Friday 1 May 2020

రామాయణము యుద్ధకాండ -------నూటమూడవసర్గ

                                        రామాయణము 

  

                                      యుద్ధకాండ -------నూటమూడవసర్గ 

పరాక్రమశాలి  శత్రుసంహారదక్షుడు  ఐన  శ్రీ రాముడు  లక్ష్మణుని పలుకులు విని వెంటనే తన ధనస్సును  చేబూని రావణుని పై శరములను  ప్రయోగించెను . రాక్షస రాజైన రావణుడు మరొక రధాన్ని అధిరోహించి శ్రీ రాముడి పై బాణములు వేసెను . శ్రీ రాముడు భూమి మీద ఉండి రావణుడు రథముపై ఉండి  యుద్ధము చేయుట  సరికాదని దేవ, గాంధర్వ,దానవులు , తమలో తాము అనుకొనిరి . 
అప్పుడు దేవతల ప్రభవైన  ఇంద్రుడు తన రధమును తీసుకు పోయి  శ్రీరామునికి అప్పగింపుమని  సారధియైన మాతలిని ఆదేశించెను .  ఆ రధము యొక్క భాగములన్నీ బంగారముతో నిర్మితములై అనేక చిరు గంటలతో అలంకరించి ఉండెను . దానికి పూంచిన అశ్వములు దివ్యములు అవి బంగారు శిరో  భూషణములు కలిగి యున్నవి . వాటికి తెల్లని వింజామరలు  అమర్చబడియున్నవి  . ఇంద్రుని యొక్క ఆదేశానుసారం మాతలి ఆ దివ్య రధమును ఎక్కి దివి నుండి భువికి చేరి శ్రీ రాముని సమక్షమున నిల్చెను . మాతలి శ్రీ రామునికి ప్రణమిల్లి ఆయనతో "దివ్యగుణ సంపన్నా! శత్రుసంహారక  రామా ! ఈ యుద్ధమున మీ విజయమునకై  దేవేంద్రుడు  ఈ రధమును పంపెను . దీనితో పాటుగా ఈ మహాధనస్సును , అగ్ని జ్వాలల వలే మిరుమిట్లు గొలుపు చున్న ఈ కవచమును , సూర్యకిరణములవలె కాంతులీనుచున్న ఈ శరములను వాఢియైన  ఈ శక్తి ఆయుధమును దేవేంద్రుడే మీకు సమర్పించెను . మహా వీరుడవైన ఓ ప్రభూ! ఈ రధమును అధిరోహింపును . నేను నీకు సారధిగా వుండుదును రావణుడిని జయింపుము" . మాతలి ఇలా విన్న పించిన పిమ్మట శ్రీ రాముడు  మిక్కిలి గౌరవముతో ఆ రధమును ప్రదక్షిణ కావించి దాన్ని అధిరోహించెను . 
పిమ్మట శ్రీ రాముడికి రావణునికి మధ్య గగుర్పాటును కూర్చుంటువంటి సంకుల సమరం జరిగింది . రాముడు రావణుడు ప్రయోగించిన గంధర్వాస్త్రమును  గంధర్వాస్త్రముతోను ,దివ్యాస్త్రమును దివ్యాస్త్రముతోను భగ్నము చేసెను . పిమ్మట దుష్టుడైన రావణుడు మిక్కిలి కోపంతో అతి భయంకర మైన రాక్షసాస్త్రంను ప్రయోగించెను . ఆ అస్త్రము సర్పముల వలే మహా విషపూరితమై తమ పడగల పై గల మణులతో దశదిశలా వ్యాపించెను . వెంటనే శ్రీ రాముడు గరుడాస్త్రము ప్రయోగించెను. ఆ అస్త్రము నుండి గరుడ రూపములు బంగారు రెక్కలు కలిగి రాక్షసుడు ప్రయోగించిన అస్త్రము నుండి వెలువడిన నాగులను సంహరించెను . ఆలా తన అస్త్రములన్ని వ్యర్ధమై పోవుటచే రావణుడు మిక్కిలి కోపంతో శ్రీ రాముడిపై  బాణములను వర్షములా కురిపించసాగెను . 
రావణుడు తన బాణముతో మాతలిని గాయపరిచేను. రధ  ధ్వజమును ముక్కలు చేసెను . రధమునకు కట్ట బడిన  ఇంద్రాశ్వములను కూడా  గాయపరిచెను .  రావణుడి యొక్క యుద్ధ తీవ్రతను చూసిన దేవ , దానవ , గంధర్వులు, విచారమునకు లోనయ్యిరి . సిద్దులు మహర్షులు , వానర ప్రముఖులు విభీషణాదులు శ్రీ రాముని చూసి మిక్కిలి వ్యధచెందిరి . రావణుడు వరుసగా బాణములను ప్రయోగించుటచే దెబ్బ తినిన శ్రీ రాముడు శరములను సంధింప లేక పోయెను . అప్పుడు శ్రీ రాముడు కోపంతో కన్నులు ఎర్ర చేసెను . 



రామాయణము ---------యుద్ధకాండ ----------నూటమూడవసర్గ --------------సమాప్తము . 




శశి ,

ఎం.ఏ,ఎం.ఏ,(తెలుగు ), తెలుగుపండితులు . 























No comments:

Post a Comment