Wednesday 12 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదిరెండవసర్గ

                                          రామాయణము

                                           అరణ్యకాండ -ఏబదిరెండవసర్గ 

రావణుడు శ్రీరాముని ఆశ్రమ సమీపమున నేలపై పడిపోయిన జటాయువును ,దాని చెంతే ఉండి ఏడుస్తున్న సీతను చూసేను . సీతను తీసుకువెళ్ళుటకు రావణుడు త్వరత్వరగా ఆ వైపుగా నడవసాగెను . తనవైపుగా వస్తున్న రావణుని చూసి సీతాదేవి రామాలక్ష్మణా !అని బిగ్గరగా అరుస్తూ వృక్షమును కౌగిలించుకొనెను . ఆ విధముగా వృక్షమును గట్టిగా పట్టుకున్న సీతాదేవి జుట్టును రావణుడు పట్టుకొనెను . ఆ విధముగా సీతకు జరిగిన అవమానము చూసిన సకల చరాచర జగత్తు అచేతనములై ఉండిపోయెను . 
సూర్యుడు కళాహీనుడయ్యెను . వాయువు ప్రసరించుట ఆపివేసెను . సీతాదేవిని రావణుడు బలవంతముగా ఎత్తుకొనిపోవుట ,ఆవిడ తప్పించుకొనుటకు గింజుకోనుటలో ఆమె కేశపాశములు చెదిరిపోయెను .ఆమె నుదిటి బొట్టు చెరిగేను .  ఆమె ధరించిన ఎర్రమందారరేకులు చెదిరి రాలిపోయెను . ఆమె  ఎర్రటి పట్టువస్త్రము గాలికి  ఎగురుతూ రావణుడికి రాబోవు చావుకు సంకేతముగా ఉన్నది . ఆమె ఎడమకాలి అందే ఊడి నేలపై పడెను . అది రత్నమణిఖచితమై ఉండెను . తదుపరి మెడలోని హారములు కంఠాభరణములు ఇలా ఒక్కొక్కటిగా జారీ నేలపై పడెను . 

ఆ విధముగా బిగ్గరగా రామా !లక్ష్మణా !అని అరుస్తూ నేలపైకి చూస్తూ హృదయవిదారకంగా విలపించుచున్న సీతాదేవిని చూసిన వనదేవతలు సైతము వణికిపోయిరి . ఈ స్థితిలో ఆమెకు రామలక్ష్మణులు కనపడకుండుటచే ఆమె దీనావదన అయి  అంతులేని భయముతో కృంగిపోయెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 

                                      శశి ,

                    ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment