Tuesday 11 July 2017

రామాయణం అరణ్యకాండ -ఏబదిఒకటవసర్గ

                                     రామాయణం 



                                         అరణ్యకాండ -ఏబదిఒకటవసర్గ 

ధర్మబద్ధముగా జటాయువు ఆ విధముగా పలికిన పిమ్మట రావణుడు మిగుల క్రుద్ధుడై కన్నులనుండి నిప్పులు కురిపించెను . ఆ రాక్షసరాజు ఆ జటాయువు పైకి యుద్దానికి దూకేను . ఆ ఇరువురు యోధులు ఘోరాతోఘోరముగా యుద్ధము చేసుకొనిరి . రావణుడు శూలములు ,బల్లెములు గద మొదలగు ఆయుధములను జటాయువు పైకి విసిరెను . జటాయువు వాటిని చెదరగొట్టెను . పిమ్మట రావణుడు పది వాడి బాణములతో జటాయువును కొట్టెను . ఆ బాణములు జటాయువును తీవ్రముగా గాయపరిచేను . 

జటాయువు రథముపై వున్న రావణుని ,సీతను చూసి బాణపు దెబ్బలను ఏమాత్రము లెక్కచేయక రధము పైకి దూకి రథమునకు కట్టిన అశ్వములను ముక్కుతో పొడిచి చంపెను . తన వాడి గోళ్ళతో రావణుడి రధము లోకల రావణుడి సేవకులను చంపెను . రావణుడి రధము ముక్కలు చేసెను . రధసారధి శిరస్సు ఖండించెను . రావణుడి కవచము ధ్వంసము చేసెను . తన రధము ఛిద్రమయిపోగా రావణుడు సీతను పట్టుకుని భూమిమీదకు దూకేను .
వాహనము ఛిద్రముకాగా ,నేలపైకి దూకిన రావణుని చూసి సమస్త ప్రాణులు 'బాగుబాగు ' అని సంబరంతో పలుకుతూ జటాయువును శ్లాఘించెను . వృద్ధాప్య కారణముగా పక్షిరాజైన జటాయువు మిక్కిలి అలిసివుండుట చూసిన రావణుడు సంతోషించి ,సీతను తీసుకుని ఆకాశమార్గములో ఎగిరిపోసాగెను . అది చూసిన జటాయువు తాను కూడా ఆకాశములో ఎగిరి ఆ రావణునికి ఎదురుగా నిలబడి "ఓ అల్పబుద్దీ !చావు మూడి ఉండుటచే నీవు ఇట్టి పాపపు పనికి పూనుకున్నావు . రణరంగమున రాముడి వజ్ర తుల్యమగు బాణములు నీ గుండెలను చీల్చుట ఖాయము . నీవు నిజముగా వీరుడవయితే క్షణకాలం నిలిచి నాతొ యుద్ధము చేయి "అని పలికెను . 
జటాయువు ఇలా పలుచున్నప్పటికీ రావణుడు సీతను తీసుకుని వెళ్లుచునే ఉండెను . అప్పుడు పరాక్రమశాలి అయిన జటాయువు అతడిపై దాడి చేసెను . రావణుడిని తన పదునైన గోళ్ళతో రక్కుచూ ,ముక్కుతో పొడుచుచూ అతని వీపును గాయపరిచేను . జుట్టు పట్టుకుని లాగెను . అప్పుడు రావణుడు ఆ జటాయువును కొట్టుటకు తన 20 పిడికిళ్ళను ముందుకు చాచెను . జటాయువు వాటిని ముక్కలుముక్కలుగా చేసెను . వెనువెంటనే  రావణునికి ఆయుధములతో సహా చేతులు చేతులు ఛిద్రమైన వాటి స్థానములో మొలిచెను . 
ఈ విధముగా జటాయువు పదేపదే విసిగించుటచే రావణుడు సీతను ఎడమచేతితో పట్టుకుని జటాయువుతో  యుద్ధమునకు దిగెను .  పిమ్మట సీతను వదిలి రెండు ఘడియల పాటు జటాయువుతో యుద్ధము చేసెను . పిమ్మట రావణుడు  ఖడ్గము తీసుకుని జటాయువు రెక్కలు ,కాళ్లు ,పక్కభాగములు నరికివేసెను . ఆ విధముగా రావణుడు జటాయువు రెక్కలు ,కాళ్ళు నరికివేయుటచే వెంటనే ఆ జటాయువు నేలపై పడిపోయెను . జటాయువు శరీరము నుండీ రక్తము ఏరులుగా పారసాగెను . ఆ జటాయువు వద్దకు సీత పరుగున వచ్చి దానిని చూసి ఆత్మబంధువును కోల్పోయినట్లుగా ఏడవసాగెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిఒకటవసర్గ సమాప్తము . 

                                 శశి ,

                    ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment