Sunday 2 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదియేడవసర్గ

                                      రామాయణము 

                                     అరణ్యకాండ -నలుబదియేడవసర్గ 

రావణుడు పలికిన మాటలు విన్న సీతాదేవి తన మనసులో 'ఈ వచ్చినవాడు బ్రాహ్మణుడు పైగా అతిధి ఈయనకు సమాధానము చెప్పనిచో శపించునో ఏమో ?అని అనుకుని "బ్రాహ్మణోత్తమా !నేను మిథిలానగరప్రభువైన జనకుడి కుమార్తెను . దశరధుడి కుమారుడైన శ్రీరాముని అర్ధాంగిని . నా పేరు సీత . నా వివాహము అనంతరము 12 సంవత్సరములు అయోధ్యలో హాయిగా ఉంటిమి . మా మామగారు రామునికి పట్టాభిషేకము చేయ యత్నించగా మా అత్తగారు కైక తనకు వున్నా రెండు వరములను అప్పుడు 'భరతుని పట్టాభిషేకము ,రాముని వనవాసము 'గా కోరెను . 
దశరథ మహారాజు ఆడినమాట తప్పలేక ,ఆ వరములు తీర్చలేక తల్లడిల్లుచుండగా నా భర్త శ్రీరాముడు తండ్రి మాట నిలబెట్టుటకు వనములకు వచ్చుటకు నిశ్చయించుకొనెను . నేను మా మరిది లక్ష్మణుడు ఆయనతో వనములకు వచ్చి ఉంటిమి . ఈ పవిత్ర ప్రదేశములో నీవు విశ్రాంతి తీసుకొనుము . నా భర్త ఇప్పుడే వచ్చెదరు . కందమూలాదులు పుష్కలముగా తెచ్చెదరు . ఆరగిందురు . 
ఓ విప్రుడా !పూరవాశ్రమములో నీ పేరేమి ?గోత్రమేమి ?ఒంటరిగా ఈ దండకారణ్యమున ఎలా సంచరించుచుంటివి ?ఏ ఊరివాడవు ?"అని  సీత ప్రశ్నించగా రావణుడు తీవ్రస్వరంతో "నా పేరు రావణుడు . నేను రాక్షస రాజుని . దేవతలు ,నాగులు యక్షులు ,మానవులు సమస్త జాతులవారు నాకు భయపడుదురు . ఓ సుందరీ !నీ దివ్య సౌందర్యము చూచినప్పటినుండి నాకు నా భార్యలపై మనసుపోకున్నది . నేను వివిధప్రదేశముల నుండి అనేక మంది సుందరీమణులు ను అపహరించి తీసుకువచ్చివుంటిని . నీవు నన్ను వివాహమాడినచో వారందరూ నీకు దాసీలగుదురు . నీవు నా పట్టపురానివివి అగుదువు . సముద్రము మధ్యన కల త్రికూటగిరిపై విలసిల్లెడి లంకా నగరము నా రాజధాని . చుట్టూ సముద్రముతో  నా రాజ్యము శత్రు దుర్భేద్యమై ఉండును . ఓ భామినీ నీవు నా భార్యవై వివిధములగు ఆభరణములు ధరించి స్వర్గములో వలే హాయిగా వుండెదవు . "అని పలికెను . 
ఆ మాటలు విన్న సీతాదేవి రావణుని తృణీకరించుతూ "రావణా !నా భర్త రాముడు మే రు పర్వతము వలే ఉన్నతమైనవాడు . అట్టి వానిని కాదని నేను అల్పుడవైన  నీవంటి వారి చెంతకు వచ్చుట కలలో కూడా జరగనిది . ఆయనతోడితే నా జీవితమూ . నేను ఆడ సింహమును నీవు నక్కవు . నేను ఎవ్వరికి అందను . నా భర్త సంరక్షణలో ఉన్న నా జోలికి వచ్చుట అంటే మృత్యు శిఖరమునకు నీవే వెతుకుతూ చేరుట "అని పలికి చిగురుటాకు వలె భయముతో వణకసాగెను . ఆ విధముగా వణుకుచున్న సీతను ఇంకా భయపెట్టుటకు తన పరాక్రము గూర్చి ,రాక్షస జాతి గూర్చి ,తన దుష్కృత్యముల గురించి వివరింప మొదలుపెట్టేను . 

రామాయణము అరణ్యకాండ నలుబదియేడవసర్గ సమాప్తము . 

                     శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  









 

No comments:

Post a Comment