Wednesday, 14 September 2016

రామాయణము బాలకాండ అరువది ఏడవసర్గ

                         రామాయణము 


                           బాలకాండ అరువది ఏడవసర్గ 

అంతట జనకమహారాజు ఆజ్ఞ ఇవ్వగా దీర్ఘ దేహులు ,బలిష్ఠులు అయిన 5000 మంది ఎనిమిది చక్రములు కలిగిన శకటమును మిక్కిలి కష్టముగా లాక్కొచ్చిరి . విశ్వామిత్రుడు "రామా !ధనుస్సుని చూడు అని ఆజ్ఞ ఇవ్వగా శ్రీరాముడు ఆ పుట్టలోని ధనుస్సుని చూసి "దీనిని ముట్టుకొని ఒక్కసారి విల్లు ఎక్కుపెట్టెదను "అని అడిగెను . దానికి జనకుడు ,విశ్వామిత్రుడు సరే అనిరి . 
అప్పుడు వేలమంది సదాన్యులు చూచుచుండగా ధనుస్సు మధ్య భాగమును అవలీలగా పట్టుకుని ,వింటి నారిని ఆకర్ణాంతము లాగెను . వెంటనే అది పెళ్లున పెద్ద శబ్దము చేస్తూ విరిగెను . ఆ శబ్దము పర్వతములు బద్దలైనట్లుఅనిపించెను . భూమి కంపించెను . విశ్వామిత్రమహర్షి ,జనకమహారాజు ,రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ స్పృహ తప్పి పడిపోయిరి .  కొంతసేపటికి తేరుకుని లేచిరి . 
అప్పుడు జనకమహారాజు విశ్వామిత్రునితో "ఓ మహాత్మా !దశరధుని కుమారుడైన శ్రీరాముడి ప్రతాపము ప్రత్యక్షంగా చూసాను . నా కూతురు నా ప్రాణములకన్నా మిన్న అయినది . ఆమె శ్రీరాముడికి ఇవ్వతగినది . ఓ బ్రహ్మర్షీ !మీరు అనుమతి ఇచ్చినచో దశరథ మహారాజు వద్దకు దూతలను పంపి జరిగిన వృత్తాన్తమును ఆయనకు సవినయముగా తెలిపి ఆయనను చక్కగా ఆహ్వానించి ,మిధిలకు తీసుకుని వత్తురు . "అని పలికెను . 
విశ్వామిత్రుడు ఆమోదం తెలిపెను . వెంటనే జనకుడు తన మంత్రులను పిలిపించి శుభ ఆహ్వాన పత్రిక ఇచ్చి దానిని దశరథ మహారాజుకు అందించి సీతా పరిణయ వృత్తాన్తము ,రామ ధనుర్భంగము తదితర వివరములను వినయముగా తెలిపి ఆ మహారాజుని తోడ్కొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి అయోధ్యకు పంపెను  . 

రామాయణము బాలకాండ అరువది ఏడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


                  











Saturday, 10 September 2016

రామాయణము బాలకాండ -అరువదిఆరవసర్గ

                                        రామాయణము 

                                             బాలకాండ -అరువదిఆరవసర్గ 

మరునాడు ఉదయం జనకమహారాజు విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి ఏంతో  వినయముతో నేను మీకు ఏమి చేయగలను ?నన్ను ఆజ్ఞాపించండి . అని పలికెను . అప్పుడు విశ్వామిత్రుడు "ఓ జనక మహారాజా !ఈ రామలక్ష్మణులు నీ వద్ద వున్న ధనుస్సుని చూడదలిచారు . దానిని చూపించుము . వీరు ఆ ధనుస్సుని చూసి తమ ముచ్చట తీర్చుకుని వెళ్ళెదరు . "అని చెప్పెను . 
అందుకు జనక మహారాజు "తప్పకుండా చూపించెదను . ముందుగా ఆ ధనుస్సు నా ఇంట ఉండుటకు గల కారణము తెలిపెదను" . అని చెప్పిఇలా తెలిపెను . "నిమి వంశమున ఆరవ చక్రవర్తి అయిన "దేవరాతుడు " అను మహారాజు మిగుల  ఖ్యాతివహించాడు . పూర్వము దక్షయజ్ఞ ధ్వంస సమయములో శివుడు ఈ ధనుస్సుని ఎక్కుపెట్టి కోపముతో నాకు ఈ యజ్ఞములో  స్థానములేని కారణముగా ఈ  ధనస్సుతో అందరి తలలు ఖండించెదను . అని పలికెను దేవతలు శివుడిని ప్రార్ధించిరి . వారి ప్రార్ధనలు మన్నించిన శివుడు ఆ ధనుస్సుని వారికే ఇచ్చివేసెను . వారు ఆ ధనుస్సుని దేవరాతుడికి ఇచ్చిరి . 
ఒకప్పుడు నేను యాగానిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటిచాలు నుండి ఒక కన్య వెలువడెను . నాగలించాలున లభించినందున ఆమెకు సీత అని పేరువచ్చెను . ఈమె భూమి నుండే ఉద్భవించినప్పటికీ ఈమెను పెంచాను కాబట్టి నా కూతురు అయింది . అయోనిజ అయిన ఆమెకు పరాక్రమమే శుల్కము . అనగా పరాక్రమమంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకొనుటకు అర్హుడు . నా కుమార్తెను వివాహము చేసుకొనుటకు అనేక మంది రాజులు వచ్చిరి . ఆ రాజులాంరదరూ మిధిలకు వచ్చి ,ధనుస్సుని ఎక్కుపెట్టి తమ పరాక్రమము పరీక్షించుకొనకొరిరి . వారిలో ఎవ్వరు దానిని ఎక్కుపెట్టలేకపోయారు సరికదా కనీసం కదల్చలేకపోయారు . కావున వారిలో ఎవ్వరికి నేను సీతను ఇవ్వలేదు . దానితో వారు కుపితులై మిధిలను ముట్టడించిరి . తపస్సు ద్వారా నాకు లభించిన చతురంగ బలముతో వారిని ఓడించినాను . ఆ ధనుస్సుని రామలక్ష్మణులకు చూపించెదను . దానిని ఎక్కుపెట్టినచో సీతని ఇచ్చి పెండ్లి చేసెదను . "అని చెప్పెను .

రామాయణము బాలకాండ అరువది ఆరవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





















రామాయణము బాలకాండ -అరువది అయిదవసర్గ

                         రామాయణము 

                         బాలకాండ -అరువది అయిదవసర్గ 

ఆ ముని పిమ్మట ఉత్తర దిశను వదిలి తూర్పు దిశకు వెళ్లి తానూ సంకల్పించిన రీతిలోనే వేయి సంవత్సరములపాటు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసెను . వేయి సంవత్సరములు పూర్తి కాగానే భోజనము చేయుటకు సిద్దపడెను . ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారియై ఆ సిద్దఅన్నమును కోరెను . పూజ్యుడైన ఆ ఋషి మౌనవ్రతమున ఉండుట చే ఏమి పలుకక ఆ అన్నము మొత్తము ఇంద్రుడికి ఇచ్చివేసెను బ్రాహ్మవేషములో వున్న ఇంద్రుడు ఏమి మిగల్చకుండా అన్నము మొత్తము భుజించెను . విశ్వామిత్రుడు ఏమి తినకుండానే తిరిగి శ్వాసను బందించి తపస్సు చేయనారంభించెను . ఆ విధముగా తపస్సు చేయుచున్న ఆయన శిరస్సునుండి అగ్నిజ్యాలలు తీవ్రముగా వ్యాపించెను . అంతట దేవతలు ,గాంధర్వులు ,నాగులు ,అసురులు ,రాక్షసులు ,ఆ తపోరూప అగ్నితాపమునకు మూర్చితులయిరి . 
అంతట వారంతా బ్రహ్మ వద్దకు వెళ్లి" మేము అనేక విధములుగా విశ్వామిత్రుడిని ప్రలోభపెట్ట చూసాము . ఆయనకు కోపము తెప్పించ చూసాము . కానీ ఆయన దేనికి లొంగలేదు . ఆ మహర్షి తపో మహిమతో లోకములన్నీ అతలాకుతలం అవ్వసాగాయి . కావున లోకములను రక్షింపుము అని కోరిరి ". అనంతరము  దేవతలతో కూడి బ్రహ్మ విశ్వామిత్రుడి ఎదుట ప్రత్యక్షమై" ఓ కౌశికా !నీ తపమునకు మెచ్చితిని . నీకు బ్రహ్మత్వము ,దీర్గాయువు ప్రసాదిస్తున్నాను "అని పలికెను . అప్పుడు విశ్వామిత్రుడు "ఓ పితామహా !ధన్యుడను అయ్యాను . నాకు శిష్యులకు వేదమును భోదించే అర్హతను ప్రసాదించుము . బ్రహ్మ తనయుడు అయినా వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనునట్లు చేయుము . "అని కోరెను . 
దేవతలు స్మరించగా వశిష్ఠుడు ప్రత్యక్షమై ",యజ్ఞములు చేయుటకు ,శిష్యులకు వేదములు భోదించుటకు నీవు అర్హుడివే నీవు బ్రహ్మర్షివి అయ్యావు "అని విశ్వామిత్రునితో పలికెను . దేవతలు అందరూ నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి అని పలికి వారంతా వారివారి స్థానములకు వెళ్లిరి . పిమ్మట విశ్వామిత్రుడు తన తపస్సును కొనసాగించుచు భూలోకమంతా తిరగసాగెను . అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాన్తమును సమస్తము వివరముగా తెలిపెను . 
పిమ్మట అక్కడ వున్న జనక మహారాజు విశ్వామిత్రుడితో" ఓ మహర్షీ !నా ఆహ్వానమును మన్నించి విచ్చేసినందుకు చాలా సంతోషము . మీ గాధను శతానందుడు వినగా నేను కూడా విన్నాను . ఇక్కడ మునులు అందరూ విన్నారు . మీ తపస్సు అద్భుతమైనది . మీ బలము నిరుపమానము . మీ గాధలు ఎంత విన్నను తనివితీరుటలేదు . రేపు ప్రాతః కాలమున నేను దర్శింతును ఇప్పుడు నేను వెళ్లెదను . అనుమతి ఇవ్వండి "అని పలికెను . 
అంతట విశ్వామిత్రుడు మిక్కిలి సంతుష్టుడై జనక మహారాజు వెళ్ళుటకు అనుమతి ఇచ్చెను . అప్పుడు జనక మహారాజు తన బంధుమిత్రులతో కలసి విశ్వామిత్రుడికి ప్రదక్షణ చేసి ఆయన అనుమతి పొంది తన భావనమునకు వెళ్లెను . ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తమ నివాసామునకు వెళ్లిరి . 

రామాయణము బాలకాండ అరువది అయిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













Friday, 9 September 2016

రామాయణము బాలకాండ -అరువదినాల్గవసర్గ

                         రామాయణము 

                       బాలకాండ -అరువదినాల్గవసర్గ 

దేవేంద్రుడు రంభను పిలిపించి విశ్వామిత్రుడి తపమునకు విఘ్నము కలిగించమని చెప్పెను . అందులకు రంభ భయపడుతూ ,సిగ్గుపడుతూ "ఓ దేవేంద్రా !ఆ విశ్వామిత్రుడు ముక్కోపి . నేను అతడి తపస్సు భంగము చేసిన ,అతడు నన్ను భస్మము చేసేదడు అందులకే  నేను భయపడుతున్నాను . "అని పలికెను . అప్పుడు ఇంద్రుడు "రంభా భయపడకు . ఇది నా ఆజ్ఞ అనుసరించు . వసంత ఋతువున వృక్షములన్నీ కొత్త చిగుళ్లతో ,పుష్పములతో విలసిల్లుతుండగా ఆ సమయములో మన్మధుడితో కూడి నీకు దగ్గరలోనే వుంటాను "అని పలుకగా 
రంభ ఇంద్రుని శాసనమును అనుసరించి పరం ఆకర్షణీయముగా తయారయి చిరునవ్వులు నవ్వుతూ ,విశ్వామిత్రుని ప్రలోభ పెట్టసాగెను . విశ్వామిత్రుడు మధుర కోకిల ధ్వని విని కళ్ళు తెలిచి చూసేను . ఎదురుగా వున్న రంభను చూడగా ఆయనకు సందేహము కలిగెను . అదంతా ఇంద్రుని పన్నాగము అని గ్రహించి మిక్కిలి కోపముతో 10000సంవత్సరములు శిలగా పడివుండు అని రంభని శపించెను . మహర్షి రంభను శపించు  వచనములు విని ఇంద్రుడు ,మన్మధుడు నెమ్మిదిగా అటునుండి ఆటే పోయెను .  రంభను  శపించిన పిమ్మట మహాతేజస్వి అయినా విశ్వామిత్రుడు తన కోపమును నిగ్రహించుకోలేకపోయినందుకు మిక్కిలి బాధపడెను . మహర్షి శాప ప్రభావమున రంభ కఠోర శిలగా మారిపోయెను . కోపమునకు లోనగుటచే ఆయన తపోబలము తగ్గిపోయెను . ఇక కోపమునకు ఏమాత్రము తావివ్వకూడదని నిర్ణయించుకుని , ఊపిరి బిగపట్టి కుంభములో ఉండి ,గాలి పీల్చకుండా ,ఆహారము స్వీకరించకుండా కఠోర తపస్సు చేయవలెనని నిర్ణయించుకొనెను . 

రామాయణము బాలకాండ అరువదినాల్గవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 










Thursday, 8 September 2016

రామాయణము బాలకాండ -అరువది మూడవసర్గ

                                            రామాయణము 

                                      బాలకాండ  -అరువది మూడవసర్గ 

విశ్వామిత్రుడు చాలాకాలము తీవ్ర తపస్సు చేయగా బ్రహ్మ దేవతలతో కోడి వచ్చి ఆయనకు ఋషిత్వము ప్రసాదించెను . దానికి విశ్వామిత్రుడు తృప్తి చెందక మరల తీవ్ర తపస్సు చేయసాగెను . ఆ విధముగా తీవ్ర తపస్సు చేయుచున్న విశ్వామిత్రుడి వద్దకు దేవతలు పంపగా ఆయన తపస్సుని భంగము చేయుటకు మేనక అను అప్సరస స్వర్గలోకము నుండి వచ్చి విశ్వామిత్రుడి కంట పడెను . 

వారిరువురు ఆశ్రమమందు ఏంటో సంతోషముగా ఉండిరి (విశ్వామిత్రుడి తపస్సు ఉట్టికెక్కెను ). ఆ విధముగా 10 సంవత్సరములు గడిచినవి . వారికి ఒక కుమార్తె కలిగెను . ఆమే శకుంతల ఆమె సంతానము అయిన భరతుడు పేరు మీదనే మన దేశమునకు భారతదేశము అను పేరు వచ్చినది . విశ్వామిత్రుడు తన తపస్సు భంగము అయినందుకు సిగ్గుపడి బాధపడుచుండెను . ఆయనను చూసి మేనక మిగుల భయపడసాగెను . అలా భయపడుతున్న మేనకను చూసి ఇందు నీ తప్పు ఏమిలేదు . నేనే కామపారాత్రాంతుడనై ఈ అపరాధము చేసితిని అని పలికి ఆమెను పంపివేసెను . అనంతరము కౌశికుడు (కుశికుని మనవడు అయినా విశ్వామిత్రుడు )ఉత్తరమున వున్నహిమాలయములకు వెళ్లి తపస్సు చేయసాగెను . 
ఆ విధముగా ఘోర తపస్సు చేయుచున్న విశ్వామిత్రుని వద్దకు బ్రహ్మ ,దేవతల తో కూడి వచ్చి "నాయనా! నీవు ఋషులలో ముఖ్యుడవు . నీ తీవ్రతపస్సు కి మెచ్చాను . నీకు మహర్షిత్యము ప్రసాదిస్తున్నాను . "అని పలికి అంతర్ధానమయ్యెను . వారందరూ వెడలిపోగా విశ్వామిత్రుడు మరల అతి తీవ్రముగా వాయువును మాత్రమే ఆహారముగా తీసుకుంటూ తపస్సు చేసెను . 
కఠోర నియమములతో తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడిని చూసి ఇంద్రాది దేవతలు ఆయన తపస్సును భంగపరచటానికి రంభను పంపించడానికి నిశ్చయించుకుని ఆమెతో ఇలా అనెను . 

రామాయణము బాలకాండ అరువది మూడవసర్గ సమాప్తము . 

            శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















Wednesday, 7 September 2016

రామాయణము బాలకాండ -అరువదిరెండవసర్గ

                         రామాయణము 

                  బాలకాండ -అరువదిరెండవసర్గ               

ఆ విధముగా తానూ యజ్ఞ పశువుని అయినందుకు బాధపడుతూ అంబరీష మహారాజుతో ముందుకు సాగుతున్న శునస్సేపుడు ,మధ్యాహ్న కాలమగుటచే పుష్కర క్షేత్రమందు మహారాజు విశ్రమించగా అక్కడ తిరుగుతూ ,విశ్వామిత్రుని చూసి ,మిగుల దుఃఖముతో విశ్వామిత్రుని వడిలో వాడి ఏడవసాగెను . విశ్వామిత్రుడు కారణమడుగగా ,శునస్సేపుడు జరిగిన వృత్తాoతము అంతా చెప్పి ,"రాజుగారి యజ్ఞము నిర్విఘ్నముగా సాగునట్లు చేయుము ,అట్లే నన్ను రక్షించుము" . అని కోరెను 
అంత విశ్వామిత్రుడు శునస్సేపుని ,ఓదార్చి ,అభయమిచ్చి తన కుమారులలో ఎవరో ఒకరిని శునస్సేపునికి బదులుగా యజ్ఞ పశువుగా వెళ్ళమని చెప్పెను . దానికి వారు "కుమారుల ప్రాణములు బాలి యిచ్చి అన్యులను కాపాడుట అకృత్యము "అని పలికిరి . అప్పుడు విశ్వామిత్రుడు వారిని ముష్టిక జాతులలో జన్మించి కుక్క మాంసము తింటూ బతకమని శపించెను . 
శునస్సేపునికి అభయమిచ్చి ఇలా పలికెను . "ఓ ముని కుమారా !యజ్ఞమునందు నిన్ను పవిత్రమైన దర్భలతో బంధించి ,ఎర్రని పూలమాలలతో అలంకరింతురు . అప్పుడు నీవు విష్ణుదేవతా సంభందిత యూపీఏ స్తంభము వద్దకు వెళ్లి అగ్నికి అభిముఖంగా నిలబడి ,ఇంద్రుని ,ఉపేంద్రుని స్తుతించు . పిమ్మట నేను ఉపదేశించబోవు ఇంద్ర ,ఉపేంద్ర గాధలను గానము చేయుము . అప్పుడు నీ మనోరధము నెరవేరుతుంది . 
విశ్వామిత్రుడు బోధించిన మంత్రములను ,గాధలను గ్రహించి ,తిరిగి అంబరీష మహారాజు వద్దకు వెళ్లి ఆయనతో కలసి యజ్ఞ భూమికి వెల్లెను . అక్కడ యజ్ఞ పశువు అయిన ముని కుమారుని దర్భలతో బంధించి ,చందనంతో ,ఎర్రటి మాలతో అలంకరించి ,ఎర్రని వస్త్రములను ధరింపచేసి యూపస్తంభమునకు కట్టెను . అప్పుడు శునస్సేపుడు విశ్వామిత్రుడు చెప్పినట్లు ఇంద్రుడిని ఉపేంద్రుడిని స్తుతించెను అంతట ఇంద్రుడు మిక్కిలి సంతోషముతో శునస్సేపునికి దీర్గాయువును ప్రసాదించెను . అంబరీష మహారాజుకి యజ్ఞ ఫలము దక్కేను . 

రామాయణము బాలకాండ అరువదిరెండవసర్గ సమాప్తము . 

    శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Tuesday, 6 September 2016

రామాయణము బాలకాండ -అరవదియొకటవ సర్గ

                                  రామాయణము 

                               బాలకాండ -అరవదియొకటవ సర్గ 

ఆ విధముగా అందరూ ఇటువారు అటు వెడలగా విశ్వామిత్రుడు ,పశ్చిమ దిశలో కల మూడు బ్రహ్మ తీర్ధములలో కల తపో వనములో తపము ఆచరించుటకు వెళ్లెను . అచట తీవ్రమైన తపస్సు చేయుచుండెను . 
అదే సమయములో అయోధ్యేయాధీశుడైన అంబరీష మహారాజు గొప్ప యజ్ఞమును తలపెట్టెను . అతడి యజ్ఞ పశువుని ఇంద్రుడు అపహరించుకుపోయేను . అందులకు మిగుల చింతించుచు ,గురువుల సలహా ప్రకారము కోరినవన్నీ ఇచ్చి ఎవరిని ఒక మానవుడిని యజ్ఞ పశువుగా చేసుకొనుటకు వెతుకుచుండెను . అలా వెతుకుతూ ఋచీక మహర్షి వద్దకు చేరి ,ఆయనకు నమస్కరాము చేసి ,కుశల  ఆయనను ప్రసన్నుడిని చేసుకుని ,జరిగిన విషయము చెప్పి ,యజ్ఞపశువుగా వారి కుమారుడిని కోరెను . బదులుగా తగిన మూల్యమును చెల్లించెదనని చెప్పెను . 
అప్పుడు ఋచీకుడు "ఓ రాజా !నా పెద్దకుమారుడన్న నాకు పరమ ప్రీతి కావున అతడిని నీకు అమ్మజాలను . "అని చెప్పెను . ఋచీకుడి పత్ని "చిన్న కుమారుడన్న నాకు అత్యంత ఇష్టం కావున నా చిన్న కుమారుడిని నేను ఇవ్వను "అని పలికెను . పరిశేష న్యాయం అనుసరించి ,మధ్యమ కుమారుడైన శునస్సేపుని తనతో తీసుకు వెళ్తు బదులుగా లక్షగోవులను ఇచ్చి సంతోషముగా ఇంటి దాని పట్టెను . 

రామాయణము బాలకాండ అరవదియొకటవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .