Thursday 16 December 2021

రామాయణము ఉత్తరకాండ -ఏబదిమూడవసర్గ

                         రామాయణము 

                       ఉత్తరకాండ -ఏబదిమూడవసర్గ 

లక్ష్మణుడు పలికిన మాటలు విన్న శ్రీరాముడు తమ్ముడితో "నాయనా !నీవు నా మనోభావములను బాగుగా గుర్తించిన బుద్ధిశాలివి . నీవంటి ఆత్మీయుడు లభించుట దుర్లభము.  అందునా ఈ దుఃఖ సమయములో తోడుగా ఉండుట విశేషము . లక్ష్మణా !నేను నాలుగు రోజుల నుండి పౌరకార్యములను పట్టించుకొనుటలేదు . కావున నాయనా !పురోహితులను ,మంత్రులను నా వద్దకు పంపుము . అలాగే కార్యార్థులై వచ్చిన స్త్రీ పురుషులను కూడా ఇక్కడికి పంపుము . నిత్యమూ ప్రజల గురించి ఆలోచించని రాజు ఘోరమైన నరకం పాలవుతాడు . దీనికి సంభందించిన ఒక కథ చెబుతాను విను 
పూర్వము నృగుడు అనే మహారాజు ప్రజాపాలకులలో గొప్పవాడిగా పేరు పొందాడని ప్రతీతి . అతడు వేదములను అధ్యయనము చేసినవాడు . బ్ర్రాహ్మణ భక్తి కలవాడు . సత్యవచనుడు ,మిక్కిలి పవిత్రుడు . ఒకానొక సందర్భములో పుష్కర తీర్థములందు బ్ర్రాహ్మణోత్తములకు బంగారముతో అలంకృతమైన దూడలతో కలిసి వున్న కోటి గోవులను దానము చేసెను . నాయనా ఆ కాలములోనే ఉంఛవృత్తితో జీవించే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు . అతడు నిత్యమూ అగ్నికార్యము నెరపుచుండెడివాడు . ఆ పుణ్యాత్ముడికి దూడతో కలిసిన ఒక ఆవు ఉండేది . రాజు దానము చేసిన కోటి ఆవులలో ఆ ఆవు దూడ కూడా కలిసిపోయాయి . అది గుర్తించని రాజు దానిని కూడా మిగిలిన ఆవులతో పాటు దానము చేసివేసెను . ఆకలిదప్పులతో బాధపడే బ్ర్రాహ్మణుడు తప్పిపోయిన తన ఆవును వెతుకుతూ అక్కడ ఇక్కడ తిరుగసాగెను . ఆలా సంవత్సరము గడిచిపోయెను . ఐనను ఆవును వెతుకుట ఆపలేదు . అలా వెతుకుతూ ,'కనఖలము 'అనే గ్రామమునకు చేరెను . ఆ గ్రామములో ఒక బ్రాహ్మణుడి ఇంట తన ఆవును చూసి గుర్తించెను . ఆ ఆవు ఆరోగ్యముగానే ఉన్నది కానీ దూడ మాత్రము బాగా బక్కచిక్కిపోయినది . అది చూసి వెంటనే ఆ విప్రుడు తన ఆవుని 'శబలా '!రా !'అని ఎలుగెత్తి పిలిచెను . ఆ పిలుపు విని తన యజమానిని గుర్తించి పరుగు పరుగున ఆయన వద్దకు వచ్చి ,ఆయన వెంట నడిచెను . అప్పటి వరకు ఆ ఆవుని పోషించిన బ్రాహ్మణుడు అది చూసి గబగబా నడిచి ఆ విప్రుడి వద్దకు వెళ్లి ,"ఇది నా గోవు . దీనిని నృగ మహారాజు నాకు విధ్యుక్తముగా దానము చేసెను . "అని పలికెను . 
ఆ విధముగా ఆ ఆవు కారణముగా ఆ ఇద్దరి బ్రాహ్మణుల మధ్య తీవ్ర వాదము జరిగెను . వారు ఆ విధముగా వాదించుకుంటూనే ఆ ఆవుని దానము చేసిన నృగ మహారాజు వద్దకు బయలుదేరిరి . వారు రాజభవనమునకు చేరిరి కానీ వారికి అందు ప్రవేశించుటకు ,రాజ దర్శనమునకు అనుమతి లభించలేదు . దాంతో వారిరువురు ఎంతో క్రుద్ధులయ్యిరి . దాంతో వారు మిక్కిలి కోపముతో "కార్యార్థులమై వచ్చిన మాకు నీవు దర్శనము ఈయకుంటివి . అందువలన నీవు సకల ప్రాణులకు కనపడకుండా ఒక తొండవై పడియుందువు . వందలవేలకొలది సంవత్సరాల పాటు ఒక గుంతలో నివసింతువు . ఈ లోకములో యదువంశములో వాసుదేవుడు అనే పేరుతో ఒక మహా పురుషుడు జన్మించును . ఆ మహాత్ముడు ఈ శాపము నుండీ నిన్ను రక్షించగలడు . "అని నృగ మహారాజుని శపించెను . 
పిమ్మట వారు ఆ ఆవుని మరో బ్రాహ్మణుడికి దానముగా ఇచ్చి ,తమ దారిన తాము పోయిరి . వారి శాప ఫలితముగా నృగ మహారాజు దారుణమైన ఫలితమును అనుభవించెను . "
నాయనా !కావున కార్యార్థులై వచ్చిన వారియొక్క వివాదమును పట్టించుకోననిచో ఆ దోషము రాజును చుట్టుకొనును . అందువలన కార్యార్థులై వచ్చిన వారికి వెంటనే నా దర్శనము కలుగునట్లు చూడుము . "అని శ్రీరాముడు లక్ష్మణుడితో పలికెను . 

రామాయణము ఉత్తరకాండ ఏబదిమూడవ సర్గ సమాప్తము . 

                                                             శశి ,

                                                  ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


No comments:

Post a Comment