Saturday 10 September 2016

రామాయణము బాలకాండ -అరువదిఆరవసర్గ

                                        రామాయణము 

                                             బాలకాండ -అరువదిఆరవసర్గ 

మరునాడు ఉదయం జనకమహారాజు విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి ఆయనకు నమస్కరించి ఏంతో  వినయముతో నేను మీకు ఏమి చేయగలను ?నన్ను ఆజ్ఞాపించండి . అని పలికెను . అప్పుడు విశ్వామిత్రుడు "ఓ జనక మహారాజా !ఈ రామలక్ష్మణులు నీ వద్ద వున్న ధనుస్సుని చూడదలిచారు . దానిని చూపించుము . వీరు ఆ ధనుస్సుని చూసి తమ ముచ్చట తీర్చుకుని వెళ్ళెదరు . "అని చెప్పెను . 
అందుకు జనక మహారాజు "తప్పకుండా చూపించెదను . ముందుగా ఆ ధనుస్సు నా ఇంట ఉండుటకు గల కారణము తెలిపెదను" . అని చెప్పిఇలా తెలిపెను . "నిమి వంశమున ఆరవ చక్రవర్తి అయిన "దేవరాతుడు " అను మహారాజు మిగుల  ఖ్యాతివహించాడు . పూర్వము దక్షయజ్ఞ ధ్వంస సమయములో శివుడు ఈ ధనుస్సుని ఎక్కుపెట్టి కోపముతో నాకు ఈ యజ్ఞములో  స్థానములేని కారణముగా ఈ  ధనస్సుతో అందరి తలలు ఖండించెదను . అని పలికెను దేవతలు శివుడిని ప్రార్ధించిరి . వారి ప్రార్ధనలు మన్నించిన శివుడు ఆ ధనుస్సుని వారికే ఇచ్చివేసెను . వారు ఆ ధనుస్సుని దేవరాతుడికి ఇచ్చిరి . 
ఒకప్పుడు నేను యాగానిమిత్తమై భూమిని దున్నుచుండగా నాగటిచాలు నుండి ఒక కన్య వెలువడెను . నాగలించాలున లభించినందున ఆమెకు సీత అని పేరువచ్చెను . ఈమె భూమి నుండే ఉద్భవించినప్పటికీ ఈమెను పెంచాను కాబట్టి నా కూతురు అయింది . అయోనిజ అయిన ఆమెకు పరాక్రమమే శుల్కము . అనగా పరాక్రమమంతుడు మాత్రమే ఈమెను వివాహము చేసుకొనుటకు అర్హుడు . నా కుమార్తెను వివాహము చేసుకొనుటకు అనేక మంది రాజులు వచ్చిరి . ఆ రాజులాంరదరూ మిధిలకు వచ్చి ,ధనుస్సుని ఎక్కుపెట్టి తమ పరాక్రమము పరీక్షించుకొనకొరిరి . వారిలో ఎవ్వరు దానిని ఎక్కుపెట్టలేకపోయారు సరికదా కనీసం కదల్చలేకపోయారు . కావున వారిలో ఎవ్వరికి నేను సీతను ఇవ్వలేదు . దానితో వారు కుపితులై మిధిలను ముట్టడించిరి . తపస్సు ద్వారా నాకు లభించిన చతురంగ బలముతో వారిని ఓడించినాను . ఆ ధనుస్సుని రామలక్ష్మణులకు చూపించెదను . దానిని ఎక్కుపెట్టినచో సీతని ఇచ్చి పెండ్లి చేసెదను . "అని చెప్పెను .

రామాయణము బాలకాండ అరువది ఆరవసర్గ సమాప్తము . 

               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





















No comments:

Post a Comment