Tuesday, 21 December 2021

రామాయణము, ఉత్తర కాండ - ఏబది ఎనిమిదవ సర్గ

                              రామాయణము 

                                                                                                                                                                                                                                                                                                                                                                            ఉత్తర కాండ - ఏబది ఎనిమిదవ సర్గ

లక్ష్మణుడు తన అన్న అయిన శ్రీ రాముడు తెలిపిన గాధలను విని తన అన్నతో " మహా రాజా ! మీరు చెప్పిన గాధలు మిక్కిలి అద్బుతమయినవి ఎంతో ఆశ్చర్య కరమైనవి నిమి మహారాజు క్షత్రియుడు శూరుడు , మీదు మిక్కిలి యజ్ఞ దీక్షలో ఉన్నవాడు అట్టి మహారాజు మహాత్ముడయిన వశిష్ఠుడి విషయంలో సహనము చూపకుండుటకు గల కారణమేమిటి? . " అని అడుగగా శ్రీ రాముడు " మహావీరా! మనుషులు కొన్ని కొన్ని సందర్భాలలో తమ సహనమును కోల్పోవు చుందురు ఇది అత్యంత సహజము . దీనికి ఉదాహరణగా యయాతి మహారాజు కథ చెప్పెదను వినుము . 
నహుషుడి కుమారుడయిన యయాతి అనుక్షణము ప్రజల అభివృద్ధికై పాటుపడు చుండెడి మహారాజు . ఆయనకి ఇరువురు భార్యలు . వారుఇరువురు ఈలోకమున సాటిలేని సౌందర్య వతులు . వారిలో ఒక భార్య దైత్య వంశమునకు చెందిన వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్ట . మరో భార్య దైత్య గురువైన శుక్రాచార్యుని కుమార్తె . ఆమె సౌందర్యవతే అయినను రాజుకు ఆమె పై ఎక్కువ ప్రేమ లేకుండెను . ఆ ఇరువురికి చక్కని కుమారులు కలిగిరి . శర్మిష్ట కుమారుని పేరు పూరుడు . దేవయాని కుమారుని పేరు యదువు . 
పూరుడు తన సుగుణ సంపద చేత తల్లి శర్మిష్ట కారణముగా తండ్రికి ప్రీతీ పాత్రుడు అయ్యెను . ఈ విషయములో మనస్తాపము చెందిన యదువు తన తల్లి అగు దేవయానితో ఇట్లనెను . "అమ్మా! పూజ్యుడు , క్లిష్ట కార్యములను సైతం అవలీలగా సాధింప గల ప్రజ్ఞా శాలి అయిన శుక్రాచార్యుని కుమార్తెవు కదా అట్టి మహాత్ముని వంశమున పుట్టిన నువ్వు తీరని దుఃఖమును దుర్భరమయిన అవమానమును మనస్సులోనే భరించుచున్నావు . ఇట్లు అవమానముల పాలగుచు జీవించుట కంటే మనము అగ్నికి ఆహుతి అగుటయే యుక్తము.  రాజుని ఆ శర్మిష్ట తోనే, ఆమె కుమారులతోనే సంతోషముగా ఉండనివ్వు . ఒక వేళ నీవు ఈ దురవస్థ సహించ గలిగితే సహించు నాకు మాత్రం అట్టి శక్తీ లేదు . నేను ప్రాణ త్యాగం చేయుటకు నాకు అనుమతి ఇవ్వు . ముమ్మాటికీ నేను ప్రాణ త్యాగము చేసెదను . " అని పలుకగా 
ఆ మాటలు విన్న దేవయాని మిక్కిలి కోపం తో తన తండ్రి అగు శుక్రాచార్యుడిని స్మరించెను . శుక్రాచార్యుడు తన కుమార్తెతో పెల్లుబుగు చున్న దుఃఖము గ్రహించి త్వరత్వరగా ఆమె వద్దకు చేరెను . దీనావస్థలో ఉన్న ఆమె కుమార్తెను చూసి ' అమ్మా! ఇది ఏమి ఇట్లున్నావు ? ' అని అడిగెను . ఆయన ఆ విధముగా ప్రశించగా కోపంతో , బాధతో రగిలి పోతున్న దేవయాని ' తండ్రీ ! మండుతున్న అగ్నిలో ప్రవేశించి కానీ, విషము త్రాగి కానీ , నీళ్లలో దూకి కానీ , నా జీవితమును చాలించెను . నాకు జరిగిన అవమాన భారమును భరించ లేకున్నాను  . భార్గవ ఆ రాజర్షి నీయందు అనాదరణ  భావం చూపుచున్నట్లే నాయందును అనాదరణ  భావమునే కలిగి ఉన్నాడు . అతడు నన్ను ఏమాత్రము గౌరవించుట లేదు " . అని దేవయాని పలుకగా ఆ మాటలు విన్న శుక్రాచార్యుడు మిక్కిలి కోపించి యయాతిని ఇట్లు శపించెను . " యయాతి నీవు చేసిన దోషమునకు కాను నీవు తీవ్రమైన వార్ధక్యమునకు గురై మిక్కిలి అశక్తుడవు అగుదువు . " . ఇలా శపించిన పిమ్మట తన కూతురుని ఊరడించి స్వగృహమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ ఏబది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                                                                               శశి ,

                                                                                    ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















రామాయణము ఉత్తర కాండ ---------- ఏబది ఏడవ సర్గ

                           రామాయణము 

                        ఉత్తర కాండ ---------- ఏబది ఏడవ సర్గ 

శ్రీ రాముడు లక్ష్మణుడి తో "లక్ష్మణా! ఒక కుంభం నుండి సూర్య ,వరుణుల యొక్క తేజస్సు తో  అగస్త్య , వసిష్ఠ మహా మునులు ఉద్బవించిరి . పిమ్మట వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకు గురువై వారి పూజలు అందుకోను చుండెను . 
వసిష్ఠుడికి నూతన దేహము ఆవిర్భవించినది  కదా ఇప్పుడు నిమి గురించి తెలుపుతాను విను . 
నిమి మహా రాజు మరణించిన పిమ్మట ఋషీశ్వరులు అందరు విదేహుడుగా ఉన్న ఆ రాజుని చూసి తామే యజ్ఞ దీక్షను వహించిరి. అచటి బ్రాహ్మణోత్తములు పౌరులతో , భృత్యులతో ఆ మహా రాజు యొక్క దేహమును తైల కటాహమునందు ఉంచి గంధ మాల్యములతో వస్త్రములతో కాపాడిరి . యజ్ఞము ముగిసిన పిమ్మట సంప్రీతులైన దేవతలు నిమి యొక్క ఆత్మతో ' రాజర్షి ఒక వరమును కోరుకొనుము ' అని పలికిరి . అప్పుడు నిమి ఆత్మ' దేవతలారా ! నేను సకల ప్రాణుల నేత్రముల యందు నివసించును గాక '. అని పలికెను . అప్పుడు దేవతలు నీవు కోరుకున్నట్లే సమస్త ప్రాణుల నేత్రములు యందు నివసించుచుందువు . ఓ పృథ్విపతి జీవుల  చక్షువుల యందు వాయు రూపమున చరించుచున్న నీకు విశ్రాంతి గూర్చుటకై ప్రాణులు మాటిమాటికి తమ కన్నులు మూసుకొని చుందురు (రెప్ప వేయుదురు ). ' అని దేవతలు వరమిచ్చి తమ తమ స్థానాలకు వెళ్లిపోయిరి . పిమ్మట ఋషులు నిమి యొక్క దేహమును ఒక అరణిలో ఉంచి నిమికి సంతానము కలిగించుటకై మంత్ర పూర్వకముగా హోమముములు ఒనర్చుచు నిమి దేహమును  మదించిరి . అందుండి ఒక మహా తేజస్వి ఉద్బవించెను . మదించుట వలన కలుగుట చే అతనిని మిథి అని , ఆ విధముగా జన్మించుట చే జనకుడని , విదేహుని నుండి ఆవిర్భవించిన  కారణం చే వైదేహుడు అని ఖ్యాతి వహించెను . ఆయన కారణంగానే ఆ వంశమునకు మిథిల వంశం అనే పేరు ప్రసిద్ధ మయ్యెను " అని శ్రీ రాముడు పలికెను. 

 సమాప్తం ---- రామాయణము ---- ఉత్తరకాండ ---- ఏబదియేడవ సర్గ. 


శశి , 

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగు పండిట్ . 


























Monday, 20 December 2021

రామాయణము- ఉత్తరకాండ - యాబది ఆరవసర్గ

                       రామాయణము 

                       ఉత్తరకాండ - యాబది ఆరవసర్గ 

శ్రీ రాముడి మాటలు విన్న సౌమిత్రి అంజలి ఘటించి "రాజా! దేవతలతో సామానులు విదేహులు అయిన వసిష్ఠుడు నిమి మహారాజు మరలా దేహమును పొంద గలిగిరి " అని ప్రశ్నించగా శ్రీ రాముడు " సౌమిత్రి ! తపోధనులు, ధార్మికులు అయిన నిమి వశిష్ఠులు పరస్పరం శపించుకొని దేహములు కోల్పోయి వాయువు వాలే మసలుకోన సాగిరి . వశిష్ట మహాముని తన తండ్రి అయిన బ్రహ్మ దేవుని వద్దకు వెళ్లెను . బ్రహ్మ దేవుడి పాదములకు ప్రణమిల్లి " లోక నాధా! నిమి యొక్క శాపం వలన నేను విదేహుడనయితిని నాకు మరియొక దేహమును అనుగ్రహించుము . బ్రహ్మ దేవుడు" అట్లే నీ కోరిక తప్పక నెరవేరును . " ఆ మాటలు విన్న వసిష్ఠుడు సంతోషించి బ్రహ్మ దేవుడికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అచట నుండి వరుణ లోకమునకు వెళ్లిపోయెను . 
వరుణ లోకం లో ఊర్వశి చేసిన ఒక తప్పునకు కాను సూర్యుడు ఆమెను "నీవు మనుష్య లోకం చేరి కొంత కాలం అక్కడే నివసింతుము . బుధుని యొక్క పుత్రుడు కాశీ దేశమునకు రాజు అయిన పురూరవుని వద్దకు నేడే వెళ్లుము . అతడు నీకు భర్త కాగలడు ."అని శపించెను . 
సూర్యుడు చెప్పినట్లు ఊర్వశి బుధుడి కుమారుడయిని పురూరవుని వద్దకు వెళ్లెను . వారు ఇరువురికి ఆయువు అనే కుమారుడు కలిగెను . ఆయువు కుమారుని పేరు నహుషుడు . ఇతడు ఇంద్రుని వాలే మహా తేజస్వి . వజ్రాయుధమును ప్రయోగించి వృత్తాసురుడుని సంహరించిన ఇంద్రునికి బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకొనగా ఆ సమయంలో నహుషుడు ఇంద్ర పదవిని అలంకరించి లక్ష సంవత్సరమునులు స్వర్గమును పరిపాలించెను . 
అలా ఊర్వశి సూర్యుడి శాప కారణంగా భూలోకం లో అనేక సంవత్సరములు ఉండి పిదప స్వర్గ లోకమునకు చేరెను " అని శ్రీ రాముడు పలికెను. 





రామాయణము , ఉత్తరకాండ ------ యాబది ఆరవ సర్గ . 

శశి ,

ఎం.ఏ ,ఎం.ఏ (తెలుగు ), తెలుగు పండితులు . 

రామాయణము ఉత్తరకాండ -ఏబది ఐదవసర్గ

                          రామాయణము 

                             ఉత్తరకాండ -ఏబది ఐదవసర్గ 

శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో "నాయనా !నృగ మహారాజు వృత్తాంతమును వివరించాను కదా !ఇంకనూ వినవలెనని నీకు కుతూహలము వున్నచో మరో కథను తెలిపెదను వినుము . "అని పలుకగా ,లక్ష్మణుడు "రాజా !ఆశ్చర్యకరములైన ఇట్టి కధలను ఎన్ని విన్నా తనివి తీరదు . "అని పలికెను . 
ఆ మాటలను విన్న శ్రీరాముడు "సోదరా !మహాత్ములైన ఇక్ష్వాకుకుమారులలో నిమి మహారాజు 12వ వాడు . అతడు మిక్కిలి పరాక్రమమవంతుడు, అత్యంత ధర్మనిరతుడు . మహావీరుడైన ఆ రాజు గౌతమముని ఆశ్రమ సమీపములో ఒక పురమును నిర్మింపచేసెను . అది సురపురియైన అమరావతి వలే ఎంతో వైభవోపేతమైనది . ఆ చక్కని నగరమునకు 'వైజయంతము 'అని పేరు . ఆ మహానగరమును నిర్మించిన పిమ్మట నిమి మహారాజు తన తండ్రి ఇక్ష్వాకు మహారాజుని సంతోషపరుచుటకై కొన్ని సంవత్సరములపాటు నిర్వహించే ఒక యాగము చేయ సంకల్పించాడు . ఆయన తన తండ్రితో సంప్రదించి ,ఆ యజ్ఞమును చేయించుటకై మొట్టమొదట బ్రహ్మర్షులలో శ్రేష్ఠుడైన వశిష్ఠమహామునిని ఆహ్వానించెను . 
పిమ్మట నిమి మహారాజు తపోధనులైన అత్రి ,అంగీరసుడు ,భృగువు మొదలైనవారిని కూడా పిలిచెను . అప్పుడు వశిష్ఠుడు నిమితో "ఇంతకు ముందే ఇంద్రుడు ఒక యజ్ఞమును చేయించుటకై నన్ను ఆహ్వానించాడు . నేను ఆ యజ్ఞమును పూర్తిచేసి వచ్చి నీ యజ్ఞమును పూర్తి చేసెదను . నాకొఱకు నిరీక్షించుము . "అని పలికెను . వశిష్ఠుడు వెళ్లిపోయిన పిమ్మట గౌతమ మహర్షి నిమి యొక్క యజ్ఞమును పూర్తిచేసెను . వశిష్ఠుడు ఇంద్రుని యజ్ఞమును పూర్తి చేసి నిమి యజ్ఞమునకు వచ్చెను . అక్కడ గౌతమ మహర్షి తనకు మారుగా యజ్ఞమును పూర్తి చేసి ఉండుట చూసిన వశిష్ఠుడు కోపోద్రిక్తుడయ్యెను . అయినను  రాజ దర్శనమునకై కొంత సమయము అక్కడే కూర్చుండి ఎదురుచూసేను . ఆ సమయములో నిమి మహారాజు గాఢమైన నిద్రలో మునిగి ఉండెను . రాజ దర్శనము కాకపోవుటచే వశిష్ఠుడు మిక్కిలి కోపోద్రిక్తుడై 'రాజా !యజ్ఞ నిర్వహణకు నాకు మారుగా మరొకరిని నిలిపితివి . నన్ను అవమానించితివి . కనుక నీ దేహము చైతన్యరహితముగా అగును . "అని శపించెను . ఆ శాపమునకు క్రుద్ధుడైన నిమి మహారాజు కూడా వశిష్ఠుడిని "నీవు వచ్చిన విషయము తెలియక నేను నిద్రించినాను . ఆకారణముగా నీవు యమదండము వంటి శాపమును ప్రయోగించితివి . బ్రహ్మర్షీ !మిక్కిలి తేజోమహితమైన నీ దేహము కూడా చైతన్యము కోల్పోవును . ఇందు సందేహము లేదు . "అని శపించేను . 
ఆ విధముగా నిమి మహారాజు వశిష్ట మహాముని రోషావేశపరులై ఒకరినొకరు శపించుకుని ,వెంటనే విదేహులైరి . 

రామాయణము ఉత్తరకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                                                 శశి ,

                         ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





Sunday, 19 December 2021

రామాయణము ఉత్తర కాండ -ఏబది నాలుగవ సర్గ

                     రామాయణము 

                  ఉత్తర కాండ -ఏబది నాలుగవ సర్గ  

శ్రీరాముడి మాటలు విన్న లక్ష్మణుడు ,అన్నకు నమస్కరించి "అన్నా !రాజర్షి ఐన నృగ మహారాజు చేసిన అపరాధము చిన్నదే అయినప్పటికీ ఆ బ్ర్రాహ్మణోత్తములు ఇచ్చిన శాపము యమదండము వలే మిక్కిలి తీవ్రమైనది . పురుషోత్తమా !క్రుద్ధులైన ఆ ఇరువురు బ్రాహ్మణులు శపించిన పిమ్మట నృగ మహారాజు ఏమిచేసెను ?"అని అడుగగా ,
శ్రీరాముడు "సౌమ్యుడా !నృగ మహారాజు బ్రాహ్మణులు వెళ్లిన పిమ్మట తన మిత్రులను ,మంత్రులను ,పురోహితులను ,పౌరులను పిలిపించి ,వారితో 'నేను బ్రాహ్మణుల శాపమునకు గురి అయ్యాను . నాకుమారుడైన వసువును రాజుగా పట్టాభిషిక్తుడను చేయుటకు ఏర్పాట్లు చేయుము . శిల్పులను రప్పించి ,నాకోసము ఒక గోతిని సిద్దపరుచుము . నాకు బ్రాహ్మణులు ఇచ్చిన శాపకాలము ముగియు వరకు నేను అక్కడే వుంటాను . వర్షములు భాదకు తట్టుకొనునట్లుగా ,మంచు భాద లేకుండా ,గ్రీష్మ తాపమును నివారించునట్లుగా మూడు వేరువేరు గోతులను శిల్పులచే నిర్మింపచేయుము . అక్కడ ఫల వృక్షములను  ,పూలతీగలను ,చక్కగా నీడనిచ్చే వివిధ మహావృక్షములను ,గుబురుగా వుండే పొదలను ఏర్పాటు చేయింపుడు . 'అని ఆజ్ఞ ఇచ్చి తిరిగి తన కుమారుడితో 'పుత్రా !నిత్యమూ ధర్మ నిరతుడవై క్షత్రియ విధులను పాటించుచు ప్రజానురంకంగా పాలన చేయుము . కుమారా !పూర్వజన్మలో చేసిన సుకృత దుష్కృతముల ఫలితముగా మానవుడు వెళ్లవలిసిన ప్రదేశములకు వెళ్ళును ,సుఖదుఃఖములు అనుభవించును . కావున ఇందులకు నీవు వ్యధ చెందవలదు . అని పలికి తన కోసము చక్కగా ఏర్పాటు చేసిన గోతుల వద్దకు వెళ్లి వాటిలో ప్రవేశించెను . ఆయన ఊసరవెల్లిగా (తొండ) మారిపోయెను . అలా నృగ మహారాజు బ్రాహ్మణుల శాప ఫలితాన్ని అనుభవించుచున్నాడు ".అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలికెను .   

రామాయణము ఉత్తరకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 


                                                                                      శశి ,

                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Thursday, 16 December 2021

రామాయణము ఉత్తరకాండ -ఏబదిమూడవసర్గ

                         రామాయణము 

                       ఉత్తరకాండ -ఏబదిమూడవసర్గ 

లక్ష్మణుడు పలికిన మాటలు విన్న శ్రీరాముడు తమ్ముడితో "నాయనా !నీవు నా మనోభావములను బాగుగా గుర్తించిన బుద్ధిశాలివి . నీవంటి ఆత్మీయుడు లభించుట దుర్లభము.  అందునా ఈ దుఃఖ సమయములో తోడుగా ఉండుట విశేషము . లక్ష్మణా !నేను నాలుగు రోజుల నుండి పౌరకార్యములను పట్టించుకొనుటలేదు . కావున నాయనా !పురోహితులను ,మంత్రులను నా వద్దకు పంపుము . అలాగే కార్యార్థులై వచ్చిన స్త్రీ పురుషులను కూడా ఇక్కడికి పంపుము . నిత్యమూ ప్రజల గురించి ఆలోచించని రాజు ఘోరమైన నరకం పాలవుతాడు . దీనికి సంభందించిన ఒక కథ చెబుతాను విను 
పూర్వము నృగుడు అనే మహారాజు ప్రజాపాలకులలో గొప్పవాడిగా పేరు పొందాడని ప్రతీతి . అతడు వేదములను అధ్యయనము చేసినవాడు . బ్ర్రాహ్మణ భక్తి కలవాడు . సత్యవచనుడు ,మిక్కిలి పవిత్రుడు . ఒకానొక సందర్భములో పుష్కర తీర్థములందు బ్ర్రాహ్మణోత్తములకు బంగారముతో అలంకృతమైన దూడలతో కలిసి వున్న కోటి గోవులను దానము చేసెను . నాయనా ఆ కాలములోనే ఉంఛవృత్తితో జీవించే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు . అతడు నిత్యమూ అగ్నికార్యము నెరపుచుండెడివాడు . ఆ పుణ్యాత్ముడికి దూడతో కలిసిన ఒక ఆవు ఉండేది . రాజు దానము చేసిన కోటి ఆవులలో ఆ ఆవు దూడ కూడా కలిసిపోయాయి . అది గుర్తించని రాజు దానిని కూడా మిగిలిన ఆవులతో పాటు దానము చేసివేసెను . ఆకలిదప్పులతో బాధపడే బ్ర్రాహ్మణుడు తప్పిపోయిన తన ఆవును వెతుకుతూ అక్కడ ఇక్కడ తిరుగసాగెను . ఆలా సంవత్సరము గడిచిపోయెను . ఐనను ఆవును వెతుకుట ఆపలేదు . అలా వెతుకుతూ ,'కనఖలము 'అనే గ్రామమునకు చేరెను . ఆ గ్రామములో ఒక బ్రాహ్మణుడి ఇంట తన ఆవును చూసి గుర్తించెను . ఆ ఆవు ఆరోగ్యముగానే ఉన్నది కానీ దూడ మాత్రము బాగా బక్కచిక్కిపోయినది . అది చూసి వెంటనే ఆ విప్రుడు తన ఆవుని 'శబలా '!రా !'అని ఎలుగెత్తి పిలిచెను . ఆ పిలుపు విని తన యజమానిని గుర్తించి పరుగు పరుగున ఆయన వద్దకు వచ్చి ,ఆయన వెంట నడిచెను . అప్పటి వరకు ఆ ఆవుని పోషించిన బ్రాహ్మణుడు అది చూసి గబగబా నడిచి ఆ విప్రుడి వద్దకు వెళ్లి ,"ఇది నా గోవు . దీనిని నృగ మహారాజు నాకు విధ్యుక్తముగా దానము చేసెను . "అని పలికెను . 
ఆ విధముగా ఆ ఆవు కారణముగా ఆ ఇద్దరి బ్రాహ్మణుల మధ్య తీవ్ర వాదము జరిగెను . వారు ఆ విధముగా వాదించుకుంటూనే ఆ ఆవుని దానము చేసిన నృగ మహారాజు వద్దకు బయలుదేరిరి . వారు రాజభవనమునకు చేరిరి కానీ వారికి అందు ప్రవేశించుటకు ,రాజ దర్శనమునకు అనుమతి లభించలేదు . దాంతో వారిరువురు ఎంతో క్రుద్ధులయ్యిరి . దాంతో వారు మిక్కిలి కోపముతో "కార్యార్థులమై వచ్చిన మాకు నీవు దర్శనము ఈయకుంటివి . అందువలన నీవు సకల ప్రాణులకు కనపడకుండా ఒక తొండవై పడియుందువు . వందలవేలకొలది సంవత్సరాల పాటు ఒక గుంతలో నివసింతువు . ఈ లోకములో యదువంశములో వాసుదేవుడు అనే పేరుతో ఒక మహా పురుషుడు జన్మించును . ఆ మహాత్ముడు ఈ శాపము నుండీ నిన్ను రక్షించగలడు . "అని నృగ మహారాజుని శపించెను . 
పిమ్మట వారు ఆ ఆవుని మరో బ్రాహ్మణుడికి దానముగా ఇచ్చి ,తమ దారిన తాము పోయిరి . వారి శాప ఫలితముగా నృగ మహారాజు దారుణమైన ఫలితమును అనుభవించెను . "
నాయనా !కావున కార్యార్థులై వచ్చిన వారియొక్క వివాదమును పట్టించుకోననిచో ఆ దోషము రాజును చుట్టుకొనును . అందువలన కార్యార్థులై వచ్చిన వారికి వెంటనే నా దర్శనము కలుగునట్లు చూడుము . "అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలికెను . 

రామాయణము ఉత్తరకాండ ఏబదిమూడవ సర్గ సమాప్తము . 

                                                             శశి ,

                                                  ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


రామాయణము ఉత్తర కాండ -ఏబది రెండవ సర్గ

                               రామాయణము 

                                ఉత్తర కాండ -ఏబది రెండవ సర్గ 

లక్ష్మణుడు సుమంత్రుడితో కలిసి ఆ రాత్రి కేశినీ నదీ తీరంలోనే గడిపెను . ప్రాతః కాలమే నిద్రలేచి అచటి నుండి బయలుదేరెను . ఆ సౌమిత్రి మధ్యాహ్న సమయమునకు అయోధ్యలో ప్రవేశించెను . మిక్కిలి చింతాక్రాంతుడై వున్న లక్ష్మణుడు 'శ్రీరామునికి ఏమి చెప్పాలి ?ఎలా చెప్పాలి?ఆయనను ఎలా ఓదార్చాలి ?అని పరిపరి విధములుగా ఆలోచించన చేస్తూ రాజా భవనము వైపుగా రధమును నడిపెను . 
రాజా భవనము లోకి ప్రవేశించి ,సింహాసనంపై కూర్చుని ఉన్న తన అన్నను దర్శించి ఆయన పాదములకు ప్రణమిల్లెను . అనంతరము అతడు గుండె దిటవు చేసుకుని ,"ప్రభూ !పూజ్యుడవైన నీ ఆజ్ఞను తలదాల్చి ,ముందుగా ఉద్దేశించిన ప్రకారము ,పవిత్రమైన వాల్మీకి మహర్షి ఆశ్రమ సమీపమునకల గంగా తీరమునందు జానకీ దేవిని విడిచి నీ పాద సేవకై ఇక్కడికి తిరిగి వచ్చాను . విధివిలాసము ఇలా వుంది . పురుష శ్రేష్టా !ధైర్యము వహించి దృఢ చిత్తుడవై ఈ మనోదౌర్బల్యమును వీడుము . "అని పలికెను . 

రామాయణము ఉత్తర కాండ ఏబదిరెండవసర్గ సమాప్తము . 
                           

                                                   శశి ,                                           

                                                                               ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .