Wednesday 14 September 2016

రామాయణము బాలకాండ అరువది ఏడవసర్గ

                         రామాయణము 


                           బాలకాండ అరువది ఏడవసర్గ 

అంతట జనకమహారాజు ఆజ్ఞ ఇవ్వగా దీర్ఘ దేహులు ,బలిష్ఠులు అయిన 5000 మంది ఎనిమిది చక్రములు కలిగిన శకటమును మిక్కిలి కష్టముగా లాక్కొచ్చిరి . విశ్వామిత్రుడు "రామా !ధనుస్సుని చూడు అని ఆజ్ఞ ఇవ్వగా శ్రీరాముడు ఆ పుట్టలోని ధనుస్సుని చూసి "దీనిని ముట్టుకొని ఒక్కసారి విల్లు ఎక్కుపెట్టెదను "అని అడిగెను . దానికి జనకుడు ,విశ్వామిత్రుడు సరే అనిరి . 
అప్పుడు వేలమంది సదాన్యులు చూచుచుండగా ధనుస్సు మధ్య భాగమును అవలీలగా పట్టుకుని ,వింటి నారిని ఆకర్ణాంతము లాగెను . వెంటనే అది పెళ్లున పెద్ద శబ్దము చేస్తూ విరిగెను . ఆ శబ్దము పర్వతములు బద్దలైనట్లుఅనిపించెను . భూమి కంపించెను . విశ్వామిత్రమహర్షి ,జనకమహారాజు ,రామలక్ష్మణులు తప్ప మిగిలిన వారందరూ స్పృహ తప్పి పడిపోయిరి .  కొంతసేపటికి తేరుకుని లేచిరి . 
అప్పుడు జనకమహారాజు విశ్వామిత్రునితో "ఓ మహాత్మా !దశరధుని కుమారుడైన శ్రీరాముడి ప్రతాపము ప్రత్యక్షంగా చూసాను . నా కూతురు నా ప్రాణములకన్నా మిన్న అయినది . ఆమె శ్రీరాముడికి ఇవ్వతగినది . ఓ బ్రహ్మర్షీ !మీరు అనుమతి ఇచ్చినచో దశరథ మహారాజు వద్దకు దూతలను పంపి జరిగిన వృత్తాన్తమును ఆయనకు సవినయముగా తెలిపి ఆయనను చక్కగా ఆహ్వానించి ,మిధిలకు తీసుకుని వత్తురు . "అని పలికెను . 
విశ్వామిత్రుడు ఆమోదం తెలిపెను . వెంటనే జనకుడు తన మంత్రులను పిలిపించి శుభ ఆహ్వాన పత్రిక ఇచ్చి దానిని దశరథ మహారాజుకు అందించి సీతా పరిణయ వృత్తాన్తము ,రామ ధనుర్భంగము తదితర వివరములను వినయముగా తెలిపి ఆ మహారాజుని తోడ్కొని రమ్మని ఆజ్ఞ ఇచ్చి అయోధ్యకు పంపెను  . 

రామాయణము బాలకాండ అరువది ఏడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


                  











No comments:

Post a Comment