Wednesday, 12 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిరెండవసర్గ

                                          రామాయణము

                                           అరణ్యకాండ -ఏబదిరెండవసర్గ 

రావణుడు శ్రీరాముని ఆశ్రమ సమీపమున నేలపై పడిపోయిన జటాయువును ,దాని చెంతే ఉండి ఏడుస్తున్న సీతను చూసేను . సీతను తీసుకువెళ్ళుటకు రావణుడు త్వరత్వరగా ఆ వైపుగా నడవసాగెను . తనవైపుగా వస్తున్న రావణుని చూసి సీతాదేవి రామాలక్ష్మణా !అని బిగ్గరగా అరుస్తూ వృక్షమును కౌగిలించుకొనెను . ఆ విధముగా వృక్షమును గట్టిగా పట్టుకున్న సీతాదేవి జుట్టును రావణుడు పట్టుకొనెను . ఆ విధముగా సీతకు జరిగిన అవమానము చూసిన సకల చరాచర జగత్తు అచేతనములై ఉండిపోయెను . 
సూర్యుడు కళాహీనుడయ్యెను . వాయువు ప్రసరించుట ఆపివేసెను . సీతాదేవిని రావణుడు బలవంతముగా ఎత్తుకొనిపోవుట ,ఆవిడ తప్పించుకొనుటకు గింజుకోనుటలో ఆమె కేశపాశములు చెదిరిపోయెను .ఆమె నుదిటి బొట్టు చెరిగేను .  ఆమె ధరించిన ఎర్రమందారరేకులు చెదిరి రాలిపోయెను . ఆమె  ఎర్రటి పట్టువస్త్రము గాలికి  ఎగురుతూ రావణుడికి రాబోవు చావుకు సంకేతముగా ఉన్నది . ఆమె ఎడమకాలి అందే ఊడి నేలపై పడెను . అది రత్నమణిఖచితమై ఉండెను . తదుపరి మెడలోని హారములు కంఠాభరణములు ఇలా ఒక్కొక్కటిగా జారీ నేలపై పడెను . 

ఆ విధముగా బిగ్గరగా రామా !లక్ష్మణా !అని అరుస్తూ నేలపైకి చూస్తూ హృదయవిదారకంగా విలపించుచున్న సీతాదేవిని చూసిన వనదేవతలు సైతము వణికిపోయిరి . ఈ స్థితిలో ఆమెకు రామలక్ష్మణులు కనపడకుండుటచే ఆమె దీనావదన అయి  అంతులేని భయముతో కృంగిపోయెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 

                                      శశి ,

                    ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Tuesday, 11 July 2017

రామాయణం అరణ్యకాండ -ఏబదిఒకటవసర్గ

                                     రామాయణం 



                                         అరణ్యకాండ -ఏబదిఒకటవసర్గ 

ధర్మబద్ధముగా జటాయువు ఆ విధముగా పలికిన పిమ్మట రావణుడు మిగుల క్రుద్ధుడై కన్నులనుండి నిప్పులు కురిపించెను . ఆ రాక్షసరాజు ఆ జటాయువు పైకి యుద్దానికి దూకేను . ఆ ఇరువురు యోధులు ఘోరాతోఘోరముగా యుద్ధము చేసుకొనిరి . రావణుడు శూలములు ,బల్లెములు గద మొదలగు ఆయుధములను జటాయువు పైకి విసిరెను . జటాయువు వాటిని చెదరగొట్టెను . పిమ్మట రావణుడు పది వాడి బాణములతో జటాయువును కొట్టెను . ఆ బాణములు జటాయువును తీవ్రముగా గాయపరిచేను . 

జటాయువు రథముపై వున్న రావణుని ,సీతను చూసి బాణపు దెబ్బలను ఏమాత్రము లెక్కచేయక రధము పైకి దూకి రథమునకు కట్టిన అశ్వములను ముక్కుతో పొడిచి చంపెను . తన వాడి గోళ్ళతో రావణుడి రధము లోకల రావణుడి సేవకులను చంపెను . రావణుడి రధము ముక్కలు చేసెను . రధసారధి శిరస్సు ఖండించెను . రావణుడి కవచము ధ్వంసము చేసెను . తన రధము ఛిద్రమయిపోగా రావణుడు సీతను పట్టుకుని భూమిమీదకు దూకేను .
వాహనము ఛిద్రముకాగా ,నేలపైకి దూకిన రావణుని చూసి సమస్త ప్రాణులు 'బాగుబాగు ' అని సంబరంతో పలుకుతూ జటాయువును శ్లాఘించెను . వృద్ధాప్య కారణముగా పక్షిరాజైన జటాయువు మిక్కిలి అలిసివుండుట చూసిన రావణుడు సంతోషించి ,సీతను తీసుకుని ఆకాశమార్గములో ఎగిరిపోసాగెను . అది చూసిన జటాయువు తాను కూడా ఆకాశములో ఎగిరి ఆ రావణునికి ఎదురుగా నిలబడి "ఓ అల్పబుద్దీ !చావు మూడి ఉండుటచే నీవు ఇట్టి పాపపు పనికి పూనుకున్నావు . రణరంగమున రాముడి వజ్ర తుల్యమగు బాణములు నీ గుండెలను చీల్చుట ఖాయము . నీవు నిజముగా వీరుడవయితే క్షణకాలం నిలిచి నాతొ యుద్ధము చేయి "అని పలికెను . 
జటాయువు ఇలా పలుచున్నప్పటికీ రావణుడు సీతను తీసుకుని వెళ్లుచునే ఉండెను . అప్పుడు పరాక్రమశాలి అయిన జటాయువు అతడిపై దాడి చేసెను . రావణుడిని తన పదునైన గోళ్ళతో రక్కుచూ ,ముక్కుతో పొడుచుచూ అతని వీపును గాయపరిచేను . జుట్టు పట్టుకుని లాగెను . అప్పుడు రావణుడు ఆ జటాయువును కొట్టుటకు తన 20 పిడికిళ్ళను ముందుకు చాచెను . జటాయువు వాటిని ముక్కలుముక్కలుగా చేసెను . వెనువెంటనే  రావణునికి ఆయుధములతో సహా చేతులు చేతులు ఛిద్రమైన వాటి స్థానములో మొలిచెను . 
ఈ విధముగా జటాయువు పదేపదే విసిగించుటచే రావణుడు సీతను ఎడమచేతితో పట్టుకుని జటాయువుతో  యుద్ధమునకు దిగెను .  పిమ్మట సీతను వదిలి రెండు ఘడియల పాటు జటాయువుతో యుద్ధము చేసెను . పిమ్మట రావణుడు  ఖడ్గము తీసుకుని జటాయువు రెక్కలు ,కాళ్లు ,పక్కభాగములు నరికివేసెను . ఆ విధముగా రావణుడు జటాయువు రెక్కలు ,కాళ్ళు నరికివేయుటచే వెంటనే ఆ జటాయువు నేలపై పడిపోయెను . జటాయువు శరీరము నుండీ రక్తము ఏరులుగా పారసాగెను . ఆ జటాయువు వద్దకు సీత పరుగున వచ్చి దానిని చూసి ఆత్మబంధువును కోల్పోయినట్లుగా ఏడవసాగెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిఒకటవసర్గ సమాప్తము . 

                                 శశి ,

                    ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








Monday, 10 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిసర్గ

                                          రామాయణము 

                                                     అరణ్యకాండ -ఏబదిసర్గ 

అప్పుడే నిద్రించుటకు ఉపక్రమించిన జటాయువు సీతాదేవి ఆక్రన్దనలు విని ఉలిక్కిపడిలేచి ,రథముపైనున్న రావణుని ,వైదేహిని చూసేను . పక్షులలో శ్రేష్ఠుడైన జటాయువు రావణునితో ఇట్లు హితవచనములు పలికెను . "ఓ దశగ్రీవా !నా పేరు జటాయువు శ్రీరాముడు దశరథమహారాజు యొక్క కుమారుడు . అతడు సర్వలోకములకు ప్రభువు . నీవు అపహరించుకుపోవుచున్న ఈమె శ్రీరాముని భార్య . పతివ్రతాశిరోమణి . 
ఓ బలశాలీ !ధర్మవర్తనుడైన రాజు పరసతులను ఎలా స్పృశించును ? పైగా రాజపత్నులను తప్పక రక్షించవలెను కదా !వివేకము కలవాడు తనభార్యను రక్షించుకొను రీతిగా పరసతులను కూడా కాపాడవలెను . ఓ రాక్షసరాజా !నీవు పాపశీలుడవు   . కావుననే ఇట్టి దుష్కృత్యమునకు ఒడికట్టావు . శ్రీరాముడు మిక్కిలి బలశాలి అయినను నీకు కానీ ,నీ రాజ్యమునకు కానీ ఏ హాని తలపెట్టలేదు . మరి నీవెందుకు ఆయన భార్యను అపహరించుచున్నావు . 
ఓ నీచుడా !రాకుమారులైన రామలక్ష్మణులిద్దరూ ఇచటికి దూరముగా వున్నారు . నీవు వారికి భయపడే వారు లేని సమయము చూసి నీవు ఈ దుష్కృత్యమునకు ఒడికట్టినావు . నేను వారికి చెప్పుటకు వెళ్ళినచో నీవు పారిపోదువు  . కావున నేనే నీతో యుద్ధము చేసెదను . శ్రీరాముడు నాకు బహి ప్రాణము . నా బొందిలో ప్రాణము ఉండగా నీవు ఈమెను తీసుకుని వెళ్లజాలవు . దశరథమహారాజు నా మిత్రుడు .కావున దశరథమహారాజుకి ,ఆయన పుత్రుడైన శ్రీరాముడికి ఎల్లప్పుడూ హితము కూర్చు పనులే నేను చేయుదును . 
ఓ దశగ్రీవా !ఒక్క క్షణ కాలము ఆగుము రణభూమియందు నీకు తగిన సత్కారము జరిపెదను . నిన్ను రధము నుండి క్రింద పడవేసెదెను "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





Saturday, 8 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ

                                       రామాయణము 

                                  అరణ్యకాండ -నలుబదితొమ్మిదవసర్గ 

 సీతాదేవి పలుకులు విని రావణుడు తీవ్ర అసహనమునకు లోనై చేతులు పిసుకుకొనుచు తన అసలు రూపమును చూపెను . 

అనంతరము సీతాదేవితో మరల గట్టిగా "ఓ సీతా !నీవు పతి వ్యామోహములో పడి నా సౌర్యపరాక్రమములు సరిగా వినినట్టులేవు . నేను నా భుజబలముతో ఈ భూమండలమును పైకెత్తగలను . సముద్రజలమును అమాంతం తాగెయ్యగలను . రణరంగమున నిల్చి మృత్యు దేవతను పరిమార్చగలను . నేను కోరుకొనిన రూపము ధరింపగలను . నీవు దేనిని కోరినా ఇవ్వగలను . కనుక నన్ను పతిగా శ్వీకరింపుము . "
అని పలికిన రావణుడి రూపము చూచుటకు భయంకరముగా ఉండెను . కళ్ళు అగ్ని గోళముల వలె ఉండెను . పళ్ళు పటపట కోరుకుచు "ఓ కల్యాణీ !నీకు తగిన భర్త నుం నేనే . కలకాలం నీవు నాతోనే ఉండిపొమ్ము . నిన్ను సంతోష పరుచుతూ ,నీ ప్రశంసలు పొందదగినవాడను . నీకు నేనెన్నడూ అప్రియము కలిగింపను . రాముడు అల్పాయుష్కుడు ,రాజ్యభ్రష్టుడు అతడిలో ఏమి గొప్పతనము చూసి అతడిపై అనురాగము కలిగివున్నావు . "ఇలా మాట్లాడి ఆ దుష్టుడు తన ఎడమ చేతితో సీతాదేవి తలను ,కుడి చేతితో ఆమె పాదములను పట్టుకుని ఆమెను ఎత్తుకొనెను . 

మృత్యువు వలె భయంకరుడైన ఆ రావణుని చూసి వనదేవతల కూడా భయముతో పరుగులు తీసిరి . అంతవరకూ అదృశ్యముగా వున్న రావణుని రధము అచట ప్రత్యక్షమయ్యెను . రావణుడు సీతాదేవిని ఆవిధముగా ఎట్టి రథముపై ఉంచెను . రావణుడు అట్లు తీసుకునిపోవుటకు సిద్దపడగా ఆ సీతాదేవి తన భర్తను స్మరించి 'రామా !రామా !అని బిగ్గరగా అరవసాగెను . కామార్తుడైన రావణుడు తనను తిరస్కరించుచుతప్పించుకొనుటకు  మెలికలు తిరిగితున్న సీతను పట్టుకుని రథములో ఆకాశములో ఎగరసాగెను . 
సీతాదేవి బిగ్గరగా ఏడ్చుచు రామా !లక్ష్మణా !అని బిగ్గరగా అరవసాగెను . రావణునితో "దుష్టుడా !ఆయువుతీరినవాడవై ఈ పాపకృత్యమునకు పాల్పడినావు . నీవు కష్టములపాలై మరణించుట తధ్యము . "అని పలికెను . ఇంకనూ "అయ్యో రాముడి భార్యనైన నన్ను ఈ దుర్మాత్ముడు తీసుకొనిపోవుచున్నాడు . ఇప్పుడు కైకేయి ఆమె యొక్క బంధువుల కోరికలు నెరవేరి వారి మనసులు కుదుటపడివుండవచ్చును . దండకారణ్యమున బాగుగా పుష్పించిన ఓ గన్నేరుమొక్కలారా !రావణుడు సీతను అపహరించిపోవుచున్నాడు అని వెంటనే రాముడికి తెలుపుము . ఓ గోదావరీ మాతా !నీకు నమస్కారము చేయుచున్నాను . నన్ను రావణుడు అపహరించాడని రాముడికి తెలుపుము . అంటూ కనిపించిన చెట్టుకూ పుట్టకూ మొక్కుతూ రాముడికి చెప్పమని విలవిలలాడుతూ ఏడవసాగెను . 

సీతాదేవి మిక్కిలి దుఃఖితయై దయనీయవచనములతో ఇట్లు విలపించుచు ఆ సమయమున చెట్టుపైకల జాటాయి పక్షిని చూసేను . ఆ జాతాయువుతో గద్గద స్వరముతో ఆక్రందించుచు "పూజ్యుడైన ఓ జటాయువు !పాపకర్ముడైన ఈ రాక్షసరాజు నన్ను అపహరించుకునిపోతున్నాడు . దయచూడుము . ఈ నిశాచరుడు క్రూరుడు . బలశాలి ,విజయగర్వంతో ఉన్నాడు . సాయుధుడు ,పైగా దుర్మాత్ముడు అట్టి ఇతనిని ఎదుర్కొనుట నీకు అశక్యము కావున నీవు శీఘ్రముగా వెళ్లి నన్ను అపహరించుకుపోవు విషయము రామలక్ష్మణులకు తెలుపు "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                          శశి ,

ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    










 
 

Thursday, 6 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ

                                     రామాయణము 

                                   అరణ్యకాండ -నలుబది ఎనిమిదవసర్గ 

సీతా దేవిని బయపెట్టుటకై అప్పుడు రావణుడు "ఓ సుందరీ !కుబేరుడు సవతి సోదరుడు . అతడిపై యుద్ధము గెలిచి ,అతడి లంకా నగరమును ,పుష్పకమును స్వాధీనము చేసుకున్నాను . అది ఎచ్చటికైనను పయనించగలదు . ఆకాశమార్గములో కూడా వెళ్లగలదు .  రాజధాని అగు లంకా నగరము చుట్టూ సముద్రముతో శత్రు దుర్భేద్యముగా ఉండును . ఆ నగరమంతయు బంగారము మణులతో అలంకరింపబడి శోభాయమానంగా ఉండును . నా చేతిలో ఓడిన కుబేరుడు కైలాస గిరిలో తలదాచుకొనెను . నీవు అచటికి వచ్చినచో అచటి వైభోగములు ,ఆనందములు చూసి రాముడిని తలవనైనాతలవవు . నా పరాక్రమము ముందు మానవమాత్రుడైన రాముడు ఏపాటికి సరికాడు . 
నేను సంస్థ రాక్షసులకు రాజుని . నా పేరు తలచినా ,నన్ను చూసినా దేవతలు ,గంధర్వులు .యక్షులు మానవులు మొదలగు సమస్త జాతుల వారు గడగడ వణుకుదురు . వాయువు ,సూర్యచంద్రులు ,అగ్ని సముద్రుడు కూడా నేనున్నచోట తమ ప్రతాపమును చూపించుటకు బయపడెదరు . నీ అదృష్టము కొలది నేను  చేరితిని . కనుక నన్ను శ్వీకరింపుము . "అని పలికెను ఆ నిర్జనవనప్రదేశమున రావణుడు ఇట్లు పలుకగా సీతాదేవి మిగుల కృద్ధురాలై కన్నులెర్రజేజుచు ఆ రాక్షసరాజుతో 
"సమస్త ప్రాణులకు పూజ్యుడు మహాత్ముడు అయిన కుబేరునికి సోదరుడవు అయివుండి కూడా ఇట్టి పాపకృత్యములు ఏల చేయుచున్నావు ?ఓ రావణా !నీవు క్రూరుడవు . ఇంద్రియసుఖలోలుడవు . నీ బుడ్డి పెడదారిన పట్టినది అట్టి నిన్ను ప్రభువుగా పొందిన రాక్షసులందరూ నీ మూలకంగా తప్పక నశింతురు . ఎవడైనను ఇంద్రుడి భార్య అయిన శచీదేవిని అపహరించి ప్రాణములతో ఉండవచ్చునో కానీ ,శ్రీరాముడి భార్య అయిన నన్ను అపహరించిన యెడల వారి ప్రాంమౌలా మీద ఆశ వదులుకోవలసినదే :అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియెనిమిదవసర్గ సమాప్తము . 

                       శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  








 

Sunday, 2 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదియేడవసర్గ

                                      రామాయణము 

                                     అరణ్యకాండ -నలుబదియేడవసర్గ 

రావణుడు పలికిన మాటలు విన్న సీతాదేవి తన మనసులో 'ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు పైగా అతిధి ఈయనకు సమాధానము చెప్పనిచో శపించునో ఏమో ?అని అనుకుని "బ్రాహ్మణోత్తమా !నేను మిథిలానగరప్రభువైన జనకుడి కుమార్తెను . దశరధుడి కుమారుడైన శ్రీరాముని అర్ధాంగిని . నా పేరు సీత . నా వివాహము అనంతరము 12 సంవత్సరములు అయోధ్యలో హాయిగా ఉంటిమి . మా మామగారు రామునికి పట్టాభిషేకము చేయ యత్నించగా మా అత్తగారు కైక తనకు వున్నా రెండు వరములను అప్పుడు 'భరతుని పట్టాభిషేకము ,రాముని వనవాసము 'గా కోరెను . 
దశరథ మహారాజు ఆడినమాట తప్పలేక ,ఆ వరములు తీర్చలేక తల్లడిల్లుచుండగా నా భర్త శ్రీరాముడు తండ్రి మాట నిలబెట్టుటకు వనములకు వచ్చుటకు నిశ్చయించుకొనెను . నేను మా మరిది లక్ష్మణుడు ఆయనతో వనములకు వచ్చి ఉంటిమి . ఈ పవిత్ర ప్రదేశములో నీవు విశ్రాంతి తీసుకొనుము . నా భర్త ఇప్పుడే వచ్చెదరు . కందమూలాదులు పుష్కలముగా తెచ్చెదరు . ఆరగిందురు . 
ఓ విప్రుడా !పూరవాశ్రమములో నీ పేరేమి ?గోత్రమేమి ?ఒంటరిగా ఈ దండకారణ్యమున ఎలా సంచరించుచుంటివి ?ఏ ఊరివాడవు ?"అని  సీత ప్రశ్నించగా రావణుడు తీవ్రస్వరంతో "నా పేరు రావణుడు . నేను రాక్షస రాజుని . దేవతలు ,నాగులు యక్షులు ,మానవులు సమస్త జాతులవారు నాకు భయపడుదురు . ఓ సుందరీ !నీ దివ్య సౌందర్యము చూచినప్పటినుండి నాకు నా భార్యలపై మనసుపోకున్నది . నేను వివిధప్రదేశముల నుండి అనేక మంది సుందరీమణులు ను అపహరించి తీసుకువచ్చివుంటిని . నీవు నన్ను వివాహమాడినచో వారందరూ నీకు దాసీలగుదురు . నీవు నా పట్టపురానివివి అగుదువు . సముద్రము మధ్యన కల త్రికూటగిరిపై విలసిల్లెడి లంకా నగరము నా రాజధాని . చుట్టూ సముద్రముతో  నా రాజ్యము శత్రు దుర్భేద్యమై ఉండును . ఓ భామినీ నీవు నా భార్యవై వివిధములగు ఆభరణములు ధరించి స్వర్గములో వలే హాయిగా వుండెదవు . "అని పలికెను . 
ఆ మాటలు విన్న సీతాదేవి రావణుని తృణీకరించుతూ "రావణా !నా భర్త రాముడు మే రు పర్వతము వలే ఉన్నతమైనవాడు . అట్టి వానిని కాదని నేను అల్పుడవైన  నీవంటి వారి చెంతకు వచ్చుట కలలో కూడా జరగనిది . ఆయనతోడితే నా జీవితమూ . నేను ఆడ సింహమును నీవు నక్కవు . నేను ఎవ్వరికి అందను . నా భర్త సంరక్షణలో ఉన్న నా జోలికి వచ్చుట అంటే మృత్యు శిఖరమునకు నీవే వెతుకుతూ చేరుట "అని పలికి చిగురుటాకు వలె భయముతో వణకసాగెను . ఆ విధముగా వణుకుచున్న సీతను ఇంకా భయపెట్టుటకు తన పరాక్రము గూర్చి ,రాక్షస జాతి గూర్చి ,తన దుష్కృత్యముల గురించి వివరింప మొదలుపెట్టేను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









 

Saturday, 1 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదిఆరవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -నలుబదిఆరవసర్గ 

సీతాదేవి పలికిన పరుష వచనములు భరించలేక లక్ష్మణుడు సీతను వంటరిగా విడుచుటకు కాళ్లురాకున్నను అన్నను చేరుటకై ఆశ్రమము వదిలి బయలుదేరెను . తగిన అవకాశము కోసం ఎదురుచూచుచున్న దశగ్రీవుడు (రావణుడు )లక్ష్మణుడు వెళ్ళుట గమనించి సీతాదేవి సమక్షమునకు వచ్చెను . రావణుడు కాషాయ వస్త్రములు ధరించి శిఖను ,ఛత్రమును ,పాడుకులను ధరించి ఉండెను . ఎడమచేతితో దండము ,కుడిచేతితో కమండలం ధరించి ఆశ్రమము వద్దకు వచ్చెను . 
క్రూరుడు పాపాత్ముడు అయిన రావణుని చూచి దండకారణ్యమున వృక్షముల కదలికలు ఆగిపోయెను . వాయువు ప్రసరించుట ఆగిపోయెను . పరవళ్లు తొక్కుచూ ప్రవహించెడి గోదావరి వేగము తగ్గించి నెమ్మిదిగా ప్రవహింపసాగెను . అటుల రావణుడు బిక్షకుడి వేషములో వైదేహి కడకు వచ్చెను . పతికి ఏ ఆపద వచ్చినదో అని పాటి ధ్యానంలోనే నిమగ్నమైవున్న సీతాదేవిని రావణుడు చూసేను . ఆమె పట్టుపీతాంబరములు ధరించి దిగులుతో ఆశ్రమములో ఏడ్చుచు ఉండెను . 
అప్పుడు రావణుడు "పట్టుపీతాంబరములు ధరించి బంగారు బొమ్మ వలె ఉన్న ఓ వనితా !ఎవరు నువ్వు ?నీ ముఖము ,నేత్రములు ,చేతులు ,కాళ్ళు పద్మములవలె ఉండి పద్మలతలా వున్నావు . నీవు లక్ష్మీవా ?పార్వతివా ?లేక సరస్వతివా ?రతీదేవివా ?ఎవరునీవు ?దివ్యభామినులు కానీ ,గాంధర్వ కాంటాలు కానీ ,యక్ష ,కిన్నెర యువతులు కానీ నీ అందము ముందు దిగదుడుపే . నీవంటి నారీ రత్నమును ఇంతకు ముందు ఈ భూమండలమున చూసి ఎరుగను . 
లోకోత్తరమైన నీ లావణ్యము సౌకుమార్యము ,యవ్వనము ,ఆ వనమున ఏకాంతవాసము ఇవన్నియు నన్ను పిచ్చివానిగా చేయుచున్నవి . ఓ తరుణీ !భయంకరులు కామరూపులు (నచ్చినరూపములో మారగల )రాక్షసులు సంచరించెడి ఇట్టి ఈ ఘోరారణ్యమున నీవు నివసింపతగదు . నీవు నీ భవనమునకు మరలుము . ఇట్టి భయంకరమైన ఈ అరణ్యములో దేవతలు గంధర్వులు మొదలగు వారెవరు సంచరించారు మరి నీవేల వచ్చితివి ?"అని రావణుడు సీతాదేవిని పొగుడుతూ ప్రశ్నించెను . 

అట్లు పలికిన రావణుడు వేషము చూసి సీతాదేవి అతడు సాధువని భావించి అతడిని ఆశ్రమములోకి ఆహ్వానించి ఆసనము (కూర్చొనుటకు పీట )వేసెను , కాళ్ళు,చేతులు కడుగుకొనుటకు ,త్రాగుటకు నీళ్లు ఇచ్చి ఆయనను ఆసనమున కూర్చుండమని ఆహ్వానించెను . సీతాదేవి ఇట్లు ఆహ్వానించుచున్నదే కానీ మాటిమాటికీ రాముడు వెళ్లిన దిక్కుగానే చూచుచు ,రామునకు ఏమయినదో అని కలవరపడుతూ ఉండెను . కానీ ఎంతకీ రామలక్ష్మణులు రాకుండిరి . 

రామాయణము అరణ్యకాండ నలుబదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు