Thursday, 30 December 2021

రామాయణము , ఉత్తరకాండ ---- డెబ్బది ఎనిమిదవసర్గ

                             రామాయణము 

                         ఉత్తరకాండ ---- డెబ్బది ఎనిమిదవసర్గ 

రఘురామా! నేను పలికిన మాటలు విని ఆ మహాపురుషుడు అంజలి ఘటించి , " బ్రాహ్మణోత్తమా! నా పూర్వ వృత్తాంతమును తెలిపెదను వినుము . విదర్భ మహారాజు అయిన సుదేవ మహారాజు నా తండ్రి ఆయనకీ ఇద్దరు కుమారులు నా పేరు స్వేతుడు   , తమ్ముడి పేరు సురథుడు మా తండ్రి స్వర్గస్తుడైన పిమ్మట ప్రజలు నన్ను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుడిని చేసితిరి . నేను న్యాయముగా ధర్మ మార్గం లో ప్రజలను కాపాడుతూ , వేయి సంవత్సరములు రాజ్యపాలన చేశాను . ఒక రోజు నా ఆయుః ప్రమాణము తెలిసి నా తమ్ముడైన సురధుడిని రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి ఈ సరోవర తీరమునకు చేరి . మూడువేల సంవత్సరాల కాలము తీవ్రముగా తపస్సు చేసినాను . పిమ్మట సూక్ష్మ శరీరంతో సత్యలోకమును చేరాను . అయినను నన్ను ఆకలి దప్పులు బాధింప సాగినవి . ఆ భాధను తట్టుకోలేక బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి " దేవా! బ్రహ్మలోకము వచ్చినను ఆకలి దప్పులు నన్ను విడిచి పెట్టుట లేదు . నేను చేసిన పాపము ఏది? . ఇప్పుడు నాకు ఆహారము ఏమిటో దయచేసి తెలుపుము . " అని ప్రార్ధించాను . 
నా మాటలు విన్న బ్రహ్మదేవుడు " నాయనా! నీవు తపస్సుకు ప్రాధాన్యమియ్యక నీ శరీర పోషణ యందే శ్రద్ద కనపరిచితివి . బిక్షాటన చేయుచూ వచ్చిన యతీశ్వరులకు గాని, అతిధి దేవుళ్ళకి గాని భిక్షపెట్ట కుంటివి . దేవతలకు గాని పితృ దేవతలకు గాని స్వల్పంగా అయ్యినా దానము చెయ్యక ఏకాగ్రతలేని , తపస్సు ఆచరించుచూ వచ్చితివి . కావుననే  నీకు స్వర్గము చేరినప్పటికీ ఆకలి దప్పుల బాధ తీరకుండెను . భూలోకంలో పడి  ఉన్న నీ శరీరమే నీకు ఆహరం నాయనా! మహా పురుషుడైన అగస్త్య మహాముని ఈ వనమున అడుగిడిన పిమ్మట నీవు ఈ పాపమునుండి విముక్తి పొందుదువు . సౌమ్యా! ఆ మహానుభావుడు దేవతలను సైతం తరింప చేయగల సమర్థుడు . ఇక నిన్ను ఉద్దరించుట ఆయనికి ఒక క్లిష్ట విషయం కాదు . " అని పలుకగా ఆ నాటి నుండి నేను నా కళేభరమునే ఆహారముగా భక్షించుచున్నాను . అనేక సంవత్సరముల నుండి నేను భక్షించుచున్నపటికి ఇది ఏమాత్రం తరుగలేదు . మహాత్మా! నాకు ఈ పాపము నుండి విముక్తి కలిగించుము . కారణం జన్ముడవైన నీకు తప్ప మరెవ్వరికీ ఇది సాధ్యముకాదు . ద్విజోత్తమా ! ఈ ఆభరణమును స్వీకరించుము . ఈ దివ్యాభరణము నీకు బంగారమును ధనమును , వస్త్రములను , భక్షభోజ్యములను , సమస్త  భోగ్య పదార్ధములను నీకు సమకూర్చ గలదు . ఇక నీవే నాకు దిక్కు " అని ప్రార్ధించగా ఆ మాటలు విని అతడు అందించుచున్న ఆభరణమును తీసుకున్నాను . వెనువెంటనే శవము అదృశ్యమయ్యెను . అది చూసి సంతోషించిన స్వెతుడు పరమానందంతో స్వర్గమునకు వెళ్లెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియెనిమిదవసర్గ సమాప్తము . 

                                                                                        శశి ,

                                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 



రామాయణము, ఉత్తరకాండ ---- డెబ్బది ఏడవసర్గ

                             రామాయణము 

                              ఉత్తరకాండ ---- డెబ్బది ఏడవసర్గ  

అగస్త్యుడు శ్రీ రాముడితో " రామా! పూర్వం ఒక మహారణ్యం ఉండేది . దాని వైశాల్యం వంద యోజనములు . అందులో మృగములు కానీ , పక్షులు కానీ లేకుండెను . ఆ వనం లో తపస్సు చేయదలచి అరణ్యమంతా తిరిగితిని . అక్కడ అనేక రకముల వృక్షాలు రుచికరములైన ఫలములు కలవు . ఆ అరణ్య మధ్యభాగంలో ఒక మహా సరస్సు కలదు . ఆ సరస్సులో అనేక పద్మములు, కలువలు కలవు . హంసలతో చక్రవాకంతో మిక్కిలి మనోహరంగా కలదు . దానిలోని నీరు మధురంగా ఉండెను . ఆ సరస్సు సమీపంలో ఒక ఆశ్రమం కలదు . అది పురాతనమైనదీ అత్యంత పవిత్ర మైనది . అందులో ఎవరు లేకుండిరి . పురుషోత్తమా! అక్కడ వేసవికాలమునందు నేను ఒక రాత్రి నివసించితిని . 
ప్రాతఃకాలమే లేచి స్నానమునకై సరోవర తీరమునకు వెళ్లితిని . అక్కడ దృడంగా ఉన్న ఒక యువకుని శవం  కనిపించింది "ఇది ఏమి?" అని ఆలోచిస్తూ నేను అక్కడ నిలబడి ఉన్నాను .అప్పుడు అత్యద్భుతంగా ఉన్న హంసలు పూన్చబడి ఉన్న ఒక దివ్య విమానం కనిపించింది . ఆ విమానంలో వేలకొలది  అప్సరసలచే సేవింప బడుచున్న దివ్యమైన ఆభరణాలను ధరించిన ఒక మహా పురుషుడు ఉన్నాడు . అతడు నేను చూస్తుండగానే విమానం నుండి కిందకి దిగి అక్కడ ఉన్న శవమును భక్షించుచున్నాడు . పిమ్మట అతడు సరస్సులోకి దిగి శుద్ద ఆచమనము (చేతులు , నోరు  శుభ్రపరుచుట ) గావించి, తిరిగి విమానము ఎక్కుటకు సిద్దపడగా నేను అతనితో "అయ్యా! దేవతా స్వరూపుడవైన నీవు ఎవరు ? నింద్యమైన ఇట్టి ఆహారము ఎలా భుజించితివి ? దయతో తెలుపుము . " అని ప్రశ్నించితిని .  

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియేడవసర్గ సమాప్తము . 

                                                                                       శశి ,

                                                                                   ఎం . ఏ ,ఎం. ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 




Wednesday, 29 December 2021

రామాయణము ఉత్తరకాండ ---- డెబ్బది ఆరవసర్గ

                               రామాయణము 

                      ఉత్తరకాండ ---- డెబ్బది ఆరవసర్గ 

శ్రీ రాముడు పలికిన మాటలు విని అధోముఖుడై ఉన్న ఆ తాపసి అట్లే ఉండి " మహా యశస్వి నేను శూద్రుడను , నా పేరు శంభుకుడు , నేను ఈ శరీరంతోనే దివ్యత్వం పొందగోరుచున్నాను . అంతే కాదు దేవలోకమును జయింప దలచి ఇట్టి ఉగ్రతపస్సుకు పూనుకుంటిని . " అని పలికెను . ఆ మాటలు  విన్న శ్రీ రాముడు వెంటనే తన ఖడ్గమును తీసి అతడి శిరస్సు ఖండించెను . ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి శ్రీ రాముడిని మాటిమాటికి ప్రశంసించిరి . అప్పుడు అన్ని వైపుల నుండి శ్రీ రాముడిపై పూల వాన కురిసెను . అప్పుడు దేవతలు " రామా! నీవు చేసిన ఈ కార్యం దివ్యమైనది లోకకళ్యాణదాయకం కావున , ఇష్టమైన వరమును కోరుకొనుము " అని పలికిరి . 
ఆ మాటలు విన్న శ్రీ రాముడు అంజలి ఘటించి " నాయందు దేవతలు ప్రసన్నులైనచో బ్రాహ్మణ బాలుడు జీవించుగాక, నాకు ఈ ఒక్క వరము చాలు . " అని పలుకగా , ఆ మాటలు విన్న దేవతలు మిక్కిలి సంతోషించి " రామా! నీవు ఆ శూద్రుడిని సంహరించిన క్షణమే ఆ బాలుడు పునర్జీవితుడైనాడు . ఇక మా వరం తో పనిలేదు . నీకు మేలు చేకూరును శుభములు పొందగలవు . మహా తేజస్వి అయిన  అగస్త్యమహర్షి జలములనే శయ్యగా చేసుకొని పన్నెండు సంవత్సరములుగా తపస్సు చేయుచున్నాడు . ఆయన దీక్ష సమాప్తమైనది.  మేము ఆయనని  అభినందించుటకై అక్కడికి వెళ్లుచున్నాము . నీవు కూడా రా! నీకు మేలగును . అని పలుకగా రాముడు అట్లే అని తన పుష్పకముతో దేవతల విమానములు అనుసరించి అగస్త్య మహాముని ఆశ్రమం వైపుగా వెళ్లెను . 
అగస్త్యముని తన ఆశ్రమమునకు వచ్చిన దేవతలని చూసి పూజించెను . దేవతలు ఆయన్ని అభినందించిరి . పిమ్మట వారంతా తమతమ స్థానములకు వెళ్లిరి . దేవతలు వెళ్లిన పిదప శ్రీ రాముడు పుష్పకము నుండి దిగి అగస్త్యమహామునికి అభివాదం చేసెను . ఆ మహాముని శ్రీ రాముడిని ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసి " రఘురామా! నీకు స్వాగతం నా అదృష్టం కొద్దీ నీ దర్శనం లభించినది . అర్హతలేనివాడు తపస్సు  చేయుటకు పూనుకొనగా నీవు అతన్ని హతమార్చి ఇక్కడికి వచ్చావని దేవతలు నాకు చెప్పెను . నీ వలన ఆ బ్రాహ్మణ సుతుడు పునర్జీవితుడైనాడు ఈ రోజు నీవు ఇక్కడే విశ్రమించి రేపు ఉదయమే అయోధ్యకు వెళ్లుము . రామా! ఇది విశ్వకర్మ నిర్మించిన దివ్యాభరణము ఇది అద్భుతమైన ఆకృతిచే కాంతులచే తేజరిల్లుచున్నది.  నా తృప్తికొరకు దీనిని స్వీకరింపుము . దీన్ని ధరించుటకు ఇంద్రాది దేవతల కంటే కూడా నీవే అర్హుడవు . " అని పలికెను . 
శ్రీ రాముడు "తపోధనా ఈ దానం పుచ్చుకోనుటకు బ్రాహ్మణుడే తగిన వాడు.  క్షత్రియుడైన నేను అందునా బ్రాహ్మణుని నుండి దానం పుచ్చుకొనుట ఎంత వరుకు సమంజసం . దయతో ఈ విషయమును వివరింపుము . " అని పలుకగా అగస్త్యుడు " రామా! పూర్వకాలమున కృతయుగమున ప్రజలకు రాజులేకుండెను . దేవతలకు మాత్రం ఇంద్రుడు ప్రభువుగా ఉండెను . అప్పుడు అందరు బహ్మదేవుడిని ప్రార్ధించగా ఆయన ఇంద్రాది దిక్పాలకులని ఆహ్వానించి విషయము వివరించి " మీరందరు మీ తేజస్సుల్లో ఒక్కొక్క అంశమును ఇవ్వండి ఆ అంశాలతో ఒక పాలకుడు ఏర్పడును . " అని పలుకగా అప్పుడు ఇంద్రాది లోకపాలకులు తమ తేజస్సునుండి ఒక్కొక్క అంశను బ్రహ్మదేవుడికి సమర్పించిరి . ఆ సమయంలో బ్రహమ దేవుడికి ఒక తుమ్ము వచ్చెను . ఆ తుమ్ము నుండి 'క్షుపుడు అను వాడు ఆవిర్భవించెను . లోకపాలురు ఇచ్చిన అంశలతో బ్రహ్మ దేవుడు క్షుపుడిని తీర్చిదిద్ది ప్రజలకు ప్రభువుగా నియమించెను . 
పిమ్మట ఆ క్షుపుడు ఇంద్రుడి తేజాభాగముతో రాజ్యము పరిపాలించ సాగేను . వరుణ దేవుడి అంశతో ప్రజలకు పుష్టి చేకూర్చెను . కుబేరుడి తేజస్సుతో ప్రజలకు సిరి సంపదలు సమకూర్చెను . యముడి తేజస్సుతో దండనా  విభాగమును నిర్వహించెను . రామా! ఇంద్రాది దిక్పాలకుల తేజోభాగములో నీలోను వర్ధిల్లు చున్నవి . కావున నేను సమర్పిస్తున్న ఈ ఆభరణమును స్వీకరింపుము " అని పలుకగా శ్రీ రాముడు ఆ ఆభరణమును స్వీకరించి " మహాత్మా ఈ ఆభరణము అత్యద్బుతముగా ఉన్నది అమోఘమైన దీని ఆకారము దివ్యముగా ఉన్నది . ఇది మీకు ఎలా ప్రాప్తించింది? నాలోని కుతూహలము కొద్దీ నిన్ను అడుగు చున్నాను . " అని అడుగగా అగస్త్యుడు " ఓ మహాబాహు! ఈ వనము నందే ఒక రమణీయ ప్రదేశములో ఒక దివ్య పురుషుడి నుండి నేను దాన్ని స్వీకరించితిని " అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియారవసర్గ సమాప్తము . 

                                                                          శశి ,

                                                                                           ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

 

రామాయణము , ఉత్తరకాండ --- డబ్బది ఐదవసర్గ

                           రామాయణము 

                      ఉత్తరకాండ ------ డెబ్బది ఐదవసర్గ 

                

నారదుడు పలికిన మాటలు విన్నంతనే శ్రీ రాముడు చాలా సంతోషించి లక్ష్మణుడితో " సౌమ్యా ! బ్రాహ్మణోత్తముడి వద్దకువెళ్లి ఆయన్ని ఊరడించు మృత బాలుడి కళేబరం దెబ్బతినకుండా దానిని సుగంధములతో సువాసనలుగల తైలములతో భద్రపరుచునట్లు చూడుము . నిపుణులైనవారిచే భద్రత కల్పించుము . అవయవములు యదాతదంగా ఉండునట్లు రూపం మారిపోకుండా ఉండునట్లు జాగ్రత్తలు తీసుకొనుము . " అని ఆదేశించి పుష్పకమును తలుచుకోగా అది వెనువెంటనే అక్కడకి వచ్చినది . అప్పుడు శ్రీ రాముడు మునీశ్వరులకి నమస్కరించి నగర రక్షణ బాధ్యతను భరత లక్ష్మణులకు అప్పగించి ధనుర్భాణాలు, తుణీరాలు, ఖడ్గము తీసుకొని విమానమును అధిరోహించెను . 
శ్రీ రాముడు పడమర దిశ , ఉత్తర దిశ , పూర్తిగా అంతటా అన్వేషించి అక్కడ ఏ దుష్కృత్యములు జరగకుండుట చూసి , దక్షిణ దిశకు వెళ్లెను .అక్కడ శైవల పర్వతమునకు ఉత్తర భాగమున కల ఒక మహా సరస్సు ఆయనకి కనిపించెను . ఆ సరస్సు తీరంలో తపస్సు చేస్తున్న ఒక తాపసిని  చూసేను . ఆ తపస్వి అధోముఖుడై వ్రేలాడుచుండెను . ఆయన్ని చూసిన శ్రీ రాముడు అతని వద్దకు వెళ్లి " వ్రతనిష్టా గరిష్టుడా ! నీవు ఎవరు? నేను దశరధుని కుమారుడను . నా పేరు శ్రీ రాముడు నీవు ఇంత తీవ్రమైన తపస్సును ఎందుకు ఆచరించుచున్నావు . నీవు కోరుకొనుచున్న వరమేమి?. స్వర్గ భోగములు కావలెనా? , లేక వాటి కంటే మించినది కావలెనా ?, ఏ నిమిత్తమై ఇంతటి తపస్సుకి పూనుకుంటివి? . " అని పలికెను .  

రామాయణము ఉత్తరకాండ డెబ్బదియైదవసర్గసమాప్తము . 

                                                                                          శశి ,

                                                                                                          ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు  పండితులు . 

 

Tuesday, 28 December 2021

రామాయణము ఉత్తరకాండ -డెబ్బదినాలుగవసర్గ

                       రామాయణము 

                     ఉత్తరకాండ -డెబ్బదినాలుగవసర్గ  

దుఃఖశోకములతో బావురుమంటూ బ్రాహ్మణుడు పలికిన దయనీయమైన విలాపవచనములను శ్రీరాముడు వినెను . శ్రీరాముడు దుఃఖసంతప్తుడై వెంటనే మంత్రులను ,వశిష్ట వామదేవాది తపోధనులను ,పురప్రముఖులను ,తన తమ్ముళ్లను పిలిపించెను . 
శ్రీరాముడు తన పిలుపుతో సభకు వచ్చినవారందరినీ చూసి వారికి అంజలి ఘటించి ,పుత్రవియోగ దుఃఖముతో వృద్దబ్రాహ్మణుడు తనను తప్పుపడుతూ పలికిన పలుకులను వారికి తెలిపెను . శ్రీరాముడి మాటలు విన్న నారదమహర్షి "రఘురామా !ఒక రాజు యొక్క దేశములో ఎవడైనా బుద్ధిలేనివాడు అధర్మమునకు ,అకృత్యమునకు ఒడికట్టినచో ఆ రాజ్యములో సంపదలు నశించును . అంతేకాదు రాజుకూడా నరకముపాలగును . ధర్మముగా ప్రజలను పాలించు రాజునకు వేదాధ్యయనము ,తపస్సు ,సుకృతకర్మలు చేయునట్టి ధర్మాత్ముల పుణ్యములో ఆరవభాగము చెందును . నీ రాజ్యమంతా గాలించుము . ఎవడో అధర్మకార్యమునకు వడిగట్టినాఁడు . దాని ఫలితమే ఇది . ఆ అధర్మమును నివారించుటకు ప్రయత్నించుము . అలాచేస్తే ధర్మము వర్ధిల్లుతుంది . అంతేకాదు ,నీకు ప్రజలకు ఆయుర్వృద్ధి కలుగుతుంది . ఆ బాలుడు కూడా పునర్జీవితుడు అవుతాడు . "అని పలికెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదినాలుగవసర్గసమాప్తము . 

                                                                               శశి ,

                                                                                        ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 


 

రామాయణము ఉత్తర కాండ -డెబ్బదిమూడవసర్గ

                           రామాయణము 

                            ఉత్తర కాండ -డెబ్బదిమూడవసర్గ  

శ్రీరాముడు శత్రుఘ్నుడిని మదుపురమునకు పంపివేసిన పిమ్మట ,తమ్ముళ్ళతో కలిసి ధర్మయుక్తముగా పరిపాలనచేయుచుండెను . అలా కొన్నిదినములు గడిచినపిమ్మట ,ఒక వృద్ధ బ్రాహ్మణుడు మృతబాలుని శరీరము తీసుకుని రాజభవనద్వారము వద్దకు వచ్చెను . అతడు దుఃఖముతో పుత్రా !పుత్రా !అని బిగ్గరగా ఏడుస్తూ "నేను పూర్వజన్మలో ఎటువంటి పాపకృత్యములను చేసినానో ఆ పాప ఫలితముగా నా ఏకైక పుత్రుడు మృత్యువాత పడుట చూడవలసి వచ్చినది . నీవు ఇంకనూ పసివాడవు . యవ్వనమున అడుగుపెట్టలేదు  . నీ వియోగముతో నేను ,మీ అమ్మా ,త్వరలోనే మృత్యువుపాలగుట తధ్యము . నేను ఇంతవరకు అసత్యమాడి కానీ ఎవరినీ హింసించి కానీ ,ఏ ప్రాణిని కష్టపెట్టికానీ ఎరుగను . 
ఈ దేశములో బాలురకు మృత్యువు సంభవించుట బట్టీ ,ఈ రాజ్యాధిపతి అయిన శ్రీరాముని దోషము ఇందులో ఎంతోకొంత ఉండితీరును . ఇది నిశ్చయము . రాజా !నీ దేశములో మృతిచెందిన ఈ బాలుని నీవు బ్రతికింపుము . 
లేనిచో దిక్కులేనివారివలె నేను నా భార్య ఈ రాజభవనద్వారము వద్దనే ప్రాణత్యాగము చేసికొందుము . ఆ బ్రహ్మహత్యాపాతకమును అనుభవించుచు కలకలకాలము సుఖముగా ఉండుము . "అంటూ పుత్రవియోగముతో తల్లడిల్లుచున్న ఆ బ్రాహ్మణుడు ఇలా అనేక మాటలచే రాజును తప్పుబడుతూ శోకభారంతో ఆ బాలుని కళేబరమును గుండెలకు హత్తుకొనెను . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదిమూడవసర్గసమాప్తము . 

                                                                               శశి ,

                                                                                      ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 





రామాయణము ఉత్తరకాండ -డెబ్బదిరెండవసర్గ

                        రామాయణము 

                           ఉత్తరకాండ -డెబ్బదిరెండవసర్గ  

శత్రుఘ్నుడు శయనించిననూ ఆయనకు రామాయణ దివ్యగాధే తలపునకు వచ్చి ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు . మరునాడు సంధ్యావందనాది క్రియలని ముగించుకుని వాల్మీకి మహర్షి అనుమతి తీసుకుని అయోధ్యకు వెళ్లెను . అయోధ్యలో శ్రీరాముని దర్శించి పరమానందభరితుడై అభివాదం చేసి ,"మహారాజా !నీవు ఆజ్ఞాపించినట్లుగా లవణాసురుడిని అంతమొనర్చి మదుపురమును పునర్నిర్మాణము చేసితిని . నీకు దూరముగా ఆ నగరములో 12 సంవత్సరములు గడిపితిని . తల్లికి దూరమైన దూడ వలె నేను ఎక్కువకాలం అక్కడ ఉండలేను . "అని పలికెను . 
తమ్ముడిని చూసి అతడి మాటలు విన్న శ్రీరాముడు శత్రుఘ్నుడిని అక్కున చేర్చుకుని ,"మహావీరా !ఏ మాత్రము విషాదమునకు లోను కావద్దు . ఇది క్షత్రియుల లక్షణము కాదు . ఆత్మీయులకు దూరమై అన్యప్రదేశములో వున్నప్పటికి రాజులు దుఃఖింపరాదు . నన్ను కలుసుకొనుటకై అప్పుడప్పుడు అయోధ్యకు వస్తూ వుండు . నాకు కూడా నీవు ప్రాణముల కంటే మిన్న . మనకు రాజ్యపాలన అవశ్య కర్తవ్యము "అని పలికెను . శ్రీరాముడి మాటలను అంగీకరించి శత్రుఘ్నుడు అయోధ్యలో ఏడు రోజులు ఉండి తిరిగి మదుపురమునకు పయనమయ్యెను . అలా మదుపురమునకు వెళ్లుచున్న శత్రుఘ్నుడిని కొంత దూరము భరతలక్ష్మణులు అనుసరించి సాగనంపిరి . 

రామాయణము ఉత్తరకాండ డెబ్బదిరెండవసర్గ సమాప్తము . 

                                                                      శశి ,

                                                                              ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .