Sunday 19 December 2021

రామాయణము ఉత్తర కాండ -ఏబది నాలుగవ సర్గ

                     రామాయణము 

                  ఉత్తర కాండ -ఏబది నాలుగవ సర్గ  

శ్రీరాముడి మాటలు విన్న లక్ష్మణుడు ,అన్నకు నమస్కరించి "అన్నా !రాజర్షి ఐన నృగ మహారాజు చేసిన అపరాధము చిన్నదే అయినప్పటికీ ఆ బ్ర్రాహ్మణోత్తములు ఇచ్చిన శాపము యమదండము వలే మిక్కిలి తీవ్రమైనది . పురుషోత్తమా !క్రుద్ధులైన ఆ ఇరువురు బ్రాహ్మణులు శపించిన పిమ్మట నృగ మహారాజు ఏమిచేసెను ?"అని అడుగగా ,
శ్రీరాముడు "సౌమ్యుడా !నృగ మహారాజు బ్రాహ్మణులు వెళ్లిన పిమ్మట తన మిత్రులను ,మంత్రులను ,పురోహితులను ,పౌరులను పిలిపించి ,వారితో 'నేను బ్రాహ్మణుల శాపమునకు గురి అయ్యాను . నాకుమారుడైన వసువును రాజుగా పట్టాభిషిక్తుడను చేయుటకు ఏర్పాట్లు చేయుము . శిల్పులను రప్పించి ,నాకోసము ఒక గోతిని సిద్దపరుచుము . నాకు బ్రాహ్మణులు ఇచ్చిన శాపకాలము ముగియు వరకు నేను అక్కడే వుంటాను . వర్షములు భాదకు తట్టుకొనునట్లుగా ,మంచు భాద లేకుండా ,గ్రీష్మ తాపమును నివారించునట్లుగా మూడు వేరువేరు గోతులను శిల్పులచే నిర్మింపచేయుము . అక్కడ ఫల వృక్షములను  ,పూలతీగలను ,చక్కగా నీడనిచ్చే వివిధ మహావృక్షములను ,గుబురుగా వుండే పొదలను ఏర్పాటు చేయింపుడు . 'అని ఆజ్ఞ ఇచ్చి తిరిగి తన కుమారుడితో 'పుత్రా !నిత్యమూ ధర్మ నిరతుడవై క్షత్రియ విధులను పాటించుచు ప్రజానురంకంగా పాలన చేయుము . కుమారా !పూర్వజన్మలో చేసిన సుకృత దుష్కృతముల ఫలితముగా మానవుడు వెళ్లవలిసిన ప్రదేశములకు వెళ్ళును ,సుఖదుఃఖములు అనుభవించును . కావున ఇందులకు నీవు వ్యధ చెందవలదు . అని పలికి తన కోసము చక్కగా ఏర్పాటు చేసిన గోతుల వద్దకు వెళ్లి వాటిలో ప్రవేశించెను . ఆయన ఊసరవెల్లిగా (తొండ) మారిపోయెను . అలా నృగ మహారాజు బ్రాహ్మణుల శాప ఫలితాన్ని అనుభవించుచున్నాడు ".అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలికెను .   

రామాయణము ఉత్తరకాండ ఏబదినాలుగవసర్గ సమాప్తము . 


                                                                                      శశి ,

                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




No comments:

Post a Comment