదానవ ,గంధర్వులతో ,కిన్నెరులతో చక్కగా అది శోభిల్లుతూ ఉండెను . 
ఆ ఆశ్రమములో అనేకమంది తపోధనులు అయినా మునులు కలరు . వారిలో కొందరికి జలము మాత్రమే ఆహారము ,కొందరికి వాయువు మాత్రమే ఆహారము ,మరికొందరికి పండిరాలిన ఆకులు మాత్రమే ఆహారము . ఇంకొందరికి పండ్లు ,దుంపలు మాత్రమే ఆహారము . వారందరూ మనోనిగ్రహము కలిగినవారు . రాగద్వేషములకు అతీతులు ,జితేంద్రియులు . పెక్కుమంది మహిమాన్వితులైన మునులతో ఆ ఆశ్రమము మరో బ్రహ్మలోకమా అన్నట్లుగా వున్నది . గొప్పవాడైన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమము ను దర్శించెను . 

రామాయణము బాలకాండ ఏబదియొకటవ సర్గ సమాప్తము . 

                   శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

















No comments:

Post a Comment