Sunday 24 February 2019

రామాయణము కిష్కిందకాండ - ముప్పదియైదవసర్గ

                                      రామాయణము 

                                  కిష్కిందకాండ -       ముప్పదియైదవసర్గ 


ఆ విధముగా పరుషముగా పాట్లాడుతున్న లక్ష్మణుని చూసి సుగ్రీవుడు సమాధానము చెప్పుటకు సైతము ధైర్యము చేయలేకపోయెను . అప్పుడు తార ఎదరకు వచ్చి లక్ష్మణునితో "ఓ మహానుభావా !సౌమిత్రి !నీవు గొప్ప ధర్మాత్ముడవు నీవు ఈ  విధముగా పలుకుట తగదు . పైగా సుగ్రీవుడు వానరారాజు పైపెచ్చు నీకు మిత్రుడు ఆయనతో నీవు ఈవిధముగా పలుకుట తగదు . వాలి భయముతో ఇన్నాళ్లు సుగ్రీవుడు సరి అగు తిండి ,నిద్ర లేక చెట్లవెంట ,పుట్లవెంట తిరుగుతూ రోజులు గడిపెను . ఇప్పుడు ఈ సౌఖ్యములలో పడి సేదతీరుతూ వున్నాడు . ఆయన కృతఘ్నుడు కాడు . 

సుగ్రీవుడు ఈ సౌఖ్యములలో వున్నా ,రామకార్యమును మరువలేదు . సీతాన్వేషణకు అవసరమయితే ప్రత్యర్థి తో యుద్ధము చేయుటకు అవసరమగు సమస్త సైన్యమును సమీకరించు ఏర్పాట్లు ఆయన మునుపే చేసి వున్నారు ఇప్పుడో ఇంకాసేపటికో పెద్దసంఖ్యలో వానర సైన్యము నీ ముందుకు వచ్చును . ఆయన అధీనములో కొన్ని లక్షల సంఖ్యలో వానరములు ,భల్లూకములు ,కొండముచ్చులు వున్నవి . వాటన్నిటిని కూడా ఈ కిష్కిన్దకు రప్పించు ఏర్పాట్లు చేసి వున్నాడు . వారందరి రాక కొరకు ఎదురు చూస్తూనే సుగ్రీవుడు ఈ నగరము కదలలేదు . అంతే తప్ప ఆయన మనసులో మరే చేదు ఆలోచనా లేదు . 
ఇప్పటికే వాలి మరణముతో కిష్కింద రాజ్యములోని స్త్రీలు వృద్దులు అందరూ భీతి చెంది వున్నారు . ఇప్పుడు ఆగ్రహముతో బుసలుకొడుతున్న నిన్ను చూసి ఇంకా భయపడుతున్నారు . కావున విషయము గ్రహించి శాంతించుము , శ్రీరాముని కోసము సుగ్రీవుడు ఏమి చేయటానికైనా సిద్దము . తనరాజ్యమును ,తన భార్య రుమను ,తుదకు తన ప్రాణములు త్యజించుటకు కూడా సుగ్రీవుడు వెనుకాడడు . ఇది సత్యము "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియైదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 






No comments:

Post a Comment