Friday, 1 May 2020

రామాయణము యుద్ధకాండ --------- నూటఅయిదవ సర్గ

                                          రామాయణము 

                                          యుద్ధకాండ --------- నూటఅయిదవ సర్గ 

రణగర్వితడైన రావణుడు  మిక్కిలి కోపంతో  శ్రీ  రాముడి పై బాణ వర్షమును కురిపించెను .  శ్రీ  రాముడు  రావణుని పై శరవర్షమును కురిపించెను .  ఆకాశమంతయు  వీరి బాణములచే  కప్పబడి  రణరంగము  అంధకారమయ్యెను .  అందువలన  కోపావేశపరులై యుద్ధము చేయుచున్న  రామరావణులిరువులు  ఒకరికి ఒకరు  కనపడకుండిరి . అపుడు శ్రీ రాముడు  రావణుడితో  రాక్షసాధమ ! దండకారణ్యములో  నేను దూరముగా ఉన్నప్పుడు   దీనురాలైయున్న  వైదేహిని  బలవంతంగా  తీసుకు వచ్చితివి  అయినను  నిన్ను నీవు శూరుడిగా భావించుచుండివి . నిస్సహాయ స్థితిలో ఉన్న  పరసతులయందు అమర్యాదగా ప్రవర్తించువాడా!  గర్వంతో కన్నూ మిన్నూ  కానక,  నీ మృత్యువును నీవే కొనితెచ్చుకొంటివి.   నీవు చేసిన దుష్కార్యమునకు   తగిన ఫలితము  ఇప్పుడే పొందగలవు . దుష్టుడా  దొంగ  వలే  సీత ను  అపహరించిన నీకు  ఏమాత్రము  సిగ్గు లేదు  . నీవు బలవంతంగా  సీతను అపహరించుపోవునపుడు  నేను అక్కడే ఉండివుంటే  అప్పుడే  నా శరములకు బలియై  నీ సోదరుడు ఖరునివద్దకు  చేరెడివాడవు .  నీచుడా!  నీ పాపము పండి  ఇప్పుడు నా కంటపడితివి  . ఇప్పుడే నీ శిరస్సును  నా బాణపరంపరతో  ముక్కలుముక్కలై  చెల్లాచెదురుగా  పడిపోవునట్లు  చేసెదను"  అని  పలికి  రావణుడి పై శరవర్షము  కురిపించెను  . శ్రీ రాముడు  వేగంగా  అస్త్రములను ప్రయోగించుటలో  మునపటికంటెను  పటిమ అధికమయ్యెను . రావణుడు ధనుస్సు  లాగి  శస్త్రములను  వేయలేకపోయెను  . శ్రీ రాముని పరాక్రమము ను  ఎదిరింపలేకపోయెను . పూనిక వహించి  ఎలాగోలా  రామునిపై  వివిధ శస్త్రములు  ప్రయోగించుచున్నప్పటికీ , అవసానదశ  దగ్గర పడుటచే  అవి శ్రీ రాముని తాక  లేక పోయెను . అపుడు  రావణుని రధ సారధి  రావణుడి దురవస్థ  గ్రహించి  . నెమ్మదిగా  రధముని పక్కకు మళ్లించెను . 



రామాయణము -----------యుద్ధకాండ ---------------నూటఅయిదవసర్గ -----------------సమాప్తము --------------

శశి,

ఎం.ఏ, ఎం.ఏ,(తెలుగు) , తెలుగుపండితులు . 















రామాయణము యుద్దకాండ ---------నూటనాల్గవసర్గ

                                         రామాయణము 

                                          యుద్దకాండ ---------నూటనాల్గవసర్గ 

శ్రీ రాముడు కోపంతో ఉండగా అయన భీకర ముఖమును చూసి ప్రాణులన్నియూ గడగడా వణికిపోయెను . భూమి కంపించెను . త్రికూట పర్వతము చలించెను . సముద్రుడు క్షోభకు గురి అయ్యెను . ఆకాశమునందు అశుభ సూచకంగా పక్షులు , మిగుల భీతితో తీవ్రముగా అరుచుచు అటు ఇటు తీరుగసాగేను . దారుణ మైన ఆ అపశకునములను  చూసి ప్రాణులన్నియూ భయముతో వణికి పోయెను . రావణుడి గుండెలో దడపుట్టెను . యుద్ధము చూచుటకు  వఛ్చిన సకల సురాసురులు ఆ మహారణమును కుతూహలంతో శ్రద్ధతో చూస్తుండిరి . అక్కడ ఉన్న అసురులు రావణునకు జయజయము అనెను . దేవతలు శ్రీ రామచంద్రప్రభువుకు జయముజయము అని పదేపదే పలుకుచుండిరి . 
రావణుడు ఒక శూలముని రామునిపై ప్రయోగించెను . రాముడు  మాతలి ద్వారా  ఇంద్రుడు పంపిన శక్తితో  తన వైపు దూసుకు వస్తున్న శూలమును భగ్నముచేసెను .   పిమ్మట  శ్రీరాముడు వాడిఐన  శరములతో  రావణుని రధాశ్వములను కూల్చి వేసెను . పిమ్మట  మూడు బాణములచే  రావణుని వక్షస్థలమందు  లలాటమునందు  కొట్టెను .  రాముని బాణపరంపరకు  రావణుని  అవయవములన్ని  గాయపడి  అతని శరీరము నుండి  రక్తము కారసాగెను . ఆ రక్తముతో అతడు తడిసిపోయెను  అప్పుడు రావణుడు  మిక్కిలి ఖిన్నుడై పట్టరాని అసహనంతో  ఊగిపోయెను . 




రామాయణము ----------యుద్ధకాండ -----------నూటనాల్గవసర్గ ------------సమాప్తము -------------------------





శశి , 

ఎం.ఏ , ఎం.ఏ,(తెలుగు ) , తెలుగుపండితులు . 








రామాయణము యుద్ధకాండ -------నూటమూడవసర్గ

                                        రామాయణము 

  

                                      యుద్ధకాండ -------నూటమూడవసర్గ 

పరాక్రమశాలి  శత్రుసంహారదక్షుడు  ఐన  శ్రీ రాముడు  లక్ష్మణుని పలుకులు విని వెంటనే తన ధనస్సును  చేబూని రావణుని పై శరములను  ప్రయోగించెను . రాక్షస రాజైన రావణుడు మరొక రధాన్ని అధిరోహించి శ్రీ రాముడి పై బాణములు వేసెను . శ్రీ రాముడు భూమి మీద ఉండి రావణుడు రథముపై ఉండి  యుద్ధము చేయుట  సరికాదని దేవ, గాంధర్వ,దానవులు , తమలో తాము అనుకొనిరి . 
అప్పుడు దేవతల ప్రభవైన  ఇంద్రుడు తన రధమును తీసుకు పోయి  శ్రీరామునికి అప్పగింపుమని  సారధియైన మాతలిని ఆదేశించెను .  ఆ రధము యొక్క భాగములన్నీ బంగారముతో నిర్మితములై అనేక చిరు గంటలతో అలంకరించి ఉండెను . దానికి పూంచిన అశ్వములు దివ్యములు అవి బంగారు శిరో  భూషణములు కలిగి యున్నవి . వాటికి తెల్లని వింజామరలు  అమర్చబడియున్నవి  . ఇంద్రుని యొక్క ఆదేశానుసారం మాతలి ఆ దివ్య రధమును ఎక్కి దివి నుండి భువికి చేరి శ్రీ రాముని సమక్షమున నిల్చెను . మాతలి శ్రీ రామునికి ప్రణమిల్లి ఆయనతో "దివ్యగుణ సంపన్నా! శత్రుసంహారక  రామా ! ఈ యుద్ధమున మీ విజయమునకై  దేవేంద్రుడు  ఈ రధమును పంపెను . దీనితో పాటుగా ఈ మహాధనస్సును , అగ్ని జ్వాలల వలే మిరుమిట్లు గొలుపు చున్న ఈ కవచమును , సూర్యకిరణములవలె కాంతులీనుచున్న ఈ శరములను వాఢియైన  ఈ శక్తి ఆయుధమును దేవేంద్రుడే మీకు సమర్పించెను . మహా వీరుడవైన ఓ ప్రభూ! ఈ రధమును అధిరోహింపును . నేను నీకు సారధిగా వుండుదును రావణుడిని జయింపుము" . మాతలి ఇలా విన్న పించిన పిమ్మట శ్రీ రాముడు  మిక్కిలి గౌరవముతో ఆ రధమును ప్రదక్షిణ కావించి దాన్ని అధిరోహించెను . 
పిమ్మట శ్రీ రాముడికి రావణునికి మధ్య గగుర్పాటును కూర్చుంటువంటి సంకుల సమరం జరిగింది . రాముడు రావణుడు ప్రయోగించిన గంధర్వాస్త్రమును  గంధర్వాస్త్రముతోను ,దివ్యాస్త్రమును దివ్యాస్త్రముతోను భగ్నము చేసెను . పిమ్మట దుష్టుడైన రావణుడు మిక్కిలి కోపంతో అతి భయంకర మైన రాక్షసాస్త్రంను ప్రయోగించెను . ఆ అస్త్రము సర్పముల వలే మహా విషపూరితమై తమ పడగల పై గల మణులతో దశదిశలా వ్యాపించెను . వెంటనే శ్రీ రాముడు గరుడాస్త్రము ప్రయోగించెను. ఆ అస్త్రము నుండి గరుడ రూపములు బంగారు రెక్కలు కలిగి రాక్షసుడు ప్రయోగించిన అస్త్రము నుండి వెలువడిన నాగులను సంహరించెను . ఆలా తన అస్త్రములన్ని వ్యర్ధమై పోవుటచే రావణుడు మిక్కిలి కోపంతో శ్రీ రాముడిపై  బాణములను వర్షములా కురిపించసాగెను . 
రావణుడు తన బాణముతో మాతలిని గాయపరిచేను. రధ  ధ్వజమును ముక్కలు చేసెను . రధమునకు కట్ట బడిన  ఇంద్రాశ్వములను కూడా  గాయపరిచెను .  రావణుడి యొక్క యుద్ధ తీవ్రతను చూసిన దేవ , దానవ , గంధర్వులు, విచారమునకు లోనయ్యిరి . సిద్దులు మహర్షులు , వానర ప్రముఖులు విభీషణాదులు శ్రీ రాముని చూసి మిక్కిలి వ్యధచెందిరి . రావణుడు వరుసగా బాణములను ప్రయోగించుటచే దెబ్బ తినిన శ్రీ రాముడు శరములను సంధింప లేక పోయెను . అప్పుడు శ్రీ రాముడు కోపంతో కన్నులు ఎర్ర చేసెను . 



రామాయణము ---------యుద్ధకాండ ----------నూటమూడవసర్గ --------------సమాప్తము . 




శశి ,

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు ), తెలుగుపండితులు . 























రామాయణము యుద్ధకాండ ------- నూటరెండవసర్గ

                                 రామాయణము 

                             యుద్ధకాండ ------- నూటరెండవసర్గ 

శ్రీ రాముడు  రావణునితో యుద్ధం చేయుచునే సుషేణునితో ఇలా పలికెను "వీరుడైన లక్ష్మణుని దురావస్తమును చూసి శోకము ఇనుమడించుచున్నది ఇతడు నాకు ప్రాణముల కంటే ఎంతో ఇష్టమైన వాడు . ఇట్టి స్థితిలో నేను యుద్ధము ఎలా చేయగలను శుభ లక్షణ సంపన్నుడైన నా తమ్ముడు యుద్ధము చేయుటలో వాసికి ఎక్కినవాడు . ఒక వేళ అట్టి ఈ వీరుడు ప్రాణములను కోల్పోయిన చొ  నాకు సుఖములతో పనియేమి . అంతేగాదు ఇప్పుడు యుద్ధము తో గాని, సీతతో కానీ  కడకు ప్రాణములతో గాని ఏ దేశము నందైనను  భార్య లభించవచ్చు , బంధువులు లభించవచ్చు , కానీ లక్ష్మణుని వంటి సోదరుడు లభించడు . "అని పలికెను . 
అపుడు  కపి వీరుడైన సుషేణుడు శ్రీ రామా !ముద్దులొలికేడి  ఈ లక్స్మనుడు అసువులు వీడలేదు . ఇతని ముఖము వికృతము కాలేదు . కాంతి తగ్గలేదు , ఈయన ముఖము జీవ కళతో ప్రసన్నముగా ఉన్నది . ప్రాణములు కోల్పోఎడి  వారి రూపము ఇలా ఉండదు . కొంచంకూడా విషాదానికి లోనుకావద్దు ఇతడు కేవలం క్షతగాత్రుడై భూమి పై పది ఉన్నాడు . శ్వాస ఆడు చున్నది . ఇతని గుండె బాగుగా కొట్టుకొనుచున్నది . ఇతడు  సజీవుడై వున్నాడనుటకు ఇవన్నీ లక్షణములు . "అని పలికి పక్కనే ఉన్న హనుమంతునితో  "బుద్ది  శాలి  వెంటనే బయలు దేరి ఓషధి పర్వతము వద్దకు  వెళ్ళు  ఆ పర్వతము యొక్క  దక్షిణ శిఖర బాగాన ఉన్న  విశల్యకరని (శరీరమునందు నాటుకొనిన  బాణములను తొలగించి గాయములను మానేలా చేసేది . )  సవర్ణకరని (శరీర కాంతిని సహజ స్థితికి తెచ్చునది ). సంజీవని  స్పృహ లోకి తెచ్చి చైతన్యము కూర్చునది . సంధాన కరణి  (విరిగిన ఎముకులను జోడించునది) . అను ప్రసిద్ధములైన  పరమౌషధములను తీసుకొని త్వరగా రమ్ము  మహాత్ముడైన వీరుడు  , లక్ష్మణుడు చైతన్య వంతుడగుటకు  ఈ ఔషదాలేంతో సహాయ పడతాయి అని పలికెను . " 
సుషేణుడు ఈ విధముగా పలికిన వెంటనే  హనుమంతుడు వాయు వేగంతో ఓషదిపర్వతమును చేరెను . కానీ హనుమ అచ్చడి దివ్య ఔషదములను గుర్తించ లేక  కొంత సేపు చింతా గ్రాంతుడయ్యెను . వెంటనే మారుతికి ఆ గిరి శిఖరముని పూర్తిగా పెల్లగించి  తీసుకు వెళ్ళవలననే చక్కని ఆలోచన తట్టెను . వెంటనే హనుమ బాగుగా వికసించిన పువ్వులు గల వృక్షములతో నిండిన  ఆ గిరి శిఖరమును పెల్లగించి తన చేతి పై నిలుపుకొనెను . పిమ్మట హనుమ మహా వేగముతో యుద్ధ భూమికి చేరి ఆ గిరి శిఖరంను తన సేనల మధ్య ఉంచెను . పిదప ఆ మారుతి కొంత విశ్రమించి సుషేణునితో "వానరోత్తమా మీరు చెప్పిన ఓషధులను నేను గుర్తించలేక పోయితిని , కనుక పూర్తిగా ఆ శిఖరమునే తీసుకువచ్చితిని అని పలికెను . "
సుషేణుడు  హనుమను పొగిడి పర్వతము నుండి  ఓషధములను  తీసుకుండెను . హనుమంతుడు చేసిన ఈ కార్యము దేవతలకు కూడా అసాధ్యమైనది . అట్టి అద్భుత కార్యమును చూసి యుద్దభూమి యందున్న  వానరులు రాక్షసులు మిక్కిలి ఆశ్చర్య పడిరి .  పిమ్మట సుషేణుడు ఆ ఓషదములను చక్కగా నూరి  లక్ష్మణుని ముక్కు దగ్గర ఉంచెను . స్పృహ లేకుండా పడి  ఉన్న లక్ష్మణుడు ఆ వాసన పీల్చిన వెంటనే  గాయములు మాని పూర్తి ఆరోగ్యవంతుడై  నిద్రనుండి లేచినట్లుగా లేచి కూర్చుండెను . అది చూసిన వానరులు బాగు బాగు అని సుషేణుడిని పొగిడిరి . 
శ్రీ రాముడు ఆనంద  బాష్పములు రాల్చుతూ లక్ష్మణుడిని కౌగిలించుకొనెను . అపుడు శ్రీ రాముడు లక్ష్మణునితో "తమ్ముడా ! నా అదృష్టము కొద్దీ పునర్జన్మ ఎట్టి వచ్చిన నిన్ను చూస్తున్నాను నీవు మరణించిన చొ నా విజయమునకు అర్ధమే ఉండదు . అంటే కాదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణములతో కానీ ఏమి ప్రయోజనము ఉండదు . అని పలికెను అపుడు లక్ష్మణుడు అన్నా !సత్పురుషులు ప్రతిగ్యా భంగములకు పాల్పడరు. ప్రతిజ్ఞ పాలన మహా పురుషుల లక్షణము కదా నా కారణముగా నీవు నిరాశకు లోను కావద్దు . రావణుని వధించుట ద్వారా సీతాదేవికి చేరనుంది విముక్తి కలిగించెదను . అను నీ ప్రతిజ్ఞను పాలించుము . ఆ దుర్మార్గుడిని అతి శీఘ్రముగా వధించవలనని నా ఆకాంక్ష . రావణుడిని వధించి  విభీషణుడిని పట్టాభిషిక్తుణ్ణి చేసి , సీతా దేవికి  విముక్తిని కలిగించెదను అనే నీ ప్రతిజ్ఞను నిలబెట్టు కొనుటకై  వెంటనే రావణుడిని పరిమార్చుము అని పలికెను . 

రామాయణము ------యుద్ధకాండ -------నూటరెండవ సర్గ ----------- సమాప్తము 






        శశి , 
ఎం.ఏ ఎం.ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 

        

































Thursday, 30 April 2020

రామాయణము యుద్ధకాండ -------నూటయొకటవ సర్గ

                                  రామాయణము 

   

                         యుద్ధకాండ -------నూటయొకటవ సర్గ 

తన అసురాస్త్రము నిర్వీర్య మై పోవుట చే రావణుడు  రౌద్రము (మయుడిచే నిర్మింప బడిన అస్త్రము) ను శ్రీ రాముడి పై ప్రయోగించెను . శ్రీ రాముడు గాంధర్వం అనే అస్త్రము తో రౌద్రాస్త్రమును ముక్కలు చేసెను . అది చూసిన రావణుడు కోపము తో  సౌరాస్త్రము ప్రయోగించెను . రాముడు తన బాణ పరంపర తో  ఆ అస్త్రమును కూడా ఛేదించెను . 
రావణుడు పది బాణములతో శ్రీ రాముడి ఆయువు పట్టుల యందు కొట్టెను .  శ్రీ రాముడు మిక్కిలి కోపంతో పది బాణములతో రావణుని యొక్క వివిధ అవయవములపై గట్టిగా కొట్టెను . అపుడు లక్ష్మణుడు మానవ కపాల చిహ్నముగల రావణుని యొక్క ధ్వజమును తన బాణములతో ముక్కలు చేసెను . రావణుని రధసారధి చెవులకు ధరించిన  బంగారు కుండలములు లక్ష్మణుడు ఒకే బాణముతో ఖండించెను . పిమ్మట రావణుని ధనస్సును కూడా ముక్కలు చేసెను . 
రావణుడు తన ధనస్సు ముక్కలైపోవుటచే క్షణ కాలము పాటు ఏమీ తోచక  ఊరకుండెను . అప్పుడు విభీషణుడు పైకెగిరి రావణుని అశ్వాలను తన గదతో సంహరించెను . అప్పుడు రావణుడు వెంటనే తన రధమునుండి కిందకు దూకి  ఒక బల్లెమును విభీషణుని పైకి విసిరెను .  ఆ బల్లెము విభీషణుడిని చేరక ముందే లక్ష్మణుడు దానిని ఖండించివేసెను . అపుడు యుద్ధరంగమున వానరుల కోలాహలం చెలరేగింది . పిమ్మట రావణుడు విభీషణుని  చంపుటకు మరొక బల్లెము పైకి ఎత్తగ అది చూసిన లక్ష్మణుడు  రావణుని పై బాణ వర్షమును కురిపించెను . తన మీదకు వచ్చిపడుతున్న బాణాలను తట్టు కొనలేక విభీషణుణ్ణి చంపే ప్రయత్నమును రావణుడు విరమించుకుండెను . 
అప్పుడు రావణుడు లక్ష్మణుని పై శక్త్తి అను ఆయుధమును ప్రయోగించి పెద్దగా గర్జించెను  అపుడు శ్రీ రాముడు వేగముగా వచ్చుచున్న ఆ శక్తి ఆయుధమునకు నమస్కరించి "ఓ శక్తీ ఆయుధమా లక్ష్మణునకు శుభమగుగాక !నీ లోగల ప్రాణహరణ శక్తి నశించు గాక " అని పలికెను . అంతలో ఆ శక్తి ఆయుధము లక్ష్మణుని వక్షస్థలమున లోతుగా నాటుకొనుటచే లక్ష్మణుడు నేల పై పడిపోయెను . 
అది చూసిన శ్రీ రాముడు కోపముతో బాధతో రావణుని వధించుటకు గట్టి పూనిక తో నిశ్చయించుకొనెను. రావణుడు తీవ్రముగా కొట్టుచుట చే  ఆ శక్తి  లక్ష్మణుని గుండెలను  చీల్చుకొని అవతలకు వెళ్లి భూమికి గుచ్చుకొనెను . అక్కడి వానర ప్రముఖులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ లక్ష్మణుని శరీరమునుండి ఆ శక్తిని బయటకు లాగలేక పోయిరి అపుడు బలశాలి అయిన రాముడు భయంకరమైన ఆ శక్తిని తన రెండు చేతులతో పట్టుకొని బయటకులాగి దానిని విరిచివేసెను . స్పృహ తప్పి పడి  ఉన్న లక్ష్మణుని   చూసి  అతడిని కౌగలించుకొని శ్రీ రాముడు హనుమంతునితో ఇలా పలికెను . "కపివరులారా !  మీరు లక్ష్మణుని  చుట్టూ చేరి  ఇతడిని జాగ్రత్తగా చూసుకొనండి పాపాత్ముడు , క్రూరాత్ముడు అయిన  ఈ దశ గ్రీవుని సంహరించుటకు ఎప్పుడో సంకల్పించాను . ఇప్పుడు ఆ సమయము ఆసన్నమయింది . ఓ వానరులారా !ఇప్పుడే మీ ముందు సత్య ప్రతిజ్ఞ   చేయుచుఁన్నాను ఈ లోకంలో రావణుడో  రాముడో ఎవరో ఒకరే నిలిచి ఉండుట తధ్యము దీనిని మీరు త్వరలోనే చూడగలరు . " అని పలికెను. 
వానరులతో ఇలా పలికిన పిమ్మట శ్రీ రాముడు  యుద్ధ సన్నద్దుడై తన బాణములతో  రావణుని కొట్టెను . రావణుడు కూడా శ్రీ రాముని పై అనేక బాణములను వర్షింప చేసెను . రామరావణులు  ఒకరినొకరు  వధింపవలననే పూనికతో  ప్రయోగించుచున్న బాణములు  పరస్పరము  ఢీకొనుచుండగా  భీకర ధ్వనులు ఏర్పడుచుండెను . శ్రీ రాముని యొక్క బాణములు వరసగా తనపై వఛ్చి పడుతుండటం చే  రావణుడు  మిక్కిలి పీడితుడై  పెనుగాలికి తట్టు కోలేని  మేఘమువలె  భయముతో  పరుగులు తీసెను . 





రామాయణము ----యుద్ధకాండ ------నూటయొకటవ సర్గ -------సమాప్తము . 



శశి . 

ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు ) తెలుగు పండితులు . 












రామాయణము యుద్ధకాండ -నూఱవ సర్గ

                                        రామాయణము 

             

                                యుద్ధకాండ -నూఱవ సర్గ 

మహోదర మహాపార్శ్వులు మరణించుట చూసిన  రావణుడు కోపంతో రధమును ముందుకు నడుపమని సారథికి ఆజ్ఞాపించెను  . అప్పుడు రావణుడు తన సారధితో" ఆ రామ లక్ష్మణులను , హతమార్చి మన లంకా పుర వాసుల దుఃఖమును తొలగించెదను . "అని పలికెను. 
 రావణుడు రథముపై వేగంగా శ్రీ రాముడి వద్దకు వెళ్లుచుండగా అతడి రథచక్ర ఘోషలు నలు దిశలా వ్యాపించెను . వానర సైన్యము వద్దకు వచ్చిన రావణుడు తామసాస్త్రమును ప్రయోగించెను. బ్రహ్మ దేవుడు స్వయముగా నిర్మించిన ఆ అస్త్రము  వానరులను దహించి వేయ సాగింది . ఆ ప్రభావము తట్టుకొనలేక ఎటువారటు పారిపోయిరి . అప్పుడు రావణుడు శ్రీ రాముడను చూసి ఆయనతో  యుద్ధము చేయుటకై శ్రీ రాముని వైపుగా వెళ్లసాగెను . 
రావణుని రదము తన వైపుకు వచ్ఛుట చూసిన శ్రీ రాముడు ధనుష్టంకారము  చేసెను . ఆ శబ్దము భూమిని బద్దలు చేయునట్టుగా  ఉండెను . అప్పుడు లక్ష్మణుడు   రావణునితో  ముందుగా యుద్ధము చేయ దల్చి రావణునిపై బాణములను ప్రయోగించెను . వాటిని రావణుడు తన బాణములతో ఆకాశము లోనే ముక్కలు  చేసెను . పిమ్మట రావణుడు శ్రీ రాముడపై బాణముల వర్షము కురిపించెను . శ్రీ రాముడు వాటిని మధ్యలోనే ముక్కలు చేసెను . పిమ్మట శ్రీ రాముడు రావణునిపైన రావణుడు శ్రీ రాముడి పైన పరస్పరము వివిధ రకములైన  శరములను అతివేగముతో ప్రయోగించిరి . అయినను వారిలో ఎవ్వరు పరాజితులు కాకుండిరి . తీవ్రమైన వారిరువురి  యుద్ధ రీతులకు ప్రాణులన్నియూ  భయపడ సాగెను . 
రావణుడు రెచ్చిపోయిన  సర్పమువలె బుసలు కొడుతూ అసురాస్త్రము ద్వారా సింహ ములు , పెద్ద పులులు, రాబందులు, డేగలు, కాకులు, గ్రద్దలు, నక్కలు,తోడేళ్ళు , ఐదుతలలు గల సర్పములు, కుక్కలు, కోళ్లు, వరాహములు, గాడిదెలు,ముసళ్ళను  , కోళ్లు,మొదలగు ప్రాణుల యొక్క ముఖముల ఆకారములో ఉన్న బాణములను సృష్టించి శ్రీ రాముని దెబ్బ తీయుటకై ప్రయోగించెను . 
అది చూసియాసిన  శ్రీ రాముడు ఆగ్నేయాస్త్రము ద్వారా మండుతున్న అగ్ని , ప్రకాశిస్తున్న సూర్య చంద్రులు , అర్ధచంద్రుడు తోక చుక్కలు , నక్షత్రాలు ఉల్కలు , గ్రహములు, మెరుపుతీగలు, మొదలైన, వానివలె మెరయుచున్న పదునై న  బాణములనుఁ సృష్టించి రావణుడిపై ప్రయోగించెను . 
రావణు ని ఘోరభాణములు , శ్రీ రాముని ఆగ్నేయాస్త్రము దాటికి ఆకాసములోనే ముక్కలైపోయెను . అది చూసిన సుగ్రీవాది వానర ప్రముఖ వీరులందరు సంతోషముతో శ్రీ రాముని చుట్టూ చేరి కోలాహలధ్వనులు కావించిరి దిక్కులు పిక్కటిల్లు నట్లు  జయజయ ధ్వనులు  కావించెను. 




రామాయణము --- యుద్ధ కాండ----- నూఱవసర్గ -------సమాప్తము. 




శశి ,

ఎం.ఏ ఎం.ఏ  (తెలుగు ), తెలుగు పండితులు. 




Friday, 3 April 2020

రామాయణమ- యుద్ధకాండ -తొంబదితొమ్మిదవ సర్గ

                                       రామాయణము 

                                   యుద్ధకాండ       -     తొంబదితొమ్మిదవ సర్గ 

సుగ్రీవుడి చేతిలో మహోదరుడు మరణించుట చూసి మిక్కిలి బల శాలి అయిన మహాపార్శ్వుడు కోపంతో , అంగదుడి సైన్యమును తన బాణములతో హింసించ సాగెను  .  వేగంగా వీచే గాలికి తొడిమెల  నుండి ఫలములు రాలి పడిపోయినట్లు ఆ రాక్షసుని బాణముల దాటికి  ప్రముఖులైన వానర యోధుల శిరస్సులు  శరీరముల నుండి  వేరై  రణభూమి అంతటా పడిపోయెను . మహాపార్శ్వుని  బాణపరంపర  కు  దెబ్బ తినిన  ఆ వానరులు  దాదాపు స్పృహలేని స్థితికి గురిఅయి విషాద గ్రస్తులై యుద్ధ విముఖులైరి .  
అపుడు తన బలములు భీతిల్లుట చూసిన అంగదుడు పున్నమినాటి సముద్రుడివలె విజృంభించెను . మహాపార్శ్వుడు, వాలిసుతుడు ఆ  సమరభూమి అందు  మిక్కిలి భీకరముగా  యుద్ధముచేసిరి  ఆ సంగ్రామములో  అంగదుడు మహాపార్శ్వుని  అంతమొందించెను . అది చూసిన రాక్షస సైన్యము  మిక్కిలి  భీతిల్లిరి  రావణుడు క్రోధముతో ఊగిపోయెను  .  
వానరులు పట్టరాని సంతోషముతో ఆకాసము తాకినట్లు సింహనాదం చేసిరి . అది విని రావణుడు కదనరంగమున  యుద్ధసన్నద్దుడై నిలిచెను . 



రామాయణము, యుద్ధకాండ - తొంబదితొమ్మిదవ సర్గ ---- సమాప్తము . 






శశి,

ఎం ఏ , ఎం ఏ( తెలుగు) ,
తెలుగుపండితులు .