Saturday 1 July 2017

రామాయణము అరణ్యకాండ -నలుబదిఆరవసర్గ

                                                 రామాయణము 

                                                   అరణ్యకాండ -నలుబదిఆరవసర్గ 

సీతాదేవి పలికిన పరుష వచనములు భరించలేక లక్ష్మణుడు సీతను వంటరిగా విడుచుటకు కాళ్లురాకున్నను అన్నను చేరుటకై ఆశ్రమము వదిలి బయలుదేరెను . తగిన అవకాశము కోసం ఎదురుచూచుచున్న దశగ్రీవుడు (రావణుడు )లక్ష్మణుడు వెళ్ళుట గమనించి సీతాదేవి సమక్షమునకు వచ్చెను . రావణుడు కాషాయ వస్త్రములు ధరించి శిఖను ,ఛత్రమును ,పాడుకులను ధరించి ఉండెను . ఎడమచేతితో దండము ,కుడిచేతితో కమండలం ధరించి ఆశ్రమము వద్దకు వచ్చెను . 
క్రూరుడు పాపాత్ముడు అయిన రావణుని చూచి దండకారణ్యమున వృక్షముల కదలికలు ఆగిపోయెను . వాయువు ప్రసరించుట ఆగిపోయెను . పరవళ్లు తొక్కుచూ ప్రవహించెడి గోదావరి వేగము తగ్గించి నెమ్మిదిగా ప్రవహింపసాగెను . అటుల రావణుడు బిక్షకుడి వేషములో వైదేహి కడకు వచ్చెను . పతికి ఏ ఆపద వచ్చినదో అని పాటి ధ్యానంలోనే నిమగ్నమైవున్న సీతాదేవిని రావణుడు చూసేను . ఆమె పట్టుపీతాంబరములు ధరించి దిగులుతో ఆశ్రమములో ఏడ్చుచు ఉండెను . 
అప్పుడు రావణుడు "పట్టుపీతాంబరములు ధరించి బంగారు బొమ్మ వలె ఉన్న ఓ వనితా !ఎవరు నువ్వు ?నీ ముఖము ,నేత్రములు ,చేతులు ,కాళ్ళు పద్మములవలె ఉండి పద్మలతలా వున్నావు . నీవు లక్ష్మీవా ?పార్వతివా ?లేక సరస్వతివా ?రతీదేవివా ?ఎవరునీవు ?దివ్యభామినులు కానీ ,గాంధర్వ కాంటాలు కానీ ,యక్ష ,కిన్నెర యువతులు కానీ నీ అందము ముందు దిగదుడుపే . నీవంటి నారీ రత్నమును ఇంతకు ముందు ఈ భూమండలమున చూసి ఎరుగను . 
లోకోత్తరమైన నీ లావణ్యము సౌకుమార్యము ,యవ్వనము ,ఆ వనమున ఏకాంతవాసము ఇవన్నియు నన్ను పిచ్చివానిగా చేయుచున్నవి . ఓ తరుణీ !భయంకరులు కామరూపులు (నచ్చినరూపములో మారగల )రాక్షసులు సంచరించెడి ఇట్టి ఈ ఘోరారణ్యమున నీవు నివసింపతగదు . నీవు నీ భవనమునకు మరలుము . ఇట్టి భయంకరమైన ఈ అరణ్యములో దేవతలు గంధర్వులు మొదలగు వారెవరు సంచరించారు మరి నీవేల వచ్చితివి ?"అని రావణుడు సీతాదేవిని పొగుడుతూ ప్రశ్నించెను . 

అట్లు పలికిన రావణుడు వేషము చూసి సీతాదేవి అతడు సాధువని భావించి అతడిని ఆశ్రమములోకి ఆహ్వానించి ఆసనము (కూర్చొనుటకు పీట )వేసెను , కాళ్ళు,చేతులు కడుగుకొనుటకు ,త్రాగుటకు నీళ్లు ఇచ్చి ఆయనను ఆసనమున కూర్చుండమని ఆహ్వానించెను . సీతాదేవి ఇట్లు ఆహ్వానించుచున్నదే కానీ మాటిమాటికీ రాముడు వెళ్లిన దిక్కుగానే చూచుచు ,రామునకు ఏమయినదో అని కలవరపడుతూ ఉండెను . కానీ ఎంతకీ రామలక్ష్మణులు రాకుండిరి . 

రామాయణము అరణ్యకాండ నలుబదిఆరవసర్గ సమాప్తము . 

                      శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు  










 

No comments:

Post a Comment