Friday 22 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదినాల్గవసర్గ

                           రామాయణము 

                              కిష్కిందకాండ -ముప్పదినాల్గవసర్గ 

ఎదిరింపశక్యము కాని  వాడు ,నరశ్రేష్ఠుడు ఐన లక్ష్మణుడు క్రుద్ధుడై తన మందిరమునకు ప్రవేశించినంతనే చూచి సుగ్రీవుడు నిశ్చేష్టుడయ్యెను . సుగ్రీవుడు కంగారులో ఒక్క వుదుటన ఎగిరిపడెను . అలంకృతుడైన సుగ్రీవుడి కన్నులు మత్తుచే ఎర్రబడివుండెను . అతడు దోసిలి ఒగ్గి తడబడుచున్నవాడై లక్ష్మణుని సమీపించేను . 
నక్షత్రముల మధ్య చంద్రుడికి వలె స్త్రీల మధ్యలో వున్న సుగ్రీవునితో లక్ష్మణుడు కోపముతో ఇలా అనెను . 
"సుగ్రీవా !ధైర్యశాలి ,మెత్తని స్వభావము కలవాడు ,ఇంద్రియ నిగ్రహము కలవాడు ,సత్యవచనుడు ఐన రాజే ఈ లోకమున గౌరవాదరములకు అర్హుడగును . అధర్మపరుడు ,ఉపకారముచేసిన మిత్రుడికి మాట ఇచ్చి తప్పినవాడు ,ఐన రాజు మిక్కిలి క్రూరాత్ముడుగా పరిగణింపబడును . అశ్వ విషయమున అసత్యము పలికినవాడు ,నూరు అశ్వములను చంపిన పాపము మూటకట్టుకుంటాడు . అట్లే గోమాత విషయమున అసత్యము పలికినవాడు వేయి గోవులను చంపిన పాపము మూటకట్టుకుంటాడు . ఆవిధముగానే తోటి మానవుడికి వాగ్ధానము చేసి తప్పినవాడు ,బంధువులను చంపినవాడితో సమానము . శ్రీరామచంద్రుకి ఇచ్చిన మాట తప్పినచో సకల మనుష్యులను చంపిన పాపము కలుగును . 
బ్రహ్మహత్యకు పాల్పడిన వాడికి ,మద్యపానము చేసినవాడికి ,దొంగకు ,వ్రతభంగమొనర్చినవానికి ప్రాయశ్చిత్తము ద్వారా పాపము నుండి విముక్తి కలుగును . కానీ కృతఘ్నుడికి మాత్రము ఏ విధముగానూ పాపము నుండి విముక్తి కలుగదు . కావున నీవు ఇచ్చిన మాటకు గుర్తుతెచ్చుకుని వెంటనే సీతాన్వేషణకు పనులు ప్రారంభించు "అని పలికెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదినాల్గవసర్గ సమాప్తము . 

                            శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 








No comments:

Post a Comment