Monday 20 December 2021

రామాయణము ఉత్తరకాండ -ఏబది ఐదవసర్గ

                          రామాయణము 

                             ఉత్తరకాండ -ఏబది ఐదవసర్గ 

శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో "నాయనా !నృగ మహారాజు వృత్తాంతమును వివరించాను కదా !ఇంకనూ వినవలెనని నీకు కుతూహలము వున్నచో మరో కథను తెలిపెదను వినుము . "అని పలుకగా ,లక్ష్మణుడు "రాజా !ఆశ్చర్యకరములైన ఇట్టి కధలను ఎన్ని విన్నా తనివి తీరదు . "అని పలికెను . 
ఆ మాటలను విన్న శ్రీరాముడు "సోదరా !మహాత్ములైన ఇక్ష్వాకుకుమారులలో నిమి మహారాజు 12వ వాడు . అతడు మిక్కిలి పరాక్రమమవంతుడు, అత్యంత ధర్మనిరతుడు . మహావీరుడైన ఆ రాజు గౌతమముని ఆశ్రమ సమీపములో ఒక పురమును నిర్మింపచేసెను . అది సురపురియైన అమరావతి వలే ఎంతో వైభవోపేతమైనది . ఆ చక్కని నగరమునకు 'వైజయంతము 'అని పేరు . ఆ మహానగరమును నిర్మించిన పిమ్మట నిమి మహారాజు తన తండ్రి ఇక్ష్వాకు మహారాజుని సంతోషపరుచుటకై కొన్ని సంవత్సరములపాటు నిర్వహించే ఒక యాగము చేయ సంకల్పించాడు . ఆయన తన తండ్రితో సంప్రదించి ,ఆ యజ్ఞమును చేయించుటకై మొట్టమొదట బ్రహ్మర్షులలో శ్రేష్ఠుడైన వశిష్ఠమహామునిని ఆహ్వానించెను . 
పిమ్మట నిమి మహారాజు తపోధనులైన అత్రి ,అంగీరసుడు ,భృగువు మొదలైనవారిని కూడా పిలిచెను . అప్పుడు వశిష్ఠుడు నిమితో "ఇంతకు ముందే ఇంద్రుడు ఒక యజ్ఞమును చేయించుటకై నన్ను ఆహ్వానించాడు . నేను ఆ యజ్ఞమును పూర్తిచేసి వచ్చి నీ యజ్ఞమును పూర్తి చేసెదను . నాకొఱకు నిరీక్షించుము . "అని పలికెను . వశిష్ఠుడు వెళ్లిపోయిన పిమ్మట గౌతమ మహర్షి నిమి యొక్క యజ్ఞమును పూర్తిచేసెను . వశిష్ఠుడు ఇంద్రుని యజ్ఞమును పూర్తి చేసి నిమి యజ్ఞమునకు వచ్చెను . అక్కడ గౌతమ మహర్షి తనకు మారుగా యజ్ఞమును పూర్తి చేసి ఉండుట చూసిన వశిష్ఠుడు కోపోద్రిక్తుడయ్యెను . అయినను  రాజ దర్శనమునకై కొంత సమయము అక్కడే కూర్చుండి ఎదురుచూసేను . ఆ సమయములో నిమి మహారాజు గాఢమైన నిద్రలో మునిగి ఉండెను . రాజ దర్శనము కాకపోవుటచే వశిష్ఠుడు మిక్కిలి కోపోద్రిక్తుడై 'రాజా !యజ్ఞ నిర్వహణకు నాకు మారుగా మరొకరిని నిలిపితివి . నన్ను అవమానించితివి . కనుక నీ దేహము చైతన్యరహితముగా అగును . "అని శపించెను . ఆ శాపమునకు క్రుద్ధుడైన నిమి మహారాజు కూడా వశిష్ఠుడిని "నీవు వచ్చిన విషయము తెలియక నేను నిద్రించినాను . ఆకారణముగా నీవు యమదండము వంటి శాపమును ప్రయోగించితివి . బ్రహ్మర్షీ !మిక్కిలి తేజోమహితమైన నీ దేహము కూడా చైతన్యము కోల్పోవును . ఇందు సందేహము లేదు . "అని శపించేను . 
ఆ విధముగా నిమి మహారాజు వశిష్ట మహాముని రోషావేశపరులై ఒకరినొకరు శపించుకుని ,వెంటనే విదేహులైరి . 

రామాయణము ఉత్తరకాండ ఏబదియైదవసర్గ సమాప్తము . 

                                                 శశి ,

                         ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .  





No comments:

Post a Comment