Monday, 25 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పది తొమ్మిదవసర్గ

                               రామాయణము 

                                కిష్కిందకాండ -ముప్పది తొమ్మిదవసర్గ 

తన వద్దకు వచ్చిన సుగ్రీవుని  ఇసుక వేస్తె రాలనంతగా వున్నా వానరులను చూసి సంతోషముతో ,ఉత్సాహముతో శ్రీరాముడు సుగ్రీవుని కౌగిలించుకొని ఆయనను పొగిడెను . వారు ఇలా మాట్లాడుకుంటుండగా ఇంకనూ వానర ప్రముఖులు కొందరు వానరులతో అచటికి వచ్చిరి .  అలా వచ్చిన వానర వీరుల వివరములు . 
"శతవాలి "అను వానరవీరుడు పదివేలకోట్లమంది అనుచరులతో అచటికి చేరెను . 
తారకు తండ్రి అయినా సుషేణుడు పెక్కువేలకోట్లమందితో అచటికి వచ్చెను . 
సుగ్రీవునికి మామ అయిన రుమతండ్రి మరి ఒక వేయి కోట్ల మందితో అచటికి వచ్చెను . 
హనుమంతుడి తండ్రి అగు కేసరి వేలకొలది వానరులతో అచటికి  వచ్చెను . 
గవాక్షుడు అను వాడు వేలకోట్ల మందితో అచటికి వచ్చెను . 
మహాకాయుడు అయిన నీలుడు పదికోట్లమందితో అచటికి వచ్చెను . 
గవయుడు అను వానర సేనా నాయకుడు అయిదు కోట్లమంది తో అచటికి చేరెను . 
దరీముఖుడు అను వానర నాయకుడు వేయి కోట్ల మందితో అచటికి చేరెను . 
అశ్వనీ దేవతలా కుమారులైన మైందుడు ,ద్వివిదుడు అనువారు చేరిఒక వేయి కోట్ల మంది అనుచరులతో అచటికి చేరిరి . 
గజుడు అను మహాశక్తివంతుడైన వానరవీరుడు మూడు కోట్లమందితో అచటికి చేరెను . 
భల్లూక ప్రభువైన జాంబవంతుడు పదికోట్లమంది భల్లూక యోధులతో అచటికి చేరెను . 
రుమన్వంతుడు  అను వానర ప్రముఖుడు వందకోట్లమంది అనుచరులను వెంట పెట్టుకుని అచటికి వచ్చెను . 
గంధమాధనుడు అనువాడు కోటానుకోట్ల మందిని వెంటపెట్టుకుని అచటికి వచ్చెను . 
యువరాజైన అంగదుడు నూరు శంకువులు సంఖ్యలో వానరులను వెంటపెట్టుకుని అచటికి వచ్చెను . 
తారుడు అను వాడు అయిదు కోట్ల మంది వానరులతో అచటికి వచ్చెను . 
ఇంద్రజానువు అనువాడు పదకొండు కోట్ల మంది వానరులతో అచటికి వచ్చెను . 
రంభుడు అనువాడు కోట్లకొలది వానర వీరులతో అచటికి చేరెను . 
దుర్ముఖుడు అనువాడు రెండు కోట్లమందితో అచటికి వచ్చెను . 
హనుమంతుడు వెయ్యికోట్ల మంది బలిష్ఠులైన అనుచరులతో వచ్చెను . 
నలుడు వృక్షములపై నివసించు కోట్లకొలది వానరులతో అచటికి వచ్చెను .
 శుభలక్షణ సంపన్నుడైన దధిముఖుడు పదికోట్లమంది వానరులతో అచటికి వచ్చెను . 
శరభుడు ,కుముదుడు ,వహ్ని ,రంహుడు ఇంకా కొంత మంది కామరూపులైన వానరులు పర్వతాలతో ,వనాలతో కూడిన సంస్థ భూమండలమును గాలించి అసంఖ్యాకులైన వానరులను తీసుకుని వచ్చిరి . 

వారంద్రూ కేరింతలతో కోలాహలంతో తమ రాకను వానర ప్రభువైన సుగ్రీవునికి తెలిపి సుగ్రీవుని ఎదుట వినమ్రతతో నిలబడిరి . ఆ సమయములో సుగ్రీవుడు శ్రీరాముని కి నస్కారము చేసి అచటకు వచ్చిన వానర వీరుల గురించి ఆయనకు తెలిపెను . పిమ్మట వానర వీరులతో" వీరులారా !పర్వతములో ,వృక్షముల వద్ద సేద తీరనుంది ఆయా నాయకులు తమ అనుసరులను చూసుకోండి "అని పలికెను . 

రామాయణము కిష్కింద కాండ ముప్పది తొమ్మిదవసర్గ సమాప్తము . 

                  శశి ,

ఎం .ఏ ,ఎం .ఏ (తెలుగు ) , తెలుగు పండితులు 






రామాయణము కిష్కిందకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                                రామాయణము 

                         కిష్కిందకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

వానరుల వద్దకు దూతలను పంపిన పిదప సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి శ్రీరాముని వద్దకు వచ్చెను . శ్రీరామునితో తగు రీతిగా మాట్లాడి వానరులు వచ్చుచున్న సంగతి ఆయనకు తెలిపి ఆయనను ఊరడించెను . వానరులందరూ అచటికే వచ్చి సుగ్రీవునికి బహుమతులు ఇచ్చిరి . వానరులను చూసిన సుగ్రీవుడు ,రాముడు తృప్తి చెందెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియెనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియేడవసర్గ

                                           రామాయణము 

                                       కిష్కిందకాండ -ముప్పదియేడవసర్గ 

మహాత్ముడగు లక్ష్మణుడు ఇలా పలికిన పిమ్మట సుగ్రీవుడు తన పక్కనే వున్న హనుమంతునితో "హనుమా !మహేంద్రగిరి ,హిమవత్పర్వతము ,వింధ్యాచలము ,కైలాసపర్వతము ,మందరాచలము ఈ అయిదు పర్వతాలపై కల వానరులను ఇక్కడకు తీసుకురావలెను . పడమటి దిక్కున సముద్రతీరమునందు కల పర్వతములపై వున్న వానరులను ,ఉదయగిరినందు కల పద్మాతాళవనము నందు కల వానరులను ,అంజనాద్రి పై వుండు నల్లగా ఏనుగుల వాలే బలిశాముగా కల వానరులను ,మీరు పర్వతముపై కల వానరులను ,దూమ్రగిరిపై కల వానరులను ఇంకనూ ఈ భూమండలముపై కల సంస్థ వానరులను ఇచ్చటికి వెంటనే తీసుకురావలయును . ఆయా వానరులందరిని సామ దాన ఉపాయములతో ఇక్కడకు రప్పించు టకు కొందరు దూతలను పంపుము .    
             ఇంతకూ ముందే నేను కొందరు దూతలను పంపివున్నాను . వారిని తొందరపెట్టి ఇక్కడకు తీసుకు వచ్చుటకు త్వరగా  వెళ్లగల వానరులను దూతలుగా పంపుము . ఈ భూలోకమునందలి సంస్థ వానరులు ఒక 10 దినములలోపల ఇక్కడకు రావాలి . రానివారిని రాజాజ్ఞను దిక్కరించినట్టుగా భావించి శిక్షించెదను . ఇది నా ఆదేశము "అని పలికెను . 
సుగ్రీవుడు ఆ విధముగా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే వానరుల స్థానములు బాగా తెలిసిన దూతలందరూ హనుమంతుడి ప్రేరణచే అన్ని దిక్కులకు వెళ్లెను . అలా వెళ్లిన వానరులు ఈ భూమండలముపై కల వివిధ ప్రదేశములలో ,అరణ్యములలో ,పర్వతములలో కొండగుహలలో ఉన్న వానరులందరిని కిష్కిన్దాకు తరలించెను . వానర ప్రభ్వయినా సుగ్రీవాజ్ఞను వినగానే వానరులందరూ గడగడ వణుకుచూ కిష్కింధకు పయనమయ్యిరి . 
కాటుక వలే నల్లని వారు మిక్కిలి వేగము కలవారు అయిన మూడు కోట్లమంది వానరులు అంజనాద్రి నుండి రాముడు వున్న ప్రదేశమునకు వచ్చిరి . 
మేలిమి బంగారు రంగు కల వారు అస్తాద్రి అందు నివసించు పది కోట్లమంది అచటికి విచ్చేసిరి . సింహము జూలు వంటి వన్నె కలవారు వేయికోట్లమంది కైలాసపర్వతము నుండి వచ్చిరి . 
హిమవత్పర్వతము ను ఆశ్రయించి వున్న ఫలమూలాదులతో జీవించెడివారు వేలకోట్లమంది వచ్చిరి . 
ఎర్రని దేహము కలవారు భయంకర స్వరూపులు ,భీకరమైన చేష్టలు కలవారు అయిన కోట్లకొలది వానరవీరులు కోట్లకొలదిగా వచ్చిరి . 
కొందరు పాలసముద్రము నుండి వచ్చిరి . వారి ఆహారము కొబ్బరి . వారి సంఖ్య లెక్కించలేనిది . వనములనుండి ,నదీ తీరములనుండి ,వానరసేనలు గుంపులు గుంపులుగా సూర్యకాంతులు కప్పివేయుచు మిక్కిలి వేగముగా వచ్చిపడిరి . 
వానరులను తీసువచ్చుటకు వచ్చిన దూతలు వారు వెళ్లిన చోట కల సుగంధ భరితములైన పూవులు ,ఫలములు ,తదితర వస్తువులు కానుకలుగా తీసుకువచ్చి సుగ్రీవునికి ఇచ్చిరి . వచ్చిన వానరులను చూసి సంతుష్టుడై దూతలు తెచ్చిన కానుకలను సంతోషముతో స్వీకరించెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియేడవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Sunday, 24 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదిఆరవసర్గ

                                రామాయణము 

                            కిష్కిందకాండ -ముప్పదిఆరవసర్గ 

ఆవిధముగా తారామ మాటలకు శాంతించిన లక్ష్మణుని చూసి ధైర్యమును తెచ్చుకున్న సుగ్రీవుడు లక్ష్మణునితో "ఓ మహానుభావా !శ్రీరాముడు మహా వీరుడు ,పరాక్రమవంతుడు ,ఏడుమద్దిచెట్లను ,పర్వతమును ,భూమిని తన బాణములతో చీల్చగల రాముడికి ఎవరి సహాయము అవసరము లేదు అది నిమిత్త మాత్రమూ మాత్రమే . ఆ సదవకాశము నాకు కలుగుట నా అదృష్టము . నేను తప్పక శ్రీరాముని వెనక వుంటాను . శ్రీ రాముని పై కల విశ్వాసము వలన కానీ ,చనువుతో కానీ నేనేమయినా హద్దుమీరి ప్రవర్తించినట్లయితే నన్ను క్షమించుము . "అని పలికెను . 
ఆ మాటలు విన్న లక్ష్మణుడు ప్రేమతో "సుగ్రీవా !తప్పులు చేయుట జీవుల సహజము కానీ ఆ తప్పులను అంగీకరించి క్షమాపణ అడుగుతా మాత్రము అందరికి సాధ్యము కానీ విషయము . ఆ విషయమున నీవు కృతకృత్యుడవు . ఓ వానరరాజా !సోకనిమగ్నుడై ఉన్న శ్రీరాముని పలుకులు విని నేను మిక్కిలి వ్యధ చెందితిని . ఆ వేదన కారణముగా నేను కోపములో నిన్ను నా పరుష మాటలతో బాధించాను . నన్ను క్షమించుము . నీవు వేణు వెంటనే బయలుదేరి నీ మిత్రుడి వద్దకు వచ్చి ఆయనను ఓదార్చుము "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదిఆరవసర్గ సమాప్తము . 

                                   శశి ,

ఎం . ఏ ,ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము కిష్కిందకాండ - ముప్పదియైదవసర్గ

                                      రామాయణము 

                                  కిష్కిందకాండ -       ముప్పదియైదవసర్గ 


ఆ విధముగా పరుషముగా పాట్లాడుతున్న లక్ష్మణుని చూసి సుగ్రీవుడు సమాధానము చెప్పుటకు సైతము ధైర్యము చేయలేకపోయెను . అప్పుడు తార ఎదరకు వచ్చి లక్ష్మణునితో "ఓ మహానుభావా !సౌమిత్రి !నీవు గొప్ప ధర్మాత్ముడవు నీవు ఈ  విధముగా పలుకుట తగదు . పైగా సుగ్రీవుడు వానరారాజు పైపెచ్చు నీకు మిత్రుడు ఆయనతో నీవు ఈవిధముగా పలుకుట తగదు . వాలి భయముతో ఇన్నాళ్లు సుగ్రీవుడు సరి అగు తిండి ,నిద్ర లేక చెట్లవెంట ,పుట్లవెంట తిరుగుతూ రోజులు గడిపెను . ఇప్పుడు ఈ సౌఖ్యములలో పడి సేదతీరుతూ వున్నాడు . ఆయన కృతఘ్నుడు కాడు . 

సుగ్రీవుడు ఈ సౌఖ్యములలో వున్నా ,రామకార్యమును మరువలేదు . సీతాన్వేషణకు అవసరమయితే ప్రత్యర్థి తో యుద్ధము చేయుటకు అవసరమగు సమస్త సైన్యమును సమీకరించు ఏర్పాట్లు ఆయన మునుపే చేసి వున్నారు ఇప్పుడో ఇంకాసేపటికో పెద్దసంఖ్యలో వానర సైన్యము నీ ముందుకు వచ్చును . ఆయన అధీనములో కొన్ని లక్షల సంఖ్యలో వానరములు ,భల్లూకములు ,కొండముచ్చులు వున్నవి . వాటన్నిటిని కూడా ఈ కిష్కిన్దకు రప్పించు ఏర్పాట్లు చేసి వున్నాడు . వారందరి రాక కొరకు ఎదురు చూస్తూనే సుగ్రీవుడు ఈ నగరము కదలలేదు . అంతే తప్ప ఆయన మనసులో మరే చేదు ఆలోచనా లేదు . 
ఇప్పటికే వాలి మరణముతో కిష్కింద రాజ్యములోని స్త్రీలు వృద్దులు అందరూ భీతి చెంది వున్నారు . ఇప్పుడు ఆగ్రహముతో బుసలుకొడుతున్న నిన్ను చూసి ఇంకా భయపడుతున్నారు . కావున విషయము గ్రహించి శాంతించుము , శ్రీరాముని కోసము సుగ్రీవుడు ఏమి చేయటానికైనా సిద్దము . తనరాజ్యమును ,తన భార్య రుమను ,తుదకు తన ప్రాణములు త్యజించుటకు కూడా సుగ్రీవుడు వెనుకాడడు . ఇది సత్యము "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియైదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






Friday, 22 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదినాల్గవసర్గ

                           రామాయణము 

                              కిష్కిందకాండ -ముప్పదినాల్గవసర్గ 

ఎదిరింపశక్యము కాని  వాడు ,నరశ్రేష్ఠుడు ఐన లక్ష్మణుడు క్రుద్ధుడై తన మందిరమునకు ప్రవేశించినంతనే చూచి సుగ్రీవుడు నిశ్చేష్టుడయ్యెను . సుగ్రీవుడు కంగారులో ఒక్క వుదుటన ఎగిరిపడెను . అలంకృతుడైన సుగ్రీవుడి కన్నులు మత్తుచే ఎర్రబడివుండెను . అతడు దోసిలి ఒగ్గి తడబడుచున్నవాడై లక్ష్మణుని సమీపించేను . 
నక్షత్రముల మధ్య చంద్రుడికి వలె స్త్రీల మధ్యలో వున్న సుగ్రీవునితో లక్ష్మణుడు కోపముతో ఇలా అనెను . 
"సుగ్రీవా !ధైర్యశాలి ,మెత్తని స్వభావము కలవాడు ,ఇంద్రియ నిగ్రహము కలవాడు ,సత్యవచనుడు ఐన రాజే ఈ లోకమున గౌరవాదరములకు అర్హుడగును . అధర్మపరుడు ,ఉపకారముచేసిన మిత్రుడికి మాట ఇచ్చి తప్పినవాడు ,ఐన రాజు మిక్కిలి క్రూరాత్ముడుగా పరిగణింపబడును . అశ్వ విషయమున అసత్యము పలికినవాడు ,నూరు అశ్వములను చంపిన పాపము మూటకట్టుకుంటాడు . అట్లే గోమాత విషయమున అసత్యము పలికినవాడు వేయి గోవులను చంపిన పాపము మూటకట్టుకుంటాడు . ఆవిధముగానే తోటి మానవుడికి వాగ్ధానము చేసి తప్పినవాడు ,బంధువులను చంపినవాడితో సమానము . శ్రీరామచంద్రుకి ఇచ్చిన మాట తప్పినచో సకల మనుష్యులను చంపిన పాపము కలుగును . 
బ్రహ్మహత్యకు పాల్పడిన వాడికి ,మద్యపానము చేసినవాడికి ,దొంగకు ,వ్రతభంగమొనర్చినవానికి ప్రాయశ్చిత్తము ద్వారా పాపము నుండి విముక్తి కలుగును . కానీ కృతఘ్నుడికి మాత్రము ఏ విధముగానూ పాపము నుండి విముక్తి కలుగదు . కావున నీవు ఇచ్చిన మాటకు గుర్తుతెచ్చుకుని వెంటనే సీతాన్వేషణకు పనులు ప్రారంభించు "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదినాల్గవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








రామాయణము కిష్కిందకాండ -ముప్పదిమూడవసర్గ

                                 రామాయణము 

                           కిష్కిందకాండ -ముప్పదిమూడవసర్గ 

అంగదుడు లక్ష్మణుని ఆహ్వానించుటకు ఎదురు వెళ్లెను . అంగదుడు లక్ష్మణుని గౌరవంగా లోనికి ఆహ్వానించెను . అంగదుడు కానీ ,ద్వారపాలకులు కానీ ఇతరులయిన వానర వీరులుకాని ఆయనను సమీపించుటకు ధైర్యము చేయలేక దూరంగానే ఉంటిరి . లక్ష్మణుడు అంగదుడి వెనుక ఏడూ ప్రాకారములు దాటెను . వివిధములగు వానరవీరుల భవనములను దాటుతూ సుగ్రీవుడి ఆంతరంగిక మందిరమునకు చేరెను . అది చాలా వైభవోపేతముగా ఉండెను . అచట అనేకమైన స్త్రీలు కలరు . వారు ఎంతో విలువకల ఆభరణము వడ్డాణములు ధరించి వున్నారు . లోపలినుండి కాళీ అందేలా సవ్వడి విని లక్ష్మణుడు లోపలకు వెళ్ళుటకు సంకోచించి దూరముగా ఒక చోట నిలబడెను . స్త్రీల అందేలా చప్పుడు విన్న లక్ష్మణునికి కోపము రెట్టింపయ్యేను . అంత అతడు కోపముతో ధనుష్టంకారము చేసెను . 
ఆ చప్పుడు విన్న సుగ్రీవుడు ఉలిక్కిపడి ఆసనము పైనుండి లేచెను కానీ లక్ష్మణుని ఎదుటకు వచ్చుటకు ధైర్యము చాలక ,తారను లక్ష్మణుని వద్దకు వెళ్లి ఆయనను శాంతింపచేయమని ,మహాత్ములు స్త్రీలపై కోపము ప్రదర్శించరని పలికి ఆమెను పంపెను . సుగ్రీవుడి ఆజ్ఞపై తార లక్ష్మణుని వద్దకు వచ్చి ,ముందుగా ఆయనను ప్రసన్నుండిని చేసుకొని ,కోపము విడిచి శాంతించమని ప్రార్ధించి ,సుగ్రీవుడి తప్పిదాన్ని క్షమించమని కోరెను . పిమ్మట ఆమె సుగ్రీవుడు సీతాన్వేషణకు పనులు ప్రారంభించెనని లక్ష్మణునితో పలికెను వానరవీరులను కిష్కింధకు రావలిసిందిగా దేశమంతా వర్తమానము సుగ్రీవుడు పంపాడని ,వేలాదిగా కిష్కింధకు వాంతారా వీరులు వచ్చుచున్నారని తెలిపెను . 
అప్పుడు లక్ష్మణుడు కొంత శాంతించెను . ఆమె ఆహ్వానము తో సుగ్రీవుడు వున్నా మందిరంలోకి ప్రవేశించేను . అచట సుగ్రీవుడు పీడా ఆసనంపై సకల ఆభరణములతో దేవేంద్రుని వలే  ఆసీనుడై వున్నాడు . ఆయన చుట్టూ వేలాదిగా స్త్రీలు వున్నారు . అదంతా చూసిన లక్ష్మణుడికి కోపము పెరిగెను . అలా మిక్కిలి కోపముతో ఎర్రబడిన పెద్దపెద్ద కనులతో వున్న లక్ష్మణుని సుగ్రీవుడు చూసేను . 

 రామాయణము కిష్కిందకాండ ముప్పదిమూడవసర్గ సమాప్తము . 

                                  శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .