రామాయణము
యుద్ధకాండ --------- నూటఅయిదవ సర్గ
రణగర్వితడైన రావణుడు మిక్కిలి కోపంతో శ్రీ రాముడి పై బాణ వర్షమును కురిపించెను . శ్రీ రాముడు రావణుని పై శరవర్షమును కురిపించెను . ఆకాశమంతయు వీరి బాణములచే కప్పబడి రణరంగము అంధకారమయ్యెను . అందువలన కోపావేశపరులై యుద్ధము చేయుచున్న రామరావణులిరువులు ఒకరికి ఒకరు కనపడకుండిరి . అపుడు శ్రీ రాముడు రావణుడితో రాక్షసాధమ ! దండకారణ్యములో నేను దూరముగా ఉన్నప్పుడు దీనురాలైయున్న వైదేహిని బలవంతంగా తీసుకు వచ్చితివి అయినను నిన్ను నీవు శూరుడిగా భావించుచుండివి . నిస్సహాయ స్థితిలో ఉన్న పరసతులయందు అమర్యాదగా ప్రవర్తించువాడా! గర్వంతో కన్నూ మిన్నూ కానక, నీ మృత్యువును నీవే కొనితెచ్చుకొంటివి. నీవు చేసిన దుష్కార్యమునకు తగిన ఫలితము ఇప్పుడే పొందగలవు . దుష్టుడా దొంగ వలే సీత ను అపహరించిన నీకు ఏమాత్రము సిగ్గు లేదు . నీవు బలవంతంగా సీతను అపహరించుపోవునపుడు నేను అక్కడే ఉండివుంటే అప్పుడే నా శరములకు బలియై నీ సోదరుడు ఖరునివద్దకు చేరెడివాడవు . నీచుడా! నీ పాపము పండి ఇప్పుడు నా కంటపడితివి . ఇప్పుడే నీ శిరస్సును నా బాణపరంపరతో ముక్కలుముక్కలై చెల్లాచెదురుగా పడిపోవునట్లు చేసెదను" అని పలికి రావణుడి పై శరవర్షము కురిపించెను . శ్రీ రాముడు వేగంగా అస్త్రములను ప్రయోగించుటలో మునపటికంటెను పటిమ అధికమయ్యెను . రావణుడు ధనుస్సు లాగి శస్త్రములను వేయలేకపోయెను . శ్రీ రాముని పరాక్రమము ను ఎదిరింపలేకపోయెను . పూనిక వహించి ఎలాగోలా రామునిపై వివిధ శస్త్రములు ప్రయోగించుచున్నప్పటికీ , అవసానదశ దగ్గర పడుటచే అవి శ్రీ రాముని తాక లేక పోయెను . అపుడు రావణుని రధ సారధి రావణుడి దురవస్థ గ్రహించి . నెమ్మదిగా రధముని పక్కకు మళ్లించెను .
రామాయణము -----------యుద్ధకాండ ---------------నూటఅయిదవసర్గ -----------------సమాప్తము --------------
శశి,
ఎం.ఏ, ఎం.ఏ,(తెలుగు) , తెలుగుపండితులు .
No comments:
Post a Comment