Tuesday 21 December 2021

రామాయణము ఉత్తర కాండ ---------- ఏబది ఏడవ సర్గ

                           రామాయణము 

                        ఉత్తర కాండ ---------- ఏబది ఏడవ సర్గ 

శ్రీ రాముడు లక్ష్మణుడి తో "లక్ష్మణా! ఒక కుంభం నుండి సూర్య ,వరుణుల యొక్క తేజస్సు తో  అగస్త్య , వసిష్ఠ మహా మునులు ఉద్బవించిరి . పిమ్మట వసిష్ఠుడు ఇక్ష్వాకు వంశమునకు గురువై వారి పూజలు అందుకోను చుండెను . 
వసిష్ఠుడికి నూతన దేహము ఆవిర్భవించినది  కదా ఇప్పుడు నిమి గురించి తెలుపుతాను విను . 
నిమి మహా రాజు మరణించిన పిమ్మట ఋషీశ్వరులు అందరు విదేహుడుగా ఉన్న ఆ రాజుని చూసి తామే యజ్ఞ దీక్షను వహించిరి. అచటి బ్రాహ్మణోత్తములు పౌరులతో , భృత్యులతో ఆ మహా రాజు యొక్క దేహమును తైల కటాహమునందు ఉంచి గంధ మాల్యములతో వస్త్రములతో కాపాడిరి . యజ్ఞము ముగిసిన పిమ్మట సంప్రీతులైన దేవతలు నిమి యొక్క ఆత్మతో ' రాజర్షి ఒక వరమును కోరుకొనుము ' అని పలికిరి . అప్పుడు నిమి ఆత్మ' దేవతలారా ! నేను సకల ప్రాణుల నేత్రముల యందు నివసించును గాక '. అని పలికెను . అప్పుడు దేవతలు నీవు కోరుకున్నట్లే సమస్త ప్రాణుల నేత్రములు యందు నివసించుచుందువు . ఓ పృథ్విపతి జీవుల  చక్షువుల యందు వాయు రూపమున చరించుచున్న నీకు విశ్రాంతి గూర్చుటకై ప్రాణులు మాటిమాటికి తమ కన్నులు మూసుకొని చుందురు (రెప్ప వేయుదురు ). ' అని దేవతలు వరమిచ్చి తమ తమ స్థానాలకు వెళ్లిపోయిరి . పిమ్మట ఋషులు నిమి యొక్క దేహమును ఒక అరణిలో ఉంచి నిమికి సంతానము కలిగించుటకై మంత్ర పూర్వకముగా హోమముములు ఒనర్చుచు నిమి దేహమును  మదించిరి . అందుండి ఒక మహా తేజస్వి ఉద్బవించెను . మదించుట వలన కలుగుట చే అతనిని మిథి అని , ఆ విధముగా జన్మించుట చే జనకుడని , విదేహుని నుండి ఆవిర్భవించిన  కారణం చే వైదేహుడు అని ఖ్యాతి వహించెను . ఆయన కారణంగానే ఆ వంశమునకు మిథిల వంశం అనే పేరు ప్రసిద్ధ మయ్యెను " అని శ్రీ రాముడు పలికెను. 

 సమాప్తం ---- రామాయణము ---- ఉత్తరకాండ ---- ఏబదియేడవ సర్గ. 


శశి , 

ఎం.ఏ,ఎం.ఏ(తెలుగు), తెలుగు పండిట్ . 


























No comments:

Post a Comment