Tuesday 21 December 2021

రామాయణము, ఉత్తర కాండ - ఏబది ఎనిమిదవ సర్గ

                              రామాయణము 

                                                                                                                                                                                                                                                                                                                                                                            ఉత్తర కాండ - ఏబది ఎనిమిదవ సర్గ

లక్ష్మణుడు తన అన్న అయిన శ్రీ రాముడు తెలిపిన గాధలను విని తన అన్నతో " మహా రాజా ! మీరు చెప్పిన గాధలు మిక్కిలి అద్బుతమయినవి ఎంతో ఆశ్చర్య కరమైనవి నిమి మహారాజు క్షత్రియుడు శూరుడు , మీదు మిక్కిలి యజ్ఞ దీక్షలో ఉన్నవాడు అట్టి మహారాజు మహాత్ముడయిన వశిష్ఠుడి విషయంలో సహనము చూపకుండుటకు గల కారణమేమిటి? . " అని అడుగగా శ్రీ రాముడు " మహావీరా! మనుషులు కొన్ని కొన్ని సందర్భాలలో తమ సహనమును కోల్పోవు చుందురు ఇది అత్యంత సహజము . దీనికి ఉదాహరణగా యయాతి మహారాజు కథ చెప్పెదను వినుము . 
నహుషుడి కుమారుడయిన యయాతి అనుక్షణము ప్రజల అభివృద్ధికై పాటుపడు చుండెడి మహారాజు . ఆయనకి ఇరువురు భార్యలు . వారుఇరువురు ఈలోకమున సాటిలేని సౌందర్య వతులు . వారిలో ఒక భార్య దైత్య వంశమునకు చెందిన వృషపర్వుని కుమార్తె అయిన శర్మిష్ట . మరో భార్య దైత్య గురువైన శుక్రాచార్యుని కుమార్తె . ఆమె సౌందర్యవతే అయినను రాజుకు ఆమె పై ఎక్కువ ప్రేమ లేకుండెను . ఆ ఇరువురికి చక్కని కుమారులు కలిగిరి . శర్మిష్ట కుమారుని పేరు పూరుడు . దేవయాని కుమారుని పేరు యదువు . 
పూరుడు తన సుగుణ సంపద చేత తల్లి శర్మిష్ట కారణముగా తండ్రికి ప్రీతీ పాత్రుడు అయ్యెను . ఈ విషయములో మనస్తాపము చెందిన యదువు తన తల్లి అగు దేవయానితో ఇట్లనెను . "అమ్మా! పూజ్యుడు , క్లిష్ట కార్యములను సైతం అవలీలగా సాధింప గల ప్రజ్ఞా శాలి అయిన శుక్రాచార్యుని కుమార్తెవు కదా అట్టి మహాత్ముని వంశమున పుట్టిన నువ్వు తీరని దుఃఖమును దుర్భరమయిన అవమానమును మనస్సులోనే భరించుచున్నావు . ఇట్లు అవమానముల పాలగుచు జీవించుట కంటే మనము అగ్నికి ఆహుతి అగుటయే యుక్తము.  రాజుని ఆ శర్మిష్ట తోనే, ఆమె కుమారులతోనే సంతోషముగా ఉండనివ్వు . ఒక వేళ నీవు ఈ దురవస్థ సహించ గలిగితే సహించు నాకు మాత్రం అట్టి శక్తీ లేదు . నేను ప్రాణ త్యాగం చేయుటకు నాకు అనుమతి ఇవ్వు . ముమ్మాటికీ నేను ప్రాణ త్యాగము చేసెదను . " అని పలుకగా 
ఆ మాటలు విన్న దేవయాని మిక్కిలి కోపం తో తన తండ్రి అగు శుక్రాచార్యుడిని స్మరించెను . శుక్రాచార్యుడు తన కుమార్తెతో పెల్లుబుగు చున్న దుఃఖము గ్రహించి త్వరత్వరగా ఆమె వద్దకు చేరెను . దీనావస్థలో ఉన్న ఆమె కుమార్తెను చూసి ' అమ్మా! ఇది ఏమి ఇట్లున్నావు ? ' అని అడిగెను . ఆయన ఆ విధముగా ప్రశించగా కోపంతో , బాధతో రగిలి పోతున్న దేవయాని ' తండ్రీ ! మండుతున్న అగ్నిలో ప్రవేశించి కానీ, విషము త్రాగి కానీ , నీళ్లలో దూకి కానీ , నా జీవితమును చాలించెను . నాకు జరిగిన అవమాన భారమును భరించ లేకున్నాను  . భార్గవ ఆ రాజర్షి నీయందు అనాదరణ  భావం చూపుచున్నట్లే నాయందును అనాదరణ  భావమునే కలిగి ఉన్నాడు . అతడు నన్ను ఏమాత్రము గౌరవించుట లేదు " . అని దేవయాని పలుకగా ఆ మాటలు విన్న శుక్రాచార్యుడు మిక్కిలి కోపించి యయాతిని ఇట్లు శపించెను . " యయాతి నీవు చేసిన దోషమునకు కాను నీవు తీవ్రమైన వార్ధక్యమునకు గురై మిక్కిలి అశక్తుడవు అగుదువు . " . ఇలా శపించిన పిమ్మట తన కూతురుని ఊరడించి స్వగృహమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ ఏబది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                                                                               శశి ,

                                                                                    ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 















No comments:

Post a Comment