Saturday 10 September 2016

రామాయణము బాలకాండ -అరువది అయిదవసర్గ

                         రామాయణము 

                         బాలకాండ -అరువది అయిదవసర్గ 

ఆ ముని పిమ్మట ఉత్తర దిశను వదిలి తూర్పు దిశకు వెళ్లి తానూ సంకల్పించిన రీతిలోనే వేయి సంవత్సరములపాటు మిక్కిలి కష్టసాధ్యమైన తపస్సు చేసెను . వేయి సంవత్సరములు పూర్తి కాగానే భోజనము చేయుటకు సిద్దపడెను . ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషధారియై ఆ సిద్దఅన్నమును కోరెను . పూజ్యుడైన ఆ ఋషి మౌనవ్రతమున ఉండుట చే ఏమి పలుకక ఆ అన్నము మొత్తము ఇంద్రుడికి ఇచ్చివేసెను బ్రాహ్మవేషములో వున్న ఇంద్రుడు ఏమి మిగల్చకుండా అన్నము మొత్తము భుజించెను . విశ్వామిత్రుడు ఏమి తినకుండానే తిరిగి శ్వాసను బందించి తపస్సు చేయనారంభించెను . ఆ విధముగా తపస్సు చేయుచున్న ఆయన శిరస్సునుండి అగ్నిజ్యాలలు తీవ్రముగా వ్యాపించెను . అంతట దేవతలు ,గాంధర్వులు ,నాగులు ,అసురులు ,రాక్షసులు ,ఆ తపోరూప అగ్నితాపమునకు మూర్చితులయిరి . 
అంతట వారంతా బ్రహ్మ వద్దకు వెళ్లి" మేము అనేక విధములుగా విశ్వామిత్రుడిని ప్రలోభపెట్ట చూసాము . ఆయనకు కోపము తెప్పించ చూసాము . కానీ ఆయన దేనికి లొంగలేదు . ఆ మహర్షి తపో మహిమతో లోకములన్నీ అతలాకుతలం అవ్వసాగాయి . కావున లోకములను రక్షింపుము అని కోరిరి ". అనంతరము  దేవతలతో కూడి బ్రహ్మ విశ్వామిత్రుడి ఎదుట ప్రత్యక్షమై" ఓ కౌశికా !నీ తపమునకు మెచ్చితిని . నీకు బ్రహ్మత్వము ,దీర్గాయువు ప్రసాదిస్తున్నాను "అని పలికెను . అప్పుడు విశ్వామిత్రుడు "ఓ పితామహా !ధన్యుడను అయ్యాను . నాకు శిష్యులకు వేదమును భోదించే అర్హతను ప్రసాదించుము . బ్రహ్మ తనయుడు అయినా వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా పేర్కొనునట్లు చేయుము . "అని కోరెను . 
దేవతలు స్మరించగా వశిష్ఠుడు ప్రత్యక్షమై ",యజ్ఞములు చేయుటకు ,శిష్యులకు వేదములు భోదించుటకు నీవు అర్హుడివే నీవు బ్రహ్మర్షివి అయ్యావు "అని విశ్వామిత్రునితో పలికెను . దేవతలు అందరూ నీవు నిస్సందేహముగా బ్రహ్మర్షివి అని పలికి వారంతా వారివారి స్థానములకు వెళ్లిరి . పిమ్మట విశ్వామిత్రుడు తన తపస్సును కొనసాగించుచు భూలోకమంతా తిరగసాగెను . అని శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుని వృత్తాన్తమును సమస్తము వివరముగా తెలిపెను . 
పిమ్మట అక్కడ వున్న జనక మహారాజు విశ్వామిత్రుడితో" ఓ మహర్షీ !నా ఆహ్వానమును మన్నించి విచ్చేసినందుకు చాలా సంతోషము . మీ గాధను శతానందుడు వినగా నేను కూడా విన్నాను . ఇక్కడ మునులు అందరూ విన్నారు . మీ తపస్సు అద్భుతమైనది . మీ బలము నిరుపమానము . మీ గాధలు ఎంత విన్నను తనివితీరుటలేదు . రేపు ప్రాతః కాలమున నేను దర్శింతును ఇప్పుడు నేను వెళ్లెదను . అనుమతి ఇవ్వండి "అని పలికెను . 
అంతట విశ్వామిత్రుడు మిక్కిలి సంతుష్టుడై జనక మహారాజు వెళ్ళుటకు అనుమతి ఇచ్చెను . అప్పుడు జనక మహారాజు తన బంధుమిత్రులతో కలసి విశ్వామిత్రుడికి ప్రదక్షణ చేసి ఆయన అనుమతి పొంది తన భావనమునకు వెళ్లెను . ధర్మాత్ముడైన విశ్వామిత్రుడు మహర్షులచే పూజింపబడి రామలక్ష్మణులతో తమ నివాసామునకు వెళ్లిరి . 

రామాయణము బాలకాండ అరువది అయిదవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 













No comments:

Post a Comment