Monday 10 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిసర్గ

                                          రామాయణము 

                                                     అరణ్యకాండ -ఏబదిసర్గ 

అప్పుడే నిద్రించుటకు ఉపక్రమించిన జటాయువు సీతాదేవి ఆక్రన్దనలు విని ఉలిక్కిపడిలేచి ,రథముపైనున్న రావణుని ,వైదేహిని చూసేను . పక్షులలో శ్రేష్ఠుడైన జటాయువు రావణునితో ఇట్లు హితవచనములు పలికెను . "ఓ దశగ్రీవా !నా పేరు జటాయువు శ్రీరాముడు దశరథమహారాజు యొక్క కుమారుడు . అతడు సర్వలోకములకు ప్రభువు . నీవు అపహరించుకుపోవుచున్న ఈమె శ్రీరాముని భార్య . పతివ్రతాశిరోమణి . 
ఓ బలశాలీ !ధర్మవర్తనుడైన రాజు పరసతులను ఎలా స్పృశించును ? పైగా రాజపత్నులను తప్పక రక్షించవలెను కదా !వివేకము కలవాడు తనభార్యను రక్షించుకొను రీతిగా పరసతులను కూడా కాపాడవలెను . ఓ రాక్షసరాజా !నీవు పాపశీలుడవు   . కావుననే ఇట్టి దుష్కృత్యమునకు ఒడికట్టావు . శ్రీరాముడు మిక్కిలి బలశాలి అయినను నీకు కానీ ,నీ రాజ్యమునకు కానీ ఏ హాని తలపెట్టలేదు . మరి నీవెందుకు ఆయన భార్యను అపహరించుచున్నావు . 
ఓ నీచుడా !రాకుమారులైన రామలక్ష్మణులిద్దరూ ఇచటికి దూరముగా వున్నారు . నీవు వారికి భయపడే వారు లేని సమయము చూసి నీవు ఈ దుష్కృత్యమునకు ఒడికట్టినావు . నేను వారికి చెప్పుటకు వెళ్ళినచో నీవు పారిపోదువు  . కావున నేనే నీతో యుద్ధము చేసెదను . శ్రీరాముడు నాకు బహి ప్రాణము . నా బొందిలో ప్రాణము ఉండగా నీవు ఈమెను తీసుకుని వెళ్లజాలవు . దశరథమహారాజు నా మిత్రుడు .కావున దశరథమహారాజుకి ,ఆయన పుత్రుడైన శ్రీరాముడికి ఎల్లప్పుడూ హితము కూర్చు పనులే నేను చేయుదును . 
ఓ దశగ్రీవా !ఒక్క క్షణ కాలము ఆగుము రణభూమియందు నీకు తగిన సత్కారము జరిపెదను . నిన్ను రధము నుండి క్రింద పడవేసెదెను "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిసర్గ సమాప్తము . 

                               శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





No comments:

Post a Comment